ఆ నీళ్ళు తాగి చావమంటారా ? మూసీపై ప్రజాభిప్రాయానికి సవాలు
x

ఆ నీళ్ళు తాగి చావమంటారా ? మూసీపై ప్రజాభిప్రాయానికి సవాలు

సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేలు జనాలు గోదావరి జలాలతో సంతోషంగా ఉంటే నల్గొండ జనాలు మాత్రం మూసీలోని మురికి నీళ్ళు తాగి చావాలా అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.


మూసీనది ప్రాజెక్టుపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలు విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ప్రతిపక్షలను ఉద్దేశించి మంత్రి పై ఛాలెంజ్ చేశారు. మూసీనది ప్రక్షాళనపై ప్రజాభిప్రాయసేకరణకు వెళదామా అంటు కేటీఆర్ ను ఉద్దేశించి కోమటిరెడ్డి సవాలు విసిరారు. మూసీనదిని ప్రక్షాళన చేయాలనే మంచి నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని నిలదీశారు. ప్రజాభిప్రాయసేకరణలో భాగంగా తాను బస్సు ఏర్పాటుచేస్తానన్నారు. తాను కూడా అందులోనే వస్తానని, ‘ప్రజలు ఏమి చెబుతారో ? ఏమిచేస్తారో మీరే చూడండి’ అని అన్నారు. 25 ఏళ్ళక్రితమే మూసీనది ప్రక్షాళనకు తాను దీక్షచేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అప్పట్లో జయశంకర్ తనకు మద్దతు తెలిపితే ఇపుడే బీఆర్ఎస్ నేతలు జనాలను రెచ్చగొడుతున్నారని మండిపోయారు.

నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువన్న విషయం అందరికీ తెలుసన్నారు. నల్గొండ జిల్లా వాసిగా మాట్లాడుతున్నానని, సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేలు జనాలు గోదావరి జలాలతో సంతోషంగా ఉంటే నల్గొండ జనాలు మాత్రం మూసీలోని మురికి నీళ్ళు తాగి చావాలా అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ నీళ్ళని అమెరికాకు తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే అందులో ఎంత విషం ఉందో అందరికీ తెలుస్తుందన్నారు. ప్రతిపక్షాల నేతలు నల్గొండ వచ్చినా లేదా వయా నల్గొండ ప్రయాణం చేసినా జనాలు బుద్ధిచెప్పటం ఖాయమన్నారు.

ప్రతిపక్షాల నేతలకు కనీసం మానవత్వం కూడా లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై మూసీనది ప్రక్షాళనపై కేసీఆర్ మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం ఒక తుగ్లక్ పని అని మంత్రి ఎద్దేవాచేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెట్టిందో అందరు చూసిందే అన్నారు. మూసీ పరిస్ధితి ఎంత భయంకరంగా ఉంటుందో కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్ ను అడగండని మంత్రి చెప్పారు. అధికారంలో ఉన్నపుడు మూసీ డెవలప్మెంట్ బోర్డన్న కేటీఆర్ దాన్ని ఏమిచేశారంటు నిలదీశారు. మూసీలో పారేది మొత్తం విషపు నీరే అన్నారు. తెలంగాణా వచ్చాక మూసీనది పరిస్ధితి మారుతుందని అనుకుంటే పదేళ్ళల్లో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారే మూసీనది పరిస్ధితి మాత్రం ఏమీ మారలేదని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు.

Read More
Next Story