ఏపీలో యూట్యూబ్ అకాడమీ.. ప్రకటించిన చంద్రబాబు
x

ఏపీలో యూట్యూబ్ అకాడమీ.. ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం దూకుడు కనబరుస్తోంది. తాజాగా యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో భేటీ అయిన చంద్రబాబు.. యూట్యూబ్‌ను అమరావతికి ఆహ్వానించారు.


ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రానికి భారీగా పెట్టబడులు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాలను ఆహ్వానించిన చంద్రబాబు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చలు చేస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్‌, గూగుల్ ఏపీఏసీ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఫలదాయంగా సాగిందని, దీని ఫలితంగా అతి త్వరలోనే మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడానికి సిద్దమైందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఓకే చెప్పిన నీల్ మోహన్

‘‘యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్‌తో పలు కీలక అంశాలపై చర్చించా. ఆంధ్రప్రదేశ్ లోకల్ పార్ట్‌నర్‌లతో కలిసి రాష్ట్రంలో ఓ యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆయనను ఆహ్వానించా. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కంటెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ వంటి వాటిపై అకాడమీలో పరిశోధనలు చెయవచ్చని ఆయన చెప్పారు. అందుకే అమరావతిలోని మీడియా సిటీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరాను. అందుకు నీల్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు’’ అని చెప్పారు. కాగా ఈ యూట్యూబ్ అకాడమీ ఆంధ్రకు ఎప్పుడు వస్తుంది అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. రానున్న కాలంలో ఈ విషయంలో ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలి.

గ్రీనరీపైనా దృష్టి

ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు, పెట్టబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు వృక్ష సంపద పెంపుదలపై కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే భారీగా మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. ఒకేసారి ఐదు లక్షల నుంచి 10 లక్షల మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తద్వారా ప్రజలను కూడా మొక్కలు నాటే దిశగా ప్రోత్సహించడం సులభమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమ బాధ్యతలు డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీసుకోవాలని కూడా తెలిపారు.

Read More
Next Story