
భారీ వినాయకుడికి చంద్రబాబు పూజలు
తాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కలగకుండా చూడాలని వినాయకుడిని వేడుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో కార్యసిద్ధి మహా శక్తి గణపతికి పూజలు చేశారు. 72 అడుగుల అతి భారీ వినాయక విగ్రహాన్ని డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో విజయవాడ సితార సెంటర్‌లో ఏర్పాటు చేశారు. సేవా సమితి సభ్యుల ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి విజయవాడ సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను ఆయన అభినందించారు. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలో తాము చేపడుతున్న డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు రాకుండా వినాయకుడిని కోరుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గణపతి దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. గతంలో విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరదలు మళ్లీ మళ్లీ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
గోదావరి నుంచి భారీ ఎత్తున 1500 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వృధాగా కలుస్తున్నా.. ఏపీలోని జలాశయాలన్నీ నిండు కుండలా కళకళలాడుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీఎం చంద్రబాబు విజయవాడ పర్యటన సందర్భంగా పటిష్టమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు పహారా నడుమ సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి పూజలు చేశారు.#vinayakachavithi #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/lVF8MjpfBj
— Telugu Desam Party (@JaiTDP) August 27, 2025