ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బాబు.. వారి ఎంపిక ఏకగ్రీవమేనా!
x

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బాబు.. వారి ఎంపిక ఏకగ్రీవమేనా!


ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడీ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు సీట్లు టీడీపీకే సొంతమవుతాయని అంతా భావించారు. కానీ ఈ విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ అవాక్కు గురిచేస్తోంది. ఇప్పుడు రాష్ట్రమంతా దీనిపైనే చర్చ జరుగుతోంది. అందుకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రియార్టీ ఇవ్వడమే ప్రధాన కారణం. ఈ రెండు సీట్లలో ఒకదానికి జనసేన అభ్యర్థి ఖరారు అవుతారని తాము ఊహించలేదని కూటమి వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా నామినేటెడ్, ఎమ్మెల్సీ పోస్టుల భర్తీలో బీజేపీ, జనసేనకు పెద్ద పీట వేసేలా కూడా చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయింపులు భారీగానే జరిగాయి. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, సీ రామచంద్రయ్యలు.. వైసీపీకి టాటా చెప్పి సైకిల్ ఎక్కేశారు. పార్టీ ఫిరాయించిన కారణంగా శాసనమండలి అధ్యక్షుడు వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. రద్దు వల్ల శాసనమండలిలో రెండు స్థానాలు ఖాళీ కావడంతో వాటి భర్తీ కోసం ఉపఎన్నిక నిర్వహించాలని నిశ్చయించారు. ఈ ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఇప్పుటు ఆ రెండు స్థానాల టికెట్ రేస్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ రెండు సీట్లకు అభ్యర్థులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు.

ఎంపికలో వారికే ప్రాధాన్యత

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బలిక, కాపు నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. వారి కాంబినేషన్‌తోనే అభ్యర్థుల ఎంపిక కూడా చేశారు. దీంతో పాటుగా కడపపై కూడా టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కడపలో మంచి గుర్తింపు ఉన్న బలిక నాయకుడయిన సీనియర్ నేత సీ రామచంద్రయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయనతో పాటు కొన్నేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న కాపు నేత హరి ప్రసాద్‌కు కూడా అవకాశం కల్పించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం శాసనమండలిలో కూడా జనసేనకు ప్రాతినిధ్యం లభించేలా చేస్తుంది. శాసనమండలిలో జనసేన నుంచి తొలి సభ్యునిగా హరి ప్రసాద్ నిలవనున్నారు.

వీరి ఎన్నిక ఏకగ్రీవమా!

ఎమ్మెల్సీ స్థానాలకు రామచంద్రయ్య, హరిప్రసాద్ ఈరోజు తమ నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు. ఈరోజు నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు. అయినా మరెవరూ నామినేషన్ వేయడానికి ముందుకు రాకపోవడంతో వీరిద్దరి ఎంపిక ఏకగ్రీవం అయినట్లే. అయితే శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని ఇప్పటికే జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చున్నారు. గతంలో వారితో సమావేశమై కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అసెంబ్లీలో బలం లేకుండా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీద్దామని అన్నారు. మరి ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈరోజే ఆఖరు రోజు కావడంతో వైసీపీ తరపున ఎవరైనా నామినేషన్ వేస్తారా లేదా అనేది చూడాలి.

Read More
Next Story