ఉపఎన్నికలో బొత్సకు లైన్ క్లియర్.. టీడీపీ దూరమే..
x

ఉపఎన్నికలో బొత్సకు లైన్ క్లియర్.. టీడీపీ దూరమే..

విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కూడా అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. అందుకు విపక్ష వైసీపీ, అధికార కూటమి మధ్య ఉన్న అసెంబ్లీ సీట్ల వ్యత్యాసమో.. ఉప ఎన్నిక రంగంలో వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిలబడమో ప్రధాన కారణం తెలియదు.


విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కూడా అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. అందుకు విపక్ష వైసీపీ, అధికార కూటమి మధ్య ఉన్న అసెంబ్లీ సీట్ల వ్యత్యాసమో.. ఉప ఎన్నిక రంగంలో వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిలబడమో ప్రధాన కారణం తెలియదు. కానీ ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఈ రోజుతో ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కూటమి అభ్యర్థి ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల పోరుకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు టెలికాన్ఫరెన్స్‌లో చెప్పడం కీలకంగా మారింది. చంద్రబాబు నిర్ణయంతో బొత్సకు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా ఎవరూ నామినేషన్ కూడా దాఖలు చేయని క్రమంలో ఉపఎన్నిక ప్రక్రియ లాంఛనంగా జరగనుందని, బొత్స విజయం ఖరారు అయినట్లేనని తెలుస్తోంది.

పోటీ నుంచి తప్పుకుంది అందుకేనా..

ఉపఎన్నిక బరి నుంచి టీడీపీ తప్పకోవడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. వాటిలో టీడీకీ బలం తక్కువగా ఉండటం ప్రధానంగా ఉంది. పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకునే కంటే.. పోటీకి దూరంగా ఉండటమే మేలని భావించే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వాదన వినిపిస్తోంది. కానీ ఉపఎన్నికలో గెలవడం పెద్ద కష్టం కాకపోయినా.. హుందా రాజకీయాల కోసం పోటీకి దూరంగా ఉంటున్నట్లు చంద్రబాబు.. టీడీపీ నేతలకు వివరించారు. కానీ వైసీపీ మాత్రం ఎలాగైనా ఈ ఉపఎన్నికలో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దించింది. బొత్స కూడా తన గెలుపుకోసం అంతా సహకరించాలని కోరుతున్నారు.

కూటమి గెలుపు డౌటే..

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ బలంగా ఉన్న స్థానంలో బాహాబాహీ అంటే గెలుపు కష్టమే. ఈ ఉపఎన్నికలో పోటీ చేసి గెలవడం అనేది కూటమికి పెద్ద సవాల్‌గా ఉంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన రెండునెలలకే ఉపఎన్నికలో పోటీ పడి ఓడితే.. ఈ ఓటమి ప్రభావం రానున్న పాలనా కాలమంతా ఉంటుంది.

బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో ఎంపీటీసీలు 636 మంది, జడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులు 16 మంది, ముగ్గురు వైసీపీ ఎక్స్ అఫీషియో కింద దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తామే గెలుస్తామని తెలిసి కూడా కూటమి తన అభ్యర్థిని నిలబెట్టాల్సిన పనేముందని, అది అనైతికమే అవుతుందని బొత్స వ్యాఖ్యానించారు.

Read More
Next Story