చంద్రబాబూ.. నిన్నొదలా! గర్జిస్తున్న జగన్
x

చంద్రబాబూ.. నిన్నొదలా! గర్జిస్తున్న జగన్

YCP అధినేత ఎడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ఘోర ఓటమి నుంచి కోలుకుంటున్నారు. పోయినచోటే వెతకాలన్న నిర్ణయానికి వచ్చారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్)2024 ఎన్నికల ఘోర ఓటమి నుంచి కోలుకుంటున్నారు. పోయినచోటే వెతకాలన్న నిర్ణయానికి వచ్చారు. 151 నుంచి 11 సీట్లకు పరిమితమై మనసు కకావికలమై స్థిమితపడడానికి దాదాపు 8 నెలలు పట్టింది. ఇప్పుడు ఆయన- అమరావతి పునాదుల్ని చంద్రబాబు పరీక్షిస్తున్నట్టే- తన గ్రౌండ్ ను టచ్ చేసి చూస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీపై తిరుగుబాటు చేసి ఓదార్పు యాత్రలు చేపట్టినట్టే ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. పార్టీలో ఉండి మరణించిన వారి కుటుంబాలను, పార్టీ కోసం కష్టపడి వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైళ్లపాలయిన నాయకుల్ని పరామర్శించి అంతోఇంతో ఆర్ధిక సాయం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలను కూడా ఆయన ఇదే విధంగా ఆదుకున్నారు. కొంచెం కాళ్లూనిన తర్వాత జనం బాగానే వస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన తన యాత్రలను మరింత ఉధృతం చేశారు. 2014 ఎన్నికల్లో అధికారం అంచులదాకా వచ్చి తప్పిపోయిన తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రతిజ్ఞ పూని 2016-17లో ప్రజాసంకల్ప యాత్ర (పాదయాత్ర) చేపట్టి రాష్ట్రంలో అడుగడుగూ తిరిగారు. అప్పుడు ప్రారంభించిన సెల్ఫీలు, తలపై చేయి ఉంచి ఇచ్చే దీవెనలు, ముద్దులు, షేక్ హ్యాండ్లు మళ్లీ మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత కాళ్లూ చేతులూ కట్టిపడేసినట్టున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఆ బంధనాలు తెంచుకుని గాండ్రించిన బెబ్బులిలా బయటకువస్తున్నారు. రణహూంకారాలు చేస్తున్నారు.
జగన్ ఏ కార్యక్రమం చేసినా ముందస్తు కసరత్తు ఉంటుంది. దానికో టీమ్ ఉంటుంది. మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు తప్ప ప్రతి ఒక్కటీ వీలయినంత పకడ్బందీగానే రూపొందిస్తారు. విజయవాడ గాంధీనగర్‌ అయినా గుంటూరు మిర్చి యార్డ్ అయినా, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అయినా జనంతో పోటెత్తాల్సిందే.

