అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు ప్రణాళిక సిద్ధం
x

అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు ప్రణాళిక సిద్ధం

అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారులతో కీలక సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. వంద రోజుల ప్రణాళికను రెడీ చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పురుద్దరించనున్నట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మళ్ళీ పేదవాడికి రూ.5 లకే భోజన సదుపాయం కల్పిస్తామని, అందుకోసం అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే వీటి పునరుద్ధరణ ఉత్తర్వులపై సంతకం చేస్తానని కూడా వెల్లడించారు. చెప్పినట్లే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన తొలి ఐదు సంతకాల్లో మూడో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపైనే పెట్టారు. అంతేకాకుండా ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణ గురించి అధికారులతో చర్చించారు.

కార్యాచరణ సిద్ధం

అన్న క్యాంటీన్ల పురుద్దరణ గురించి అధికారులతో చర్చించిన చంద్రబాబు.. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేయడానికి తీసుకోవాల్సిన వంద రోజుల ప్రణాళిక చర్యలను రెడీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 21 తేదీలోగా 203 క్యాంటీన్లను పునరుద్దరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఆ దిశగా నిపుణుల సలహాలు సూచనలతో ప్రణాళికను సిద్ధం చేశారు.

పరిస్థితి పరిశీలించిన తర్వాతే

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణలో పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను కూడా చంద్రబాబు భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, వాటికి కావాల్సిన మరమత్తులు చేయించి వాటిని వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చసిన 203 భవనాల్లో అప్పట్లోనే 184 భవనాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా సెప్టెంబర్ 21 నాటికి పూర్తి చేసి మొత్తం 203 క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. వాటి నిర్మాణం కోసం కావాల్సిన టెండర్లను పిలవాలని కూడా ప్రభుత్వం వెల్లడించింది.

కార్యాచారణ ప్రణాళిక ఇలా

జూన్ 15: పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాలు, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించాలి.

జూన్ 19: క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేయాలి.

జూన్ 30: ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్లకు కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్లు స్థలాలను ఎంపికచేయాలి. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలి.

జులై 30: క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి. ఐఓటీ పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి.

అగస్టు 10: క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి.

అగస్టు 15: మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలి.

సెప్టెంబరు 21: పుర, నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను సెప్టెంబరు 21లోగా ప్రారంభించాలి.

Read More
Next Story