
ఏప్రిల్ 20న 75వ వసంతంలోకి చంద్రబాబు
గత రెండు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణుల మధ్యే ఏపీలోనే జరుపుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం విదేశాల్లో జరుపుకేనేందుకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరో రెండు రోజుల్లో›75వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఏప్రిల్ 20 నాటికి చంద్రబాబు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ ఏటలోకి అడుగు పెట్టనున్నారు. అయితే తన 75వ జన్మదినం వేడుకలను కేవలం తన కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరి మధ్య కాకుండా విదేశాలలో తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనువడు దేవాన్ష్‌ల సమక్షంలోనే తన పుట్టిన రోజు జరుపుకునేందుకు విదేశాలకు పయమనమయ్యారు. దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. తన కుటుంబంతో వెళ్లే విదేశీ పర్యటనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు.
సీఎం చంద్రబాబు బుధవారం తీరిక లేకుండా గడిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందంతో బుధవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు. ముఖ్యమైన ప్రాజెక్టులు, నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వాటిని ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని, ఆ మేరకు నిధులు కేంద్రం ద్వారా నిధులు ఇప్పించేందుకు సహాయం చేయాలని కోరారు. అదే రోజు రాత్రి 8:20 గంటలకు తన కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఆ రాత్రి అక్కడే బస చేసిన అనంతరం గురువారం మధ్యాహ్నం 1:20 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశీ యాత్రకు వెళ్లారు. తిరిగి ఏప్రిల్ 21న అర్థ రాత్రి సమయంలో అమరావతికి చేరుకుంటారు.
అయితే తన పుట్టిన రోజు వేడుకలతో పాటు తన విదేశీ పర్యటన వివరాలను బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబం వెళ్లిన ప్రతి విదేశీ పర్యటన వివరాలను వెల్లడించిన చంద్రబాబు ఈ సారి మాత్రం ఎక్కడకు వెళ్లారనే విషయాలను అత్యంత గోప్యంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం స్థానంలో ఉన్న నాయకుడు తన కుటంబంతో కలిసి విదేశాలకు వెళ్లడంలో గోప్యత ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
74 ఏళ్లు పూర్తి అయ్యి, 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళలో ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావు లేకుండా తన పుట్టిన రోజు జరుపుకునేందుకు చంద్రబాబు నిశ్చయించుకున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అయితే విదేశీ పర్యటనకు ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ రాబోయే పుట్టిన రోజును తన కుటుంబ సభ్యులతో కలిసి అత్యంత ఆప్తుల మధ్య జరుపుకున్నారు. తన జన్మదినం పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో కేక్‌ను కట్ చేసి భువనేశ్వరికి తినిపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దంపతులు, ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్‌లు పాల్గొన్నారు.
2024 ఏప్రిల్ 20న తన 74వ పుట్టిన రోజు వేడుకలను రాయదుర్గం నియోజక వర్గం కనేకల్లులో టీడీపీ శ్రేణుల మధ్య జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి పంచిపెట్టారు. వేద పండితులు, ముస్లిం మత పెద్దలు, పాస్టర్లు చంద్రబాబును దీవించి అయనకు ఆశీర్వచనాలు అందజేశారు. 2023 ఏప్రిల్ 20 తన 73వ పుట్టిన రోజు వేడుకలను అరకులోయ మండలంలో టీడీపీ శ్రేణుల మధ్య నిర్వహించుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో 1950 ్రఏపిల్ 20న ఓ సామాన్య రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. తన స్వగ్రామంలోనే విద్యాభ్యాసం ప్రారంభించిన ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు 1994 నుంచి 2004 వరకు పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేశారు. విభజన తర్వాత రెండో సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2024లో ప్రమాణ స్వీకారం అనంతరం నాలుగో సారి సీఎంగా చంద్రబాబు చరిత్ర సృషించారు.
Next Story