గన్న­వరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలుసుకునేందుకు ఫిబ్రవరి 19న గాంధీనగర్‌లోని జైలు వద్దకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూసేందుకు ఊహించనంతగా జనం వచ్చారని వైసీపీ వాళ్లు చెప్పుకున్నా వాళ్ల అంచనాలకు మించే స్థానికులు వచ్చారు. బారికేడ్ల ముందే జనం నిరీక్షించారు. నినాదాలు సరేసరి.
వైఎస్‌ జగన్‌ వాహనంలో నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేయగానే కేరింతలు కొట్టారు.
ఫిబ్రవరి 20న గుంటూరులోనూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మిర్చి యార్డు ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.
ఫిబ్రవరి 21 పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పర్యటనలోనూ జనం ఎగబడ్డారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై వైఎస్‌ జగన్‌ కు స్వాగతం పలికారు.
ఏ పార్టీ అయిన తమ నాయకుడు వస్తున్నాడంటే ఆ ప్రాంత నేతలందరూ కలిసిరావడం, జనాన్ని పోగేయడం మామూలుగా జరిగే పనే. అలాగే జగన్ కీ జరిగిందనకున్నా.. ఐదారు నెలల పాటు ఆయన్ని కలవడానికే ఇబ్బంది పడ్డ నేతలు ఇప్పుడిప్పుడే బయటకు రావడం ఒక ఎత్తయితే జనం కూడా కదిలిరావడం మరో ఎత్తు.
జగన్‌తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ‘జగనన్నా..’ అంటూ కేకలు వేస్తూ.. చేతులూపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు యువకులు డివైడర్‌పై, ఇళ్లపై నుంచి మొబైల్‌ ఫోన్లలో జగన్‌ కాన్వాయ్‌ని చిత్రీకరిస్తూ కనిపించారు.
జగన్ మామూలుగానే చంద్రబాబును తిట్టిపోస్తారు గనుక విమర్శలు తారాస్థాయిలోనే ఉన్నాయి. చంద్రబాబూ "నిన్ను వదలా.." అంటూ హెచ్చరికలు చేశారు. జగన్ లెక్కప్రకారం 2027లో బీజేపీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలు రావొచ్చునన్నది అంచనా కావొచ్చు. అందువల్లనే ఏమో ఆయన మాట్లాడే మాటలు ఎన్నికల ప్రసంగాలను తలపిస్తున్నాయి. తాను మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం, వస్తే టీడీపీ నేతలు, ప్రభుత్వ అధికారుల భరతం పడతాననే లెవెల్లోనే ప్రసంగాలు ఉంటున్నాయి. ఇప్పుడీ పరిస్థితి టీడీపీ క్యాడర్ ను కలవరపరుస్తోంది.
చంద్రబాబును జగన్ భయపెట్టాడా?
చంద్రబాబును జగన్ భయపెట్టాడా? జగన్ ను చూసి భయపడుతున్నాడా? అన్నది టీడీపీ క్యాడర్ ను వేధిస్తున్న ప్రశ్న. ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి రోజులు జగన్ తో సహా వైసీపీ నాయకులెవరూ బయటకు రావడానికే భయపడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే కేసులనో, జైల్లనూ, బెయిళ్లనో భయపడే వారు. జగన్ కోసం పని చేసిన అధికారులు, చోటామోటా నాయకులు, ఊళ్లల్లో మోతుబరులు కూడా తొలినాళ్లలో దడుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం వస్తూనే చేసిన హంగామా, హడావిడి కూడా అలాగే ఉంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన హడావిడి అంతా ఇంతకాదు. అంతలోనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం, అవినీతి, అధికార దుర్వినియోగం, కాకినాడ ఓడరేవు కబ్జా, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భూములు వంటి పెద్దపెద్ద వ్యవహారాలు బయటకు వచ్చాయి. 6 నెలల్లో వాళ్లు వీళ్లవుతారన్నట్టుగా టీడీపీ మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఇసుక, మద్యం, కంకర, పెత్తనం చెలాయించడం, ముడుపులు వంటి వాటిలో కూటమి నేతలు కూరుకుపోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పేరిట పాలనకు దూరమయ్యారు. బీజేపీ మంత్రి సత్యకుమార్ సైతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి తెగబడడంతో చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకునే నాధుడు లేకపోయాడు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ మనుషులంటూ మరికొందరు తెరపైకి వచ్చి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా జగన్ ధైర్యాన్ని కూడగట్టుకుని ఓటమిని దిగమించి తిరిగి జనంలోకి ప్రవేశించారు. తమ పార్టీ నేతల జోలికి వచ్చే అధికారుల్ని, ఇతరుల్ని బట్టలూడదూసి బజార్లో నిలబెడతామనే దాకా జగన్ వచ్చారంటే టీడీపీ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని నెల్లూరు జిల్లాకు చెందిన జయేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత చంద్రబాబు, ఆయన కుమారుడిదేనని జయేష్ అన్నారు.
"ఇప్పుడు ఎక్కడ ఏ పని కావాలన్నా చినబాబును కలవాల్సిందే. లేకుంటే పెదబాబు (చంద్రబాబు) చెప్పినా కాదనే దాకా పరిస్థితి వచ్చిందని" ప్రకాశం జిల్లా టీడీపీ నేత ఒకరు బాహాటంగానే వ్యాఖ్యానించారు. లోకేశ్- జగన్ కంటే అన్ని విధాలుగా నాలుగాకులు ఎక్కువ చదివారని ఆయన విమర్శించారు.
రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా గ్రాఫిక్స్ తోనే సాగుతోంది. అయినా రాష్ట్రానికి కావాల్సింది అదొక్కటే కాదు. మూడు ప్రాంతాల సమతుల్యత దెబ్బతింటున్నా తండ్రీకొడుకులకు పట్టింపులేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతామోహన్ అన్నారు. అమరావతి నిర్మాణంతో తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు భ్రమ పడుతున్నారన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. పోలవరం ప్రాజెక్టు మళ్లీ మొదటికే వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్ ఏమిటో తెలియడం లేదు, ఆరుగాలం కష్టపడి పడించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు 20247 అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటికొక పారిశ్రామిక వేత్త, డ్రాన్ క్యాపిటల్ వంటి మాటలు చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు 2004లో ఓటమికి ముందు కూడా ఇలాంటి విషయాలే చెప్పారని కార్మికనాయకుడు కేవీ ప్రసాద్ గుర్తు చేశారు. తక్షణం చేయాల్సిన పనులు వదిలేసి ఏవేవో చెప్పడం చంద్రబాబుకు అలవాటేనన్నది ఆయన వ్యాఖ్య.
ధరల పెరిగి జనం నానా ఇక్కట్లు పడుతున్నప్పుడు ఆకాశానికి నిచ్చెనలు వేయడం చంద్రబాబు మానుకోవాలని - గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయమని గట్టిగా ప్రచారం చేసిన గుంటూరు వాసి శౌరయ్య చెప్పారు. టీడీపీ వాళ్ల అవినీతిని చంద్రబాబు నియంత్రించక పోతే జగన్ మళ్లీ తెర మీదికి రావడం ఖాయమన్నారు శౌరయ్య.
సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచుతాయి. ఇప్పుడు జగన్ కూడా అదే చేశారు. రాష్ట్ర ప్రజల నుంచి ఛీత్కారాలు రావడానికి బదులు పూలు, పండ్లు వస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ తన బలాన్ని ఆయన మరోసారి పరీక్షించుకునేందుకు సమాయత్తం అయ్యారు. జనం నుంచి వస్తున్న స్పందనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యపోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఏది చేసినా ప్రణాళిక ప్రకారమే చేస్తారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల 2 నెలల సమయం ఉన్నా ఆయన ఇప్పటి నుంచే మొదలుపెడతారు. ఆయన వ్యూహం అంత పక్కగా ఉంటుంది. ప్రజల్లో ఉండడానికే ఇష్టపడతారు. అంతమాత్రాన ఆయనేదో గెలిచిపోతారని కాదు గాని రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. బళ్లు ఓడలవుతుంటాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఆ విషయం చంద్రబాబుకు తెలియందేమీ కాదు.
Read More
Next Story