
కర్నూలు బస్సు కాలిపోయేందుకు కారణమైన బైకర్ ఇతనే...
వైరల్ గా మారిన బైకర్ శివశంకర్ సిసి ఫుటేజ్
(వడ్ల శ్రీకాంత్)
కర్నూల్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన బస్సు ప్రమాద సంఘటన జరిగి 24 గంటలు దాటింది. 20 మంది మృతికి కారణమైన సంఘటన పట్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ మృతదేహాన్ని నిన్ననే పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.
కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామానికి చెందిన శివశంకర్ గ్రానైట్ బండల పని చేస్తున్నట్టుగా స్థానికులు తెలిపారు. ఇటీవలే కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని శివశంకర్ గత రెండు మూడు రోజులుగా ఇంటికి కూడా వెళ్లకుండా తిరుగుతున్నట్టుగా సమాచారం. తాజాగా బస్సు దుర్ఘటన జరగడానికి ముందు అంటే శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో శివశంకర్ మరొక మిత్రునితో కలిసి కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సిసి ఫుటేజ్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రమాదానికి ముందు శివశంకర్ పెట్రోల్ బంకులో తన పల్సర్ బైక్ ను ఆపి మిత్రుడితో కలిసి పక్కకు వెళ్లి వచ్చిన విజువల్స్ అగుపిస్తున్నాయి కానీ అతడు పెట్రోలు వేయించుకున్నట్టు కనపడలేదు. దీంతో అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు అతనితో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎటుపోయాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు కొద్దిసేపు ముందు మాత్రమే జరిగినటువంటి ఈ సిసి ఫుటేజ్ లో ఉన్నటువంటి మరొక వ్యక్తి దొరికితే మరింత సమాచారాన్ని సేకరించవచ్చు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

