
వివేకా హత్య కేసు ..డైలమాలోనే సీబీఐ
సుప్రీంకోర్టును మళ్లీ గడువు కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ,దర్యాప్తు ముగిసినట్లేనా, కొనసాగుతుందా?
ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ డైలమాలో వుంది. హత్య కేసు దర్యాప్తు ముగిసిందా..? మళ్లీ కొనసాగించాలా అన్న విషయాన్ని ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఇవాళ మరోసారి వివేకా కేసు విచారణ సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేశ్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే సీబీఐ తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ ఎస్వీ రాజు ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా అనేది చెప్పేందుకు సమయం కోరారు. వివేకా కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరంపై తన అభిప్రాయం చెప్పేందుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు కూడా చేసేది లేక మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.ఇప్పటికే ఈ కేసులో నిందితులకు పెద్దల అండదండలు ఉండటంతో సీబీఐ ముందుకెళ్లలేకపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో తదుపరి దర్యాప్తుపై తేల్చేందుకు మరింత సమయం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.