ఇంగ్లీషులో పోటీ పడ్డ చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌
x

ఇంగ్లీషులో పోటీ పడ్డ చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌

ఎప్పుడూ తెలుగులో ప్రసంగించే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఈ సారి ఆంగ్లంలో ప్రసంగించి ఆశ్చర్య పరిచారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఇంగ్లీషులో ప్రసంగించేందుకు పోటీలు పడ్డారు. కేంద్ర హోం మంత్రి పాల్గొన్న ఎన్‌ఐడీఎం ప్రారంభోత్సం సభలో పోటీ పడి ఇంగ్లీషులో ప్రసంగించి అందరిని ఆశ్చర్య పరిచారు. సహజంగా ఇద్దరు నాయకులు తెలుగులోనే తమ ప్రసంగాలను చేస్తుంటారు. రాష్ట్రంలో జరిగే తెలుగు ప్రజలే కాబట్టి వారికి అర్థమయ్యేందుకు తెలుగులోనే మాట్లాడుతుంటారు. అడపా దడపా ఇంగ్లీషులో మాట్లాడినా తెలుగులోనే కంటిన్యూ చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తమ పంథాను మార్చుకున్నారు.

ఆదివారం విజయవాడకు సమీపంలోని కొండపావులూరులో జరిగిన ఎన్‌ఐడిఎం ప్రారంభ సభలో మాత్రం తమ ప్రసంగాలను రివర్స్‌లో చేశారు. అక్కడక్కడ తెలుగులో మాట్లాడుతూ ఎక్కువ శాతం ఇంగ్లీషులో మాట్లాడేందుకే ప్రయత్నం చేశారు. రాజధాని అమరావతి, విశాఖ స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, పోలవరం వంటి అంశాలను ప్రస్తావించే సమయాల్లో ఇంగ్లీషులో మాట్లాడుతూ సభలో ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడ్డారు. అమిత్‌ షాకు తెలుగు రాకపోవడం, హిందీ, ఇంగ్లీషు తెలిసి ఉంటడంతో ఆయన కోసం ఇంగ్లీషులో మాట్లాడుతూ అమిత్‌ షా ఆమోదం కోసం ప్రయత్నం చేశారు. వీరి ప్రసంగాలను విన్న అమిత్‌ షా చప్పట్లు చరుస్తూ అభినందిస్తూ కనిపించారు.

సీఎం చంద్రబాబు ప్రసంగం తెలుగులో చేసినా.. ఎక్కువ శాతం ఇంగ్లీషు పదాలను ఉపయోగించడం చేస్తుంటారు. ఇంగ్లీషు పదం ఉపయోగించకుండా ప్రసంగాలను చేయడం ఒక రకంగా ఆయనకు కష్టమే. అలా తన ప్రసంగాల శైలిని అలవర్చుకున్నారు. అవి సామాన్య ప్రజలకు అర్థమైనా కాకపోయినా.. ఇంగ్లీషు పదాలను ఉపయోగిస్తూ ప్రసంగాలను కొనసాగిస్తుంటారు. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇంగ్లీషులో ప్రసంగిస్తారు. అయితే ఈ సారి మాత్రం తెలుగు కంటే ఇంగ్లీషు వాఖ్యాలను ఎక్కువుగా ఉపయోగిస్తూ అమిత్‌ షా మెప్పు పొందేందుకు ప్రయత్నించారు.
ఇక ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తన ప్రసంగాల తీరును మార్చుకున్నారు. 2014 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కంప్లీట్‌గా తెలుగులో ప్రసంగాలిచ్చిన పవన్‌ కల్యాణ్‌ 2024 ఎన్నికల తర్వాత మార్గాన్ని మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీషులో ప్రసంగించడానికి మొగ్గు చూపుతున్నారు. తొలి నాళ్లల్లో తెలుగులోనే ప్రసంగిస్తూ అడపా దడపా ఇంగ్లీషులో మాట్లాడానికి ప్రయత్నిస్తూ వచ్చిన పవన్‌ కల్యాణ్‌ తిరుపతి తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి వచ్చిన నాటి నుంచి అధిక శాతం ఇంగ్లీషులో ప్రసంగించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. తిరుపతి తిరుమల లడ్డూ అపవిత్రమైందని ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన సనాతన డిక్లరేషన్‌ సభలో తన ప్రసంగం స్వరూపాన్ని మార్చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు నాలుగు భాషల్లో ఉధ్వేగభరితమైన ప్రసంగం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తనకు నాలుగు భాషలు వచ్చు, వాటి మీద తనకు పట్టుంది అన్న విషయం ప్రజలకు చెప్పాలని కాకపోయినా.. వాంటెడ్‌గానే ప్రీ ప్లాన్డ్‌గా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారనే టాక్‌ అప్పట్లో వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి తమిళంలో మాట్లాడారని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్‌ షాలకు తానేమి మాట్లాడుతున్నారో తెలియాలని.. ఎలా మాట్లాడుతున్నారో అనే విషయాలను తన ప్రసంగం ద్వారా చెబుతూనే వారి మెప్పు పొందేందుకు అలా మాట్లాడారనే టాక్‌ కూడా అప్పట్లో వినిపించింది.
మరో వైపు పవన్‌ కల్యాణ్‌ చేత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలే ఆ విధంగా మాట్లాడించారనే చర్చ కూడా సాగింది. ఎన్నికల సమయాల్లో హిందూవుల ఓటింగ్‌ను పోలరైజ్‌ చేసేందుకు మోదీ, అమిత్‌షాలు ఇలాంటి వ్యూహ రచన చేస్తారనేది రాజకీయ పరిశీలకుల్లో వినిపించే మాట. అందులో భాగంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పవన్‌ కల్యాణ్‌ను ఎన్నుకున్నారు. ఆయన ప్రముఖ సినీ హీరో కావడం, దేశ వ్యాప్తంగా ఆయన గురించి కాస్తో.. కూస్తో తెలిసి ఉండం, జనసేన అధ్యక్షులు కావడం, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో నేషనల్‌ మీడియా అంతా ఆయనపై ఫోకస్‌ పెడుతుందని, దీంతో పవన్‌ కల్యాణ్‌ మాటలు దేశ వ్యాప్తంగా ప్రజలకు రీచ్‌ అవుతాయని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని ప్లాన్‌ చేశారని, వారు ఊహించిన విధంగానే హిందూ ఓటింగ్‌ పోలరైజ్‌ చేయడంలో పవన్‌ కల్యాణ్‌ సనాతన ప్రసంగం ఉపయోగపడిందని, మహారాష్ట్రలో వారికి ఫలితాలను తెచ్చి పెట్టిందనే చర్చ ఉంది.
Read More
Next Story