చనిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సీబీఐ
x

చనిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సీబీఐ

నమ్మలేని నిజాలు ఇలాగే ఉంటాయి. చనిపోయిన వ్యక్తిని సీబీఐ 20 సంవత్సరాల తర్వాత అరెస్టుచేసింది.


నమ్మలేని నిజాలు ఇలాగే ఉంటాయి. చనిపోయిన వ్యక్తిని సీబీఐ 20 సంవత్సరాల తర్వాత అరెస్టుచేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే తాను చనిపోయినట్లు యావత్ సమాజాన్ని చివరకు న్యాయస్ధానాన్ని కూడా బురిడీకొట్టించిన వ్యక్తిని సీబీఐ వెంటాడి, వేటాడి చివరకు తమిళనాడులో అరెస్టుచేసింది. ఈ చీటర్ ను అరెస్టుచేయటం కోసం సీబీఐ అధికారులు 20 సంవత్సరాలు ఓపికగా దేశమంతా గాలించి చివరకు అరెస్టుచేశారు.

అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ కు చెందిన వీ. చలపతిరావు 2002లో చందూలాల్ బిరాదారి ఎస్బీఐ బ్రాంచ్ లో రు. 50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అందుకు ఫేక్ శాలరీ సర్టిఫికేట్లు, ఎలక్ట్రానిక్ షాపుకు సంబంధించి తప్పుడు కొటేషన్లు బ్యాంకుకు సమర్పించాడు. చలపతిరావుకు 50 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన బ్రాంచ్ అధికారులు తర్వాత రొటీన్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్లను పరిశీలించారు. తమ పరిశీలనలో అన్నీ దొంగసర్టిఫికేట్లే అని తేలింది. నిజంగా ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలంటే బ్యాంకులు సవాలక్ష ఆంక్షలు విధిస్తాయి. అదే మోసాలు చేసేవాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మరీ అప్పులిచ్చేస్తాయి.

బ్రాంచ్ లో జరిగిన మోసాన్ని గ్రహించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. బ్యాంకులో పెద్దమొత్తంలో మోసం జరిగింది కాబట్టి అధికారుల ఫిర్యాదు ప్రకారం సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టింది. కేసును దర్యాప్తుచేసిన సీబీఐ చలపతిరావుకు వ్యతిరేకంగా రెండు ఛార్జిషీట్లను కోర్టులో దాఖలుచేసింది. ఇక అరెస్టుచేయటమే