
ప్రపంచ చరిత్ర కలుపుతోంది ఆ ఇద్దరినీ!
దగ్గుబాటి పుస్తకావిష్కరణకు విశాఖ వేదిక. ఆ సందర్భం పేరిట చంద్రబాబు, దగ్గుబాటి కలయిక. మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైపి తోడల్లుళ్లు.
వాళ్లిద్దరూ తోడల్లుళ్లు... దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు స్వయానా అల్లుళ్లు. అయినా వారి మధ్య అనుబంధం ఆమడ దూరంలో ఉంది. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి. ఎక్కడైనా, ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో ఎదురుపడినా ఎడమొహం.. పెడమొహమే. కనీసం పలకరింపులు సైతం కరువే. ఇలా ఈ తోడల్లుళ్ల మధ్య రాజకీయ వైరం ఏడాదో, రెండేళ్ల నుంచో కాదు.. దాదాపు మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇన్నేళ్లూ శత్రుత్వాన్ని కొనసాగించిన వీరు ఇప్పుడు స్నేహ హస్తాన్ని అందుకోవడానికి తహతహలాడుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని మరోసారి రుజువు చేస్తున్నారు. అందుకు విశాఖను వేదికగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.
ఎన్టీ రామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్నేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సహజంగానే సాహిత్యంపైన, రచనల పట్ల ఆసక్తిని కలిగి ఉండే దగ్గుబాటి ఇటీవల తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రపంచ చరిత్ర పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కొద్ది రోజుల క్రితం తన తోడల్లుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటికి వెళ్లారు. విశాఖలో తన పుస్తకావిష్కరణ ఉందని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ అనూహ్య పరిణామం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబుకు అల్లంత దూరాన ఉంటున్న దగ్గుబాటి ఫిబ్రవరి 25న ఉన్నఫళంగా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపింది. తోడల్లుడు దగ్గుబాటి ఆహ్వానానికి చంద్రబాబు సై అన్నారు.
దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం
గురువారం విశాఖ ‘గీతం’లో పుస్తకావిష్కరణ..
దగ్గుబాటి తాను రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని గురువారం విశాఖలో ఏర్పాటు చేశారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయాన్ని ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఈ గీతం విశ్వవిద్యాలయం కూడా ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలతో సంబంధాలున్న వారిదే కావడం విశేషం. దివంగత ఎంవీవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీని స్థాపించారు. ఆయన అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం మరణించారు. అనంతరం గీతం బాధ్యతలను ఆయన మనవడు, ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలక్రుష్ణ చిన్న అల్లూడు, విశాఖ ఎంపీ శ్రీభరత్ చూస్తున్నారు. శ్రీభరత్ చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌కు స్వయానా తోడల్లుడు. ఇలా తన తండ్రి తోడల్లుడు పుస్తకావిష్కరణకు తన తోడల్లుడి విద్యా సంస్థ వేదిక అయిందన్న మాట!
‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ ఇలా..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ చరిత్ర పేరిట తెలుగులోనూ, ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరిట ఇంగ్లిష్‌లోనూ పుస్తకాన్ని రచించారు. వీటిలో ఆంగ్ల పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలుగు పుస్తకాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడులు ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. దగ్గుబాటి సతీమణి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ పుస్తకావిష్కరణ సమయాన్ని నిర్దేశించారు.
విశాఖలో పుస్తకావిష్కరణ ఆహ్వాన పత్రిక
ఐక్యతకు సంకేతమా?
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవిలో ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబంతో సాన్నిహిత్యమూ పెరిగింది. తరచూ ఆమె చంద్రబాబు ఇంటికి రాకపోకలు సాగిస్తుండడం జరుగుతోంది. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలోను, ఆయన తనయుడు లోకేష్ మంత్రిగాను, బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలక్రుష్ణ ఎమ్మెల్యే, లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ విశాఖ లోక్‌సభ స్థానం ఎంపీగాను ఉన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమండ్రి ఎంపీగా చంద్రబాబు వదిన పురందేశ్వరి కొనసాగుతున్నారు. ఇలా ఎటు చూసినా చంద్రబాబు కుటుంబం అన్ని కీలక పదవుల్లో ఉన్నారు. మునుపెన్నడూ ఈ పరిస్థితి లేదంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా తమ కుటుంబ రాజకీయ బలంతో పాటు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న దగ్గుబాటి కూడా చంద్రబాబుతో సాన్నిహిత్యం వంటి పరిణామాలు తమ ఐక్యతను చాటుకోవడానికి ఒక వేదికగా పుస్తకావిష్కరణ ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నాయి.