‘ఎందుకిలా చేస్తున్నారు’.. విమలమ్మను ప్రశ్నించిన సునీత రెడ్డి
x

‘ఎందుకిలా చేస్తున్నారు’.. విమలమ్మను ప్రశ్నించిన సునీత రెడ్డి

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దగ్గర ఆధారాలు ఉన్నాయని సునీత రెడ్డి వెల్లడించారు. విమలమ్మ ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు.


‘‘వైఎస్ వివేకా హత్యకు ఆధారాలున్నాయి’’ అంటూ వైఎస్ సునీత రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అవినాష్ రెడ్డే తన తండ్రి హత్య చేయించాడన్న వ్యాఖ్యలను తమ మేనత్త వైఎస్ విమలమ్మ ఖండించడంపై సునీత రెడ్డి ఫైరయ్యారు. ‘‘అన్నపై మేనత్త విమలమ్మ చూపిన ప్రేమ ఇదేనా. ఆమె చెప్తున్న విషయాలు దేనిలోని స్పష్టత లేదు. నాన్న హత్యను మొదటి నుంచి తప్పుగానే ప్రచారం చేశారు’’అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.నిజంగా ఈ హత్యలో అవినాష్ హస్తం లేకుండా అతడి అరెస్ట్‌ను జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారని, సీబీఐ దగ్గర ఉన్న నిందితుల జాబితాలో అవినాష్ పేరు ఎందుకు ఉందని సునీత ప్రశ్నించారు. నాన్నకు న్యాయం చేయాలని ఐదేళ్లుగా పోరాడుతున్నానని, ఈ పోరాటంలో ఏ అడుగోలోనైనా జగన్ తనకు మద్దతు తెలిపారా అని ఆమె నిలదీశారు.

ఐదేళ్లుగా ఎదురుచూపులు

‘‘నాన్నకు న్యాయం జరగకపోతుందా అని ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నా. న్యాయం కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా న్యాయం జరగలేదు. ప్రజలకు నిజం చెప్పాలన్న ఆశయంతోనే ప్రజల ముందుకు వచ్చాను. తనకు న్యాయం జరపాలను ప్రజాకోర్టులో కోరుతున్నాను. ప్రజా కోర్టులో నావైపు వాదనగానే వీటన్నింటిని వినిపిస్తున్నా’’అని ఆమె వివరించారు. ‘‘పై స్థాయిలో ఒత్తిళ్ల ఉండటం వల్లే ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ కేసులో సీబీఐ విచారణ ఇంకా జరగాల్సింది చాలా ఉంది. విచారణ చేయడానికి కూడా చాలా సమాచారం ఉంది. కానీ ఒత్తిళ్లే వాళ్ల చేతులకు సంకెళ్లుగా ఉన్నాయని నేను ఆరోపిస్తున్నా’’ అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దర్యాప్తు కూడా పూర్తయితే వివేకానంద రెడ్డి హత్యలో అసలు సూత్రధారులు బయటకు వస్తారని అభిప్రాయపడ్డారు.

మొదటి నుంచి తప్పుడు ప్రచారమే

‘‘నాన్న హత్య కేసును మొదటి క్షణం నుంచే తప్పుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. తొలుత గుండెపోటు వల్ల నాన్న చనిపోయారంటూ సాక్షిలో ప్రసారం చేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాన్న కేసులో తప్పుడు ప్రచారాలు జరిగాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారాలు జోరుగా సాగాయి. నిజాలను సమాధి చేసి అబద్దాలను అందలానికి ఎత్తి చూపారు’’అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఐదేళ్ల కిందట నేను ఒంటరి పోరాటం చేశారు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నాకు మద్దతునిస్తున్నాయి. నాకు అండగా, మద్దతుగా నిలుస్తున్న ప్రతి వ్యక్తికి పేరుపేరునా కృతజ్ఞతలు. నాన్న కేసులో నాకు తెలిసిన ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచాను. నాన్న హత్య కేసులో నాకు జరిగింది న్యాయమా. దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి.. చెప్తారు’’అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

నాన్న హత్యలో కృష్ణారెడ్డి హస్తం

‘‘నాన్న హత్యలో ఎంవీ కృష్ణారెడ్డి హస్తం కూడా ఉంది. శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 నుంచి 16 తేదీ ఉదయం వరకు స్విచ్‌ ఆఫ్ వచ్చింది. అవినాశ్‌రెడ్డి మాత్రం వీళ్లెవరో తెలియదని చెబుతున్నారు’’అని ఆమె తెలిపారు. అంతకుముందే ఆమె అవినాష్, భాస్కర్ రెడ్డితో కిరణ్ యాదవ్ ఉన్న ఫొటోలను విడుదల చేశారు. అంతేకాకుండా గంగిరెడ్డి, అవినాష్ మధ్య పలుమార్లు వాట్సాప్ కాల్స్ జరిగాయని ఆరోపించారు. అంతేకాకుండా హత్య తర్వాత ఉమాశంకర్ రెడ్డి పారిపోతున్న ఫుటేజ్‌ని సీబీఐ సేకరించిందని ఆమె వెల్లడించారు.

ప్రేమకు కొలతలు ఉంటాయా!

ఈ సందర్బంగానే ఇటీవల షర్మిల, సునీత వ్యాఖ్యలను వైఎస్ఆర్, వైఎస్ వివేకా సోదరి విమలమ్మ తప్పుబట్టారు. షర్మిల, సునీత చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యాఖ్యానించారు. తాజాగా విమలమ్మ వ్యాఖ్యలను సునీత కౌంటర్ ఇచ్చారు. ‘‘వివేకానంద అంటే మా నాన్నపైన నాకన్నా ఆమెకు(మేనత్త విమలమ్మ) ప్రేమ ఎక్కువంట. ఎక్కడైనా ప్రేమకు కొలతలు ఉంటాయా?’’అని ప్రశ్నించారు. ‘‘ విమలమ్మ గురించి ఏమైనా చెడుగా మాట్లాడితే మరణించిన వైఎస్ఆర్, వివేకా బాధపడతారని మాట్లాడకూడదనుకున్నాను. కానీ నిన్న మీటింగ్‌లో ఆమె కొన్ని అంశాలను లేవనెత్తారు. ఆ ఇంటర్వ్యూలోనే ఆమె ఎన్నో అబద్ధాలు చెప్పారు. అది అందరికీ తేటతెల్లం అవుతోంది. అన్న హత్య చేయబడ్డారు.. ఆ అంశానికి సంబంధించిన ఏదైనా సమాచారం తన దగ్గర ఉంటే దాన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియట్లేదు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత విమలమ్మకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘రాజశేఖర్ బతికి ఉండి ఉంటే అమ్మాయిలను బయటకు తీసుకువచ్చే వాళ్లు కాదు అని ఆమె అంటున్నారు.. కానీ ఇప్పుడు నాకు బయటకు రావాల్సి వచ్చింది. ఇది నేను కోరుకుని చేయట్లేదు. ఇప్పుడు సమస్య రావడం వల్ల వెనకాడకుండా, భయపడకుండా, పారిపోకుండా సమస్యతో పోరాడుతున్నాను. షర్మిల ప్రస్తావన కూడా తెచ్చారు విమలమ్మ.. ఆడబిడ్డలను వైఎస్ఆర్ బయటకు రానివ్వరు అని ఒకపక్క అంటూనే మరో పక్క షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయించాలని తానే సిఫార్సు చేశానని చెప్తున్నారు. అదేలా కుదురుతుంది. ఇంకా షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని అంటూనే మళ్లీ షర్మిలను ఎంపీగా నిలబెట్టాలని చెప్పానని అంటున్నారు.. ఆమె మాటలపై ఆమెకే నమ్మకం లేకపోతే ఎలా’’అని ప్రశ్నించారు.

వైఎస్‌ కుటుంబంలో మనస్పర్థలు

నిన్న విమలమ్మ, ఈరోజు సునీత రెడ్డి ఇచ్చిన మీడియా సమావేశాలు వైఎస్ కుటుంబంలోని మనస్పర్థలు, విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి. వైఎస్ కుటుంబం రెండు చీలే వాతావరణం కనిపిస్తోంది. ఇందులో షర్మిల, సునీత ఒకవైపు జగన్ మిగతా కుటుంబం ఒకవైపు ఉండేలా ఉంది అక్కడి పరిస్థితి. అయితే ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబంలో వస్తున్న కొత్త పరిణామాలు మరింత కీలకంగా మారుతున్నాయి. రాష్ట్ర ఎన్నికలకు పోటీ ఇచ్చేలా రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ కుటుంబ పరిస్థితులు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయా అన్నది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

భయపడే జగన్‌కు మద్దతా

ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ హస్తం కూడా ఉందని ఇప్పటికి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు కూడా ‘‘2009లో జరిగిన తండ్రి మరణాన్ని కూడా జగన్ రాజకీయాల కోసం వాడుకున్నారని, ఆ తర్వాత 2019లో బాబాయిని గొడ్డలి పోటుతో హతమార్చి దాన్ని ఎన్నికల్లో లబ్ది పొందడానికి వినియోగించుకున్న జగన్‌కు ఈ పండుటాకులు(పెన్షన్ లబ్దిదారులు) ఓ లెక్క. వీళ్ల మరణాలను కూడా జగన్ తన రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వ్యతిరేకంగా మాట్లాడితే తమకు ప్రమాదం ఉంటుందేమో అన్న భయంతోనే వైఎస్ కుటుంబమంతా జగన్‌కు మద్దతుగా మాట్లాడుతోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Read More
Next Story