
రాయలసీమను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రచార, ఆర్భాటాలే తప్ప రాయలసీమకు ఒరిగిందేమీ లేదని బొజ్జా దశరథరామిరెడ్డి మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను విస్మరించాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్ష్యులు బొజ్జా దశశథరామిరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో దేశంలోని 100 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నాటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందని, ఆ కార్యక్రమం అమలు చేయ్యడంలో యూపీఏ విఫలమయ్యిందని విమర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇప్పుడు కర్నూలు సభలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ అమలుపై ఒక్క మాట ప్రస్తావించకపోవడం రాయలసీమ వాసులకు తీవ్ర నిరాశ కలిగించిందని మండిపడ్డారు.
శుక్రవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా ప్రజలపై భారంగా జీఎస్టీ పన్నులు విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా స్వల్ప పన్ను తగ్గింపును ‘‘ప్రజలకు లాభం’’గా ప్రదర్శిస్తూ ‘‘జీఎస్టీ – 2 వారోత్సవ ప్రారంభ సభ’’ ద్వారా ప్రధానమంత్రి ప్రచారం చేయడం మోసపరిచే ప్రయత్నంగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరింత భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా రాయలసీమ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మూడు ప్రధాన తప్పిదాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
1. హైదరాబాదు రాజధానిని 10 సంవత్సరాలపాటు కొనసాగించకుండా తొందరపడి అమరావతికి తరలించడం,
2. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం స్వయంగా చేపట్టడం.
3. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి సంక్షేమ పథకాలు చేపట్టడం.
వంటి నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన వివరించారు.
ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించలేని స్థితి ఏర్పడిందని బొజ్జా పేర్కొన్నారు. ఉదాహరణకు.. ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న అలగనూరు రిజర్వాయర్ పునరుద్ధరణకు కేవలం రూ. 3 కోట్ల రూపాయలు కేటాయించడానికీ ప్రభుత్వానికి చేతగాకపోయిందని ధ్వజమెత్తారు. అదే విధంగా, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులలో రెండు నుండి పది శాతం పనులు పూర్తి చేయడానికి అవసరమైన రూ. 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయలేకపోయిందని మండిపడ్డారు. ఈ కారణంగా 7 లక్షల ఎకరాల సాగునీటి సదుపాయం అందకుండా రైతులు నష్టపోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ పర్యటనకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కూడా, రాయలసీమ రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న కరువు, నీటి కొరత, వలస సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. లక్షలాది ప్రజల ఆకాంక్ష అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆల్ ఇండియా ఇన్సి్టట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లను రాయలసీమలో ఏర్పాటుపై ప్రకటన రాకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ పట్ల చిత్తశుద్ధి లేదని మరోసారి బహిర్గతం అయిందని బొజ్జా ఘాటుగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి మోదీ నుంచి ఏ విధమైన ప్రకటన రాకపోవడం ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగించిందని బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు.
Next Story