కవిత కావాలనే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారు : సీబీఐ
x

కవిత కావాలనే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారు : సీబీఐ

సీబీఐ కవిత రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది. ఆమెని ఏ ప్రశ్నలడిగారు? కవిత ఎలా బదులిచ్చారు? అనే విషయాలను రిపోర్ట్ లో పేర్కొంది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 12 న 3 రోజుల సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. నేటితో కస్టడీ ముగియనుండటంతో సీబీఐ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కవితని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఏప్రిల్ 23 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.

ఈడి కేసులో ఏప్రిల్ 23 వరకు జ్యూడిషియల్ కస్టడీ ఉన్నందున, ఆ రోజు వరకు సీబీఐ కేసులోనూ కవితకి న్యాయస్థానం జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు ఆమెను సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి తీహార్ జైలుకి తరలించారు. కాగా, కోర్టుకి వెళుతున్న సమయంలో మీడియా ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బీజేపీ వాళ్ళు బయట ఏం మాట్లాడుతున్నారో లోపల సీబీఐ అవే ప్రశ్నలు అడుగుతోంది. రెండేళ్ల నుంచి అడిగినవే అడుగుతున్నారు. కొత్తగా ఏమీ అడగట్లేదు" అని కవిత అన్నారు.

సీబీఐ రిమాండ్ అప్లికేషన్:

"మూడు రోజుల సిబిఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ. 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించాము. లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించాం. అడిగిన ప్రశ్నలకు సూటిగా సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు, చెరిపేసే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజులపాటు జుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతున్నాం" అని సీబీఐ కవిత రిమాండ్ అప్లికేషన్ లో పేర్కొంది.

కవిత పై జడ్జి సీరియస్..

సంతకాల కోసం వెళ్ళిన సందర్భంలో కవిత న్యాయవాది మోహిత్ రావు వద్ద ఎమ్మెల్సీ కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్‌ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ మండిపడ్డారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Read More
Next Story