ఐదు ఫైళ్లపై సంతకాలు.. ఆచి తూచి అడుగేసిన చంద్రబాబు
x

ఐదు ఫైళ్లపై సంతకాలు.. ఆచి తూచి అడుగేసిన చంద్రబాబు

ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకోగానే ఐదు ఫైల్స్ పై మొదట సంతకాలు చేశారు. ఆ ఐదు ఫైల్స్ ఏమిటి?


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో ఐదు ఫైల్స్‌కు సంబంధించి సంతకాలు చేశారు. ఈ ఐదు ఫైల్స్‌పై సంతకాలు పెద్దగా ఆర్థిక భారం పడకుండా ఉండేవి ఎంపిక చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు హామీలు ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పొచ్చు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై త్వరలోనే చర్చించి అమలుకు చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఐదేళ్ల తరువాత మళ్లీ ఆకుర్చీలో చంద్రబాబు
ఐదేళ్ల తరువాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఏపి సచివాలయంలో అడుగు పెట్టారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ముఖ్యమంత్రి చాంబర్‌లో ఐదు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. మొదటి సంతకాన్ని మెగా డిఎస్సీపై చేయడం విశేషం. రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై చేశారు. మూడో సంతకం పింఛన్‌ల పెంపుపై చేశారు. నాలుగో సంతకం అన్నక్యాంటిన్ల పునరుద్దరణ, ఐదో సంతకం నైపుణ్య గణనపై చేశారు.
త్వరలో సవరణలతో డిఎస్సీ నోటిఫికేషన్‌
ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్‌సీపై సంతకం చేశారు. ఈ డిఎస్‌సీలో కేటగిరీల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి. ఎస్‌జీటీ పోస్టులు 6,371, పీఈటీ పోస్టులు 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు 7725, టీజీటీ పోస్టులు 1781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్‌ పోస్టులు 52 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నీతి ఆయోగ్‌ సూచనల మేరకు తయారు చేశారు. ఈ చట్టం కింద భూమి యజమానులకు సంబంధించిన వివరాలు, రికార్డులు డిజిటలైజ్‌ చేస్తారు. గ్రామ స్థాయిలో భూముల యజమానుల సమక్షంలో భూమి కొలతలు వేసి ఖచ్చితమైన హద్దులు నిర్థారిస్తారు. ఇవన్నీ చూడటం కోసం రెవెన్యూలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఇందుకు సంబంధించిన విభాగం ఏర్పాటైంది. జిల్లా స్థాయిలోనూ అధికారులను నియమించారు. డివిజన్, మండల స్థాయిలో అధికారుల నియామకాలు జరగాల్సి ఉంది. భూమి వివాదాలు వస్తే ఈ చట్టం వల్ల కింది కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదని, నేరుగా హైకోర్టు, సుప్రీ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఎన్నికల్లో భూమి యాజమాన్య హక్కు చట్టం తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.
ఏప్రిల్‌ నుంచి పింఛన్‌ల పెంపు అమలు
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్‌ల పెంపు అమలు చేసేందుకు రెండో సంతకం పెట్టారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 3వేల పింఛన్‌ను ఇక నుంచి రూ. 4వేలు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్‌లు తీసుకునే వారు 65.69 లక్షల మంది ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పింఛన్‌లు ఇస్తారు.
అన్న క్యాంటిన్‌ల పునరుద్ధరణ
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటిన్‌లను ఏర్పాటు చేసింది. పేదలకు రూ. 5లకే భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రద్దు చేసింది. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే పునరుద్ధరిస్తూ చంద్రబాబు నాలుగో సంతకం చేశారు.
నైపుణ్య గణన
రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న వారు వివిధ నైపుణ్యాలకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా గణన జరగనందున నిరుద్యోగుల్లో నైపుణ్యాల గురించి తెలుసుకునేందుకు నైపుణ్య గణన చేపట్టేందుకు ఐదో ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు.
సూపర్‌ సిక్స్‌ గురించి పట్టించుకోని చంద్రబాబు
బాబు ష్యూరిటీ–భవిష్యత్‌ గ్యారెంటీ పేరుతో ఎన్‌డీఏ కూటమి ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి హామీలు ఇచ్చింది. ఇందులో యువతకు రూ. 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకు రూ. 3000లు నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15వేలు, ప్రతి రైతుకు ఏటా రూ. 20వేలు ఆర్థిక సాయం, ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500లు, మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సూపర్‌ సిక్స్‌ పథకాల గురించిన ఊసే లేకుండా ఈ ఐదు ఫైల్స్‌పై సంతకాలు చేశారు.
స్వాగతించ దగినవే..
సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన ఐదు ఫైల్స్‌ స్వాగతించ దగినవేనని రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మినారాయణ అన్నారు. డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే ఆర్థిక భారంతో కూడుకున్న అంశమే. నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అనేది దుర్మార్గమైంది. దీనిని రద్దు చేయాల్సిందే. ఎన్నోసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశాము. పింఛన్‌ల పెంపు కూడా ముసలి వారికి ఆసరాగా ఉంటుంది. మరికొంత పెంచి ఇచ్చినా మంచిదే. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేయాలని ఎంతో కాలం నుంచి అడుగుతున్నామని, ఇది రైతుల పాలిట దుర్మార్గమైన చట్టమని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో మంచి నిర్ణయమన్నారు. మెగా డీఎస్సీ కూడా నిరుద్యోగులకు ఎంతో ఊరట ఇస్తుందన్నారు. పింఛన్‌ల పెంపు కూడా వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్గకాలిక వ్యాధులతో బాధ పడేవారికి ఉపశమనం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్‌ సిక్స్‌పై ఆచితూచీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
సీఎంగా బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలోకి రాగానే సచివాలయ ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Read More
Next Story