సూపర్‌ సిక్స్‌ అంటేనే భయపడుతున్న చంద్రబాబు
x

సూపర్‌ సిక్స్‌ అంటేనే భయపడుతున్న చంద్రబాబు

ఎన్నికల్లో సునాయాసంగా హామీలిచ్చారు. ఇప్పుడు ఆ హామీలను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు. సూపర్‌ సిక్స్‌ అనగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది.


ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం అడ్డదిడ్డంగా అలివిగాని హామీలిచ్చారు. ఒకరు ఉచితమంటే.. దానికి రెట్టింపు ఉచితమని మరొకరు ప్రకటించారు. అధికార పార్టీపై వెగటు కొట్టిన ప్రజలు నాటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే ప్రజలు ఏమంటారో? హామీలన్నీ నెరవేర్చాలంటే ఖజానాలో నిధులు నిల్‌. అందుకేనేమో సమీక్షలపై సమీక్షలు.. వరుస వైట్‌ పేపర్లు›తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. మంత్రులకు మాత్రం ఇవేమీ పెద్దగా పట్టడం లేదు. తామిచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని బల్లగుద్ది చెబుతున్నారు.

ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చాం.. ఇప్పుడు వాటిని చూస్తే భయమేస్తోంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్థిక పరిస్థితిపై ఆవేదన కలుగుతోంది. సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలిచ్చాం. ఇప్పుడు వాటిని చూస్తే భయమేస్తోంది. ముందుకు కదల్లేక పోతున్నాం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రజలు కూడా సీరియస్‌గా ఆలోచించాలి. లేదంటే ఈ సమస్య ఇలాగే ఉండిపోతుంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలి’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అన్న మాటలు పలువురిని ఆశ్చర్యంలో పడేయటమే కాకుండా ఎందుకు సీఎం ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే ఆలోచనల్లో పడేలా చేశాయి.
సీఎం మాటల్లో రెండు అర్థాలు గోచరిస్తున్నాయి. ఒకటి ఈ హామీలు అమలు చేయలేమని, ప్రజలు దీనిపైన ఆలోచనలు చేసి, ప్రభుత్వానికి సహకరించాలని చెప్పినట్లుగా ఉంది. రెండోది ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలన్నారు. అంటే ఆర్థిక స్థితి చిన్నా భిన్నమై ఉన్నప్పటికీ నేను చెప్పింది చేస్తానంటే అర్థం ఏముంది? అనే భావన కూడా కలుగుతోంది. శక్తికి మించిన హామీలివ్వడం.. రాజకీయ నాయకులకు అలవాటైంది. హామీలను అమలు చేయడం కోసం గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే భారీ స్థాయిలో అప్పులు చేయాల్సిందే. ఇప్పటికే రాష్ట్రంపై సుమారు రూ. 10లక్షల కోట్లు అప్పుల భారం ఉంది. అందుకే చంద్రబాబు మాట్లాడిన మాటల్లో గూఢార్థం కూడా ఉంది. ఇంత భారీ స్థాయిలో ఉచిత పథకాలు అమలు చేసే అవకాశం లేదని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు, అన్ని రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు. పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కేవలం గెలుపే లక్ష్యంగా ఇష్టానుసారంగా ఎన్నికల్లో చంద్రబాబు హామీలిచ్చారు. ఇవి తనకు తెలియకుండా, ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇచ్చిన హామీలు కావు. చంద్రబాబుకు తెలిసే ఇచ్చిన హామీలు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ హామీలను అమలు చేయాల్సిందే. లేదంటే చంద్రబాబు మాటల ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో ఎన్నిరకాల నిబంధనలు ఉంటాయో,అవన్నీ ప్రయోగించి పెద్ద ఎత్తున కోత పెట్టాల్సిందే. ఇందుకోసమే పై విధంగా చంద్రబాబు మాట్లాడినట్లు రాజకీయ మేధావులు భావిస్తున్నారు. ఈ పథకాల అమలుకు ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. రాబడులు, ఖర్చులు పోను మిగిలినవి సంక్షేమానికి ఖర్చుచేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఖర్చులన్నీ సంక్షేమానికే పెడుతున్నారు. ఇక అభివృద్ధికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Read More
Next Story