విశాఖ ఉక్కుకు తాత్కాలిక ఊపిరి.. ఆగని ప్రైవేటీకరణ ఉరి!
x

విశాఖ ఉక్కుకు తాత్కాలిక ఊపిరి.. ఆగని ప్రైవేటీకరణ ఉరి!

ఉక్కుకు తాత్కాలిక ఊపిరి.. ఆగుతుందా ప్రైవేటీకరణ ఉరి? - వైజాగ్ స్టీల్. ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ. కర్మాగారం మనుగడకు వినియోగించాలన్న కేంద్రం.


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ఒకింత ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్కు రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఈ వార్తలు బయటకు పొక్కగానే కేంద్రంలోని ఎన్డీయే వర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి గురువారం సాయంత్రమే వైజాగ్ స్టీల్ ప్లాంటు రివైవల్ ప్యాకేజీపై సంబంధిత కేంద్ర మంత్రులతో మీడియా మీట్ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనివార్య కారణాలతో అది రద్దయిందని, శుక్రవారం మీడియాకు వెల్లడిస్తారని మరోసారి లీకులిచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు దాని కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులు, నాయకులు, రాజకీయ నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ అధికారికంగా స్టీల్ ప్లాంట్కు పునరుజ్జీవ ప్యాకేజీని అధికారికంగా ప్రకటించారు.

కేంద్రమంత్రి ట్వీట్..

అయితే ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని శుక్రవారంందయం నుంచే విశాఖలోని కూటమి నేతలు ప్రెస్మీట్లు పెట్టి స్టీల్స్టాంట్కు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని, ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషే కారణమని ఊదరగొట్టారు. విశాఖ వీధుల్లో బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడినప్పట్నుంచి కలుగులకే పరిమితమైన ఎన్డీయే నేతలు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేస్తుండడం విశేషం! కాగా స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీపై విశాఖ ఎంపీ శ్రీభరత్, భీమిలి, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ఎందుకింత హంగామా?

ప్యాకేజీకే కూటమి నేతలు ఇంతలా హంగామా సృష్టించడానికి కారణాలున్నాయని అంటున్నారు కొందరు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కూటమి ప్రభుత్వ పెద్దలు వైఫల్యం చెందారన్న విమర్శలు విస్తృతంగా ఉన్నాయి. ఎన్డీయేలో భాగస్వామ్యం కావడం వల్లే వీరు కేంద్ర ప్రభుత్వాన్ని గాని, ప్రధాని మోదీని గాని గట్టిగా నిలదీయలేకపోతున్నారన్న ఆరోపణలు వీరిపై ఎప్పట్నుంచో ఉన్నాయి. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే అనకాపల్లి జిల్లాలో నిర్మించతలపెట్టిన మిట్టల్ ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్పైనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మక్కువ ఎక్కువన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వేదికపై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని మాట మాత్రంగానైనా అడగకపోవడం ఆయన విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్యాకేజీని చంద్రబాబు అండ్ కో తెచ్చారన్న భావన కలిగించే వ్యూహంలో భాగంగానే కూటమి నేతల హంగామా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్యాకేజీతో ఒకింత ఉపశమనం..

మరోవైపు విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజీ కింద రూ.11,440 కోట్లు నిధులను ఈ ప్లాంట్ నిలదొక్కుకోవడానికని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్లకు గాను ప్రస్తుతం రెండు మాత్రమే నడుస్తున్నాయి. మూడోది నడవాలంటే ముడి సరకు అవసరమవుతుంది. ముడిసరకు కొనుగోలుకు ప్లాంట్ యాజమాన్యం వద్ద నిధుల్లేవు. దీంతో ఈ ప్యాకేజీ నిధులతో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను పునరుద్ధరించడంతో పాటు ఎన్ఎండీసీ నుంచి రా మెటీరియల్ కొనుగోలుకు రక్షణ లభించడంతో పాటు ఇతర అత్యసవరాలు తీర్చేందుకు వినియోగిస్తారని ఆయన స్పష్టం చేశారు. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ను పునరుద్ధరిస్తే ప్లాంట్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే బ్యాంకులకు అప్పులతో పాటు వడ్డీలు చెల్లించాల్సి ఉంది. ఇంకా గత సెప్టెంబర్ నెల నుంచి కార్మికులకు 250 శాతం జీతాలు బకాయి పడింది. ఈ మొత్తం రూ.250 కోట్ల వరకు ఉంది.. ఈ ప్యాకే నిధులతో అప్పులు, వడ్డీల చెల్లింపుల సంగతెలా ఉన్నా తక్షణమే తమకు జీతాల బకాయిలు చెల్లింపులు జరుగుతాయని ఉక్కు కార్మికులు గంపెడాశతో ఉన్నారు. నాలుగు నెలల క్రితం కేంద్రం ఇచ్చిన రూ.1,650 కోట్ల నిధులు బ్యాంకులు, జీఎస్టీ బకాయిల చెల్లింపులకు వెచ్చించారు.

ప్రైవేటీకరణ ఆగిందన్న గ్యారంటీ ఏది?

వైజాగ్ స్టీల్ ప్లాంట్కు రివైవల్ ప్యాకేజీ వస్తుందన గానే కూటమి నేతలు ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్న హంగామా చేస్తున్నారు. ప్యాకేజీ ప్రకటించినా ప్రైవేటీకరణ జరగదన్న గ్యారంటీ ఏమీ లేదని ఉక్కు కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ప్యాకేజీ ప్యాకేజీయే, ప్రైవేటీకరణ ప్రైవేటీకరణే అన్న భావనలో వీరున్నారు. ప్యాకేజీ ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరింకునే దాకా తమ ఉద్యమం ఆగదని వీరు స్పష్టం చేస్తున్నారు.

Read More
Next Story