పత్తి కొనుగోలులో మెలికలు పెడుతున్న సీసీఐ
x
పత్తి నాణ్యతను పరీక్షిస్తున్న ఏపీ రాష్ట్ర ఉన్నతాధికారుల బృదం

పత్తి కొనుగోలులో మెలికలు పెడుతున్న సీసీఐ

ఏపీలో పత్తి కొనుగోలులో సీసీఐ మెలికలు పెడుతోంది. తేమ శాతం ఎక్కువ ఉందనే షాకుతో పత్తి కొనుగోలు చేయడం లేదు.


ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 ఖరీఫ్‌లో 4,48,219 హెక్టార్లలో సాగైన పత్తి పంట ఇప్పుడు మార్కెట్‌కు చేరుతోంది. కానీ మొంథా తుఫాను, అకాల వర్షాల కారణంగా పంటలో తేమ శాతం 12-18 శాతం మధ్య ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిసిఐ నిబంధనల ప్రకారం 12 శాతం పైబడి తేమ ఉన్న పత్తిని తిరస్కరిస్తుండటంతో గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో పత్తి పంట ప్రధానముగా కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అధికంగా సాగు చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 4,48,219 హెక్టార్లలో పత్తి సాగు కాగా, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరపై సిసిఐ కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోనెం.843, తేదీ: 25.09.2025 ద్వారా మార్గ దర్శకాలను జారి చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని, అలాగే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఆధ్వర్యములో కొనుగోలు కేంద్రం వారీగా క్షేత్రస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ ఎంతవరకు ఫలిస్తుంది?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 29 అక్టోబర్ 2025 నుంచి సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించింది. 11 మార్కెట్ యార్డులు, 66 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ఇప్పటివరకు 24 మిల్లుల్లో 3,643 మంది రైతుల నుంచి 99,623 క్వింటాళ్లు, రూ.78.13 కోట్ల విలువైన పత్తి కొనుగోళ్లు జరిగాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ కొనుగోలు జరిగింది.

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కేంద్రాన్ని ఒత్తిడి చేస్తూ కపాస్ కిసాన్ యాప్‌ను సీఎం యాప్‌తో అనుసంధానం చేయించారు. గుంటూరులో పత్తి కొనుగోలు కేంద్రంగా ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమించారు. సమీప జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి అమ్మే సౌలభ్యం కల్పించారు. ఇవన్నీ రైతులకు ఊరట కలిగించిన చర్యలే.


పత్తి రైతులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఉన్నతాధికారులు

రైతు చెబుతున్న మాట ఇదే!

“తేమ ఎక్కువ ఉందని సిసిఐ వాళ్లు పత్తి తిరస్కరిస్తున్నారు. వర్షంలో తడిసిన పత్తి, రంగు మారిన పత్తికి కూడా ధర లేదు. మా ఖర్చు క్వింటాల్‌కు రూ.8,000 నుంచి 8,500 దాటింది. ఎంఎస్‌పీ బన్ని, బ్రహ్మ రకాల పత్తి క్వింటా బేస్ రేటు రూ. 7,121లు మాత్రమే. ఇంతకంటే తక్కువ ధరకు మేము ఎవరికి అమ్మి ఏమి చేసుకోవాలి” అంటున్నారు పల్నాడు జిల్లా గురజాల రైతు లేళ్ల రామయ్య.

ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 12-18 శాతం తేమ ఉన్న పత్తిని అనుపాత తగ్గింపుతో కొనుగోలు చేయాలి. వర్షంలో తడిసిన, రంగు మారిన పత్తికి తగిన ధర తగ్గింపుతో ఎంఎస్‌పీ ఇవ్వాలి. ఈ ప్రతిపాదనలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రం ఒత్తిడి తెస్తోంది.

CCI సాధారణ నియమం ప్రకారం ప్రామాణిక తేమ శాతం 8.5 శాతం. (ఈ స్థాయి వరకు పూర్తి ధర ఇస్తారు) 8.5 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే ప్రతి 1 శాతం అదనపు తేమకు 1 శాతం ధర తగ్గిస్తారు (అనుపాత తగ్గింపు).

2025-26 సీజన్ -ఏపీలో ప్రధాన పత్తి రకాలకు CCI MSP ధరలు (రూ./క్వింటాల్)

పత్తి రకం / వర్గం

స్టేపల్ లెంగ్త్ (మి.మి.)

మైక్రోనాయిర్

CCI కొనుగోలు ధర (రూ.)

బన్నీ (Bunny), బన్నీ బ్రహ్మ

29.5 – 30.5

మీడియం (4.0–4.9)

7,121 (బేస్ రేటు)

బన్నీ – మంచి నాణ్యత

29.5 – 30.5

హై (10.5+)

7,736

జాకీ (Jackie), రాక్స్టార్

28.0 – 29.4

మీడియం

7,060 – 7,238

జాకీ – మంచి నాణ్యత

28.0 – 29.4

హై (10.5+)

7,736

ఆర్ సీహెచ్-2 (RCH-2), బీటీ రకాలు

27.5 – 28.5

మీడియం

7,010 – 7,229

ఆర్ సీహెచ్-2 – మంచి నాణ్యత

27.5 – 28.5

హై (10.5+)

7,736

ఎక్స్‌ట్రా లాంగ్ స్టేపల్ (అరుదు)

31.0 మీ+

-

7,921 – 8,021

రైతులకు ప్రభుత్వ సూచన

“రైతులు ఎటువంటి ఒత్తిడి లేకుండా, పంట పూర్తిగా అమ్మే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి. నాణ్యతా ప్రమాణాల్లో సాధ్యమైనంత వరకు తేమ తగ్గించి, సిసిఐ కేంద్రాలకు తీసుకొస్తే గిట్టుబాటు ధర పొందొచ్చు” అని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

కానీ నిజమైన సమస్య ఇక్కడే ఉంది

ఎంఎస్‌పీ రూ. 7,121 కాగా, ఉత్పాదన ఖర్చు రూ.8,500 దాటడం… ఇది రైతును నష్టంలో పడేస్తోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. రైతులు ప్రైవేటు వ్యాపారులకు రూ.6,000 నుంచి 6,500కే అమ్ముకున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి వస్తుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది.

ప్రభుత్వం చూపిన చొరవ, సాంకేతిక సౌలభ్యాలు, కేంద్రంపై ఒత్తిడి ఇవన్నీ రైతుకు కాస్త ఊరట కలిగించాయి. కానీ తేమ శాతం, రంగు మారిన పత్తి విషయంలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే రైతు మళ్లీ నష్టంలో పడే ప్రమాదం ఉంది. రైతు శ్రమకు గిట్టుబాటు ధర రావాలంటే కేంద్రం వెంటనే స్పందించాల్సిందే. అప్పుడే ఆంధ్రప్రదేశ్ పత్తి రైతు నోట నవ్వు వికసిస్తుంది.

సంక్షోభంలో పత్తి రైతులు: ఎంవిఎస్ నాగిరెడ్డి

ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రెండేళ్లుగా పత్తి రైతు సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవిఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన విత్తనోత్పత్తి ధరను రైతులకు విత్తనకంపెనీలు చెల్లించడం లేదు, 2008-09 లో పత్తి క్వింటాలు ధర రూ. 6,500 ఉంది. దీంతో లాభసాటిగా ఉండడంతో సాగు విపరీతంగా పెరిగి పోయింది. ఫలితంగా ఇపుడు కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు అని అన్నారు. గతేడాది క్వింటాలు పత్తి ఉత్పత్తికి రూ. 5,760 వ్యయం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,900 మద్దతు ధర ప్రకటించింది. చివరికి రైతుకు వచ్చిన ధర రూ. 3,500 మాత్రమే. ప్రస్తుతం ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ. 5,950 ఉంటే, మద్దతు ధర రూ. 4,000గానే ఉందని అన్నారు.

క్వింటా పత్తి కి రూ. 12,000 లు ఇవ్వాలి: కెవివి డిమాండ్

పత్తి క్వింటాలు ధర రూ. 12,000లు ఇవ్వాలి. పత్తి దిగుమతి సుంకం తగ్గింపు జీవోను రద్దు చేయాలి. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన పత్తి రైతులకు పంటల బీమా వర్తింపజేసి పరిహారం ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. సీసీఐ వారు 18 శాతం తేమ ఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో అన్నారు. వచ్చేనెల 1న అన్ని జిల్లా కలెక్టర్ ల కార్యాలయాల్లో కలెక్టర్ లకు అర్జీలు ఇస్తామని, 8వ తేదీన గుంటూరులోని సీసీఐ కార్యాలయం ఎదుట పత్తిరైతుల సమస్యలపై ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Read More
Next Story