చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదు: మాజీ మంత్రి కాకాణి
x

చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదు: మాజీ మంత్రి కాకాణి

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు స్పందించారు.


తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారనే విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ తొలి నుంచి చెబుతూనే ఉందన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం తిరుమల లడ్డూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు. సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా పరిగణించిందన్నారు. టీటీడీ ఈవో జే శ్యామలరావుతో చంద్రబాబు చిలుక పలుకులు పలికించారని విమర్శించారు.

సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారన్నది ఈ విషయంలో మరోమారు రుజువైందన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి డిక్లరేషన్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవాలు వెలుగు చూడాలంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేంద్రంలోని స్వతంత్య్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి చెందిన అమ్ముడు బోయిన బీజేపీ నేతల ఆలోచనలు పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ విచారణ చేపడితే కేంద్ర ప్రభుత్వ తీరును అందరూ హర్షిస్తారన్నారు. చంద్రబాబు పతనానికి ఈ వ్యవహారం దారితీస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి ఈ అంశంపై ఆచితూచి మాట్లాడారన్నారు. శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను దెబ్బేతీసే విధంగా, టీటీడీ దేవస్థానంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచేలా వ్యవహరించినందుకు ఇద్దరు బాధ్యులేనని అన్నారు. తమ అబద్దాలతో హిందూవులను మోసం చేసినందుకు పశ్చాతాపంగా వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More
Next Story