‘మనం అలా చేయొద్దు’.. నేతలకు చంద్రబాబు సూచన
కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. నేతలందరికీ కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాలు పూర్తయిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో కూటమి నేతలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు నేతలకు పలు విషయాల్లో దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దని, ప్రజల సమస్యల పరిష్కారమే పరామవధిగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఐదు రోజులు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అన్న అంశాలపైన దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అదే విధంగా ఎవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పారు.
తన మన భేదం ఉండదు
‘‘శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన మన భేదం ఉండదు. నన్నే జైలుుక పంపారు. కక్ష సాధించాలనుకుంటే నేనూ చాలా చేయగలను. కానీ కక్ష సాధింపు వ్యవహారాన్ని నేను పట్టించుకోను. ఎమ్మెల్యేలు కూడా కక్షపూరితంగా వ్యవహరించొద్దు. రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు, శాంతి భద్రతల విషయంలో నిష్కర్షగా ఉంటా. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో పూర్తిస్థాయి సేవలందించాలి. ప్రభుత్వం వచ్చి మొన్ననే నెల రోజులు ముగిశాయి. అప్పుడు జగన్ విమర్శలు స్టార్ట్ చేశారు. జగన్ తన సహజ ధోరణి వీడలేదు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం కరెక్టేనా? తప్పులు చేయడం.. వాటిని పక్కవారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటు. వివేకా హత్య విషయంలో కూడా ఇదే జరిగింది. వినుకొండలోనూ ఇదే జరుగుతోంది. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేశాయి అనడానికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదమే కారణం’’ అని పేర్కొన్నారు చంద్రబాబు.
ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు
‘‘ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంది అధికారాన్ని చేతిలో పెట్టారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ఆర్థిక వ్యవస్థ దుస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రాష్ట్ర ఖజానా అడుగంటింది. ఆఖరికి అత్యవసరాలకు కూడా నిధులు వాడుకోలేని స్థితిలో ఖజానా ఉంది. దేశంలోని మరే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ అసమర్థత, విధ్వంసకర నాయకత్వం మూలంగా అధికారులు గాడి తప్పారు, వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం అందుకున్న మన ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించుకుంటూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించాలి’’ అని అన్నారు.
ఎన్నో డ్రామాలు ఆడారు
‘‘2019 నుంచి 2024 వరకు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పాలన సాగించారు. పవన్ కల్యాణ్.. విశాఖ వెళితే అడ్డుకున్నారు. అకారణంగా, అక్రమంగా నన్ను జైల్లో వేశారు. నన్ను పరామర్శించడానికి వస్తున్నా కూడా పవన్‌ను అడ్డుకున్నారు. ఐదేళ్లలో జగన్ సర్కార్ చేయని అరాచకం లేదు. వివేకా హత్యపై ఎన్ని డ్రామాలు ఆడారో మనమంతా చూశాం. తప్పులు చేసిన తప్పించుకోవడంలో వాళ్లు ఆరితేరిపోయారు. మదనపల్లె ఘటన అందుకు నిదర్శనం. అయినా ఆనాడు జగన్ చేసినట్లు మనం చేయకూడదు. వాళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. మనం రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం’’ అని వివరించారు చంద్రబాబు.
ఆ ఫైల్స్ తగలబడ్డాయి
‘‘మదనపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూములు, 22 ఏ భూముల వివరాలు ఉన్న ఫైల్స్ తగలబడ్డాయి. ఇది అగ్నిప్రమాదం అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఉదయం విషయం తెలిసిన వెంటనే డీజీపీని హుటాహుటిన అక్కడకు పంపాను. విచారణను వేగవంతం చేయాలని ఆదేశించా. మదనపల్లి ఘటన చూసిన తర్వాత రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది.. ఎంత పతనమైందనేది స్పష్టం అయింది. వ్యవస్థలు, అధికారుల్లో ఒక విధమైన నిర్లిప్తత వచ్చింది. అందుకే గట్టి ఆదేశాలు ఇచ్చి పరుగులు పెట్టించాను’’ అని చెప్పుకొచ్చారు.
ప్రతి నెలా పాల్గొనాలి
‘‘ప్రతి ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరించొద్దు. ఈ విషయంలో కూటమి నేతలంతా స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వం చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి. భవిష్యత్తులో ఏం చేయనున్నామో కూడా వారి చెప్పి వారిలో నమ్మకం కల్పించాలి. ప్రతి నెలా అందించే పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొనాలి. పవన్ కల్యాణ్ కోరిన విధంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తాం’’ అని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ ఆపొద్దు
‘‘నాకోసం ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు చెప్పాను. ఈ విషయంలో ట్రాఫిక్ చూసుకుని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇది పాటించాలి. సైరన్లు, భారీ కాన్వాయ్‌లు, హడావుడితో ప్రజలకు అసౌకర్యం కల్పించొద్దు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మసులుకుందాం. అదే విధంగా అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు జరిగేలా చూద్దాం. ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి సూచనలు రావాలి. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి రావాలి. 2029 ఎన్నికల్లో గెలివాలన్న లక్ష్యంతో నేటి నుంచే పని చేయాలి. వికసిత్ భారత్ విజన్ 2047 అని ప్రధాని అన్నారు. మనం విజన్ వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ను సిద్ధం చేద్దాం. ఇందులో భాగంగా మీ నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక ప్లాన్ సిద్ధం చేసుకోండి’’ అని సూచించారు.