
AP Governor Abdul Nazeer
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో సౌదీకి ఉన్నత స్థాయి బృందం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 42 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 45 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి భారత బృందం సౌదీకి వెళ్లనుంది. భారత విదేశాంగ శాఖ నిన్న రాత్రి ఈ విషయాన్ని ప్రకటించింది. మృతుల అంత్యక్రియలు, గుర్తింపు, స్థానిక సహాయక చర్యల పర్యవేక్షణ ఈ బృందం ప్రధాన బాధ్యత వహిస్తుంది.
విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖతో సహా సౌదీ అధికారులతో సమన్వయంతో బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఈ బృందం అక్కడికి వెళుతోంది. గవర్నర్ నజీర్‌తో పాటు విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్ ఛటర్జీ కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉంటారు. అవసరమైతే మృతుల అంత్యక్రియల్లో ఈ బృందం పాల్గొంటుందని కేంద్రం తెలిపింది. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు మాత్రమే బయటపడగలిగారు.
మక్కా నుంచి మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవదహనమయ్యారు. డ్రైవర్ సహా ఇద్దరు మాత్రమే బయటపడగలిగారు. మొత్తం 35 మంది భారతీయుల్ని బాధితులుగా గుర్తించినట్టు విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Andhra Pradesh Governor S Abdul Nazeer) నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ బృందం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది.
అబ్దుల్ నజీర్ ను ఎందుకు ఎంపిక చేశారంటే...
సౌదీ అరేబియా చట్టాలపై ముస్లిం సమాజానికి చెందిన గవర్నర్ నజీర్‌కి ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉంది. హజ్, ఉమ్రా ప్రయాణాలకు సంబంధించిన ధార్మిక, సాంస్కృతిక అంశాలపై ఆయకు లోతైన అవగాహన ఉంది.
ఈ ప్రమాదం హజ్/ఉమ్రా యాత్రికులపై ప్రభావం చూపినందున, సౌదీ అధికారులతో సంభాషణలు, ఆచార వ్యవహారాల నిర్వహణలో నజీర్ వంటి వ్యక్తి సున్నితంగా, గౌరవంగా సమన్వయం చేయగలరని కేంద్రం భావించింది.
నజీర్ భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. అంతర్జాతీయ స్థాయి చర్చలు, ప్రోటోకాల్‌లు, సున్నిత అంశాలపై వ్యవహరించడంలో ఆయనకు తగిన నిగ్రహం, అనుభవం ఉంది.
మరణించినవారి గుర్తింపు, మృతదేహాల అప్పగింత, అంత్యక్రియల వంటి చట్టపరమైన, సమన్వయ అంశాల్లో న్యాయపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునే సామర్థ్యం ఉంది.
Next Story

