చంద్రబాబు చేసిన ఆ హెచ్చరిక వైసీపీ వాళ్లను ఉద్దేశించేనా?
x
అసెంబ్లీలో మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 

చంద్రబాబు చేసిన ఆ హెచ్చరిక వైసీపీ వాళ్లను ఉద్దేశించేనా?

ముసుగు ఎవరిదీ? నేరాలు ఎవరివీ? చంద్రబాబు ఎందుకంతగా హెచ్చరించాల్సి వచ్చింది? రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే సహించేదే లేదన్నారు చంద్రబాబు.


ముసుగు ఎవరిదీ? నేరాలు ఎవరివీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంతగా హెచ్చరించాల్సి వచ్చింది? రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే సహించేదే లేదన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించకూడదు. అలా హెచ్చరించడానికి బదులు ఒక్క రాజకీయ పార్టీలనే టార్గెట్ చేయడం కక్షసాధింపు చర్యలకు దారి తీయదా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో, టీవీలలో చంద్రబాబు వ్యాఖ్యలపై జోరుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఆడబిడ్డల రక్షణ గురించి మాట్లాడడం ముదావహం అంటున్నాయి మహిళా సంఘాలు.
చంద్రబాబు ఏమన్నారంటే...
"ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తాం. మహిళల రక్షణ కోసం శక్తియాప్‌ తెచ్చాం. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్‌ ఆర్డర్‌ ముఖ్యం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. గత ప్రభుత్వ హయంలో భాధ్యత కలిగిన ప్రతిపక్షంగా టిడిపి ఆందోళన చేస్తే తమ కార్యాలయంపైనే దాడికి దిగారు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యాలయమంటే దేవాలయం, గతంలో ఎక్కడా పార్టీ ఆఫీసులపై దాడులు జరిగిన ఘటనలు లేవు" అన్నారు.
"రాజకీయ కక్షసాధింపులకు తాను దూరం. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. స్వార్థం కోసం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో గంజాయి పండించేందుకు వీల్లేదు. గంజాయి సాగుచేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం, తమ పిల్లలు ఎలా ఉంటున్నారో తల్లిదండ్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేయాలి" అని కోరారు.
భూ కబ్జాలపై కొత్త చట్టం...
ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిషేధ కింద కొత్తచట్టం తీసుకొస్తున్నామని, గత పాలకులు చేసిన భూ మాఫియా అంతా ఇంత కాదని తెలిపారు. 22ఏ ఉపయోగించి భూదందాలు చేశారని, రికార్డులు తారుమారు చేస్తూ ప్రభుత్వ, పేదల, ఫారెస్ట్‌ భూములు కొట్టేశారని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం తీసుకువస్తున్నామని, ఎవరైనా భూ కబ్జాకు పాల్పడాలంటే భయపడే విధంగా ఉంటుందని తెలిపారు.
సాక్షులెలా చనిపోతున్నారు...
వివేకానంద రెడ్డి హత్య కేసు తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అరాచకాలు చేసి కూడా నేడు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకోవచ్చనుకుంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వవని హెచ్చరించారు.
బహుశా ఈ హెచ్చరిక వైసీపీ నేతలను ఉద్దేశించే చేసి ఉంటారనే దానిలో సందేహం లేదు. త్వరలో మరెవరిపైనైనా వేటు పడుతుందా అనే చర్చ కూడా ఈ సందర్భంలో మొదలైంది.
Read More
Next Story