చంద్రబాబు మారలేదు..అబద్దాలు చెబుతూనే ఉన్నారు
x

చంద్రబాబు మారలేదు..అబద్దాలు చెబుతూనే ఉన్నారు

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.


గతంలో కంటే చంద్రబాబు మారారని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేరుస్తారని, జగన్‌ కంటే చంద్రబాబు ఇంకా బాగా చేస్తారని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావించారని అందుకే ఆయనకు అధికారం ఇచ్చారని, కానీ ప్రజలకు మంచి చేయడంలో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో గురువారం జగన్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదనే అపవాదును ప్రజల నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా తాను మారానని, జగన్‌ కంటే ఎక్కువ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. అందుకే ఆయనకు అధికారం ఇచ్చారు. దీంతో వైసీపీకి 50 శాతం నుంచి 40 శాతానికి ఓటు షేరు తగ్గిందని జగన్‌ అన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి 11 నెలలు అయిపోయింది. ఈ కాలంలో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తారని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటిని నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
సూపర్‌ సిక్స్‌ చేస్తానని మాట అయితే ఇచ్చాను, కానీ ఇప్పుడు భయమేస్తోందని చంద్రబాబు అంటున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. ఏపీకి ఉన్న అప్పులపై కూడా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటు సూపర్‌ సిక్స్‌లను అమలు చేయకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పుల మీద అబద్దాలు చెబుతూ.. ఆ అబద్దాలతోనే ప్రభుత్వాన్ని చంద్రబాబు నెటుకొని వస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో మంచి చేశాము కాబట్టే.. ఈ రోజు రాష్ట్రంలో గర్వంగా తలెత్తుకొని ప్రజల్లో తిరగ గలుగుతున్నామని అన్నారు.
కర్నూలు జిల్లా నల్లకాలువలోనే వైసీపీకి బీజం పడిందన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాం. ఈ క్రమంలోనే వైసీపీ ఆవిర్భవించిందన్నారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు తనతోనే ఉన్నారని అన్నారు. విలువలు, విశ్వసనీయతే వైసీపీ పార్టీ సిద్ధాంతం అని, ఈ రెంటికీ అర్థం చెప్పిన పార్టీ వైసీపీ అని అన్నారు. వైసీపీ రాక ముందు రాజకీయాల్లో అర్థాలు వేరేలా ఉండేవని, వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థాన్ని మార్చామన్నారు. ప్రజలకు, ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే విలును చాటి చెప్పామన్నారు. మేనిఫెస్టోనే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాము అధికారంలోకి రాక ముందు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్త బుట్టలో వేసే వారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంధంగా మారిందన్నారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడి పోయామని భయపడాల్సిన పని లేదన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్‌ పాలన సాగిస్తోందని, విచ్చల విడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. ప్రతి గ్రామంలో కూడా బెల్టు షాపులు, మద్యం షాపులు యధేచ్చగానే కొనసాగుతున్నాయన్నారు. పేకాట క్లబ్చులు, ఇసుక, మట్టి, మైనింగ్‌ మాఫియాలు పురుడు పోసుకున్నాయన్నారు. ప్రజలకు మంచి చేయొచ్చు కదా? ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా? అధికారం కోసం ఇంత దిగజారి పోవాలా? అబద్దాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? అంటూ చంద్రబాబును నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో బీహార్‌ రాష్ట్రం మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌ హామీలపై నిలదీస్తారనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటే చంద్రబాబుకు భయం పుట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు వెళ్తే నిలదీస్తారని, టీడీపీ నేతలు కానీ, కేడర్‌ కానీ ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదన్నారు.
Read More
Next Story