‘ఏపీకి కేటాయించింది అప్పే’.. స్పష్టం చేసిన బీజేపీ నేత
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన రూ.15వేల కోట్ల కేటాయింపుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు స్పష్టతనిచ్చారు. ఏపీని చూసి కాంగ్రెస్ కళ్లలో నిప్పులు పోసుకుంటుందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ఈ కేటాయింపు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కానీ ఈ రూ.15000 కోట్లను కేంద్రం అప్పుగా ఇప్పిస్తుందా లేకా గ్రాంట్‌గానే అనేది మాత్రం అంతుచిక్కకుండా పోయింది. కాగా.. అదంతా కూడా అప్పేనని, దాన్ని మళ్ళీ ఆంధ్ర ప్రజలే కట్టాలని వైసీపీ కోడైకూస్తోంది. తాజాగా దీనిపై బీజేపీనేత జీవీఎల్ నరసింహరావు స్పష్టతనిచ్చారు. ఆంధప్రదేశ్‌కు కేంద్రం చేస్తానన్న రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం అప్పేనని తేల్చి చెప్పారు. కానీ ఈ అప్పును తిరిగి ఆంధ్రప్రభుత్వ కడుతుందా లేక కేంద్రమే కట్టుకుంటుందా అనేది మాత్రం తెలియదన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కేటాయింపు విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ అప్పును కేంద్రమే కట్టుకుంటే దీనిని ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రాంట్‌గా భావించొచ్చు. అలా కాకపోతేనే కష్టం. అయితే ఈ రూ.15వేల కోట్ల అప్పును తీర్చడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని కూడా జీవీఎల్ వివరించారు.
కాంగ్రెస్ కళ్లలో నిప్పులు
అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇస్తానన్న స్పెషల్ ప్యాకేజేపైనా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఏపీకి ప్యాకేజీ లభించడంతో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయంటూ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సయమంలో కూడా ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఏపీ నష్టపోవడానికి, నేడు రాజధాని లేని రాష్ట్రంగా మారడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని, అందుకే ఆంధ్రకు ప్యాకేజీ వస్తే జీర్ణించుకోలేక పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం చేస్తానన్న రూ.15వేల కోట్ల రుణ సహాయంపై గతంలోనే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అప్పు తీసుకొచ్చి జబ్బలు చర్చుకోవడం చంద్రబాబుకే చెల్లిందని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఓ తెగ చెప్పారు. సంపద సృష్టించడం అంటే అప్పు తెచ్చుకోవడానికి అనుమతి పొందడమా’’ అంటూ చురకలంటించారు. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్‌లో ఈ అప్పు మినహా ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది గుడ్డి సున్నా అంటూ ఎద్దేవా కూడా చేశారు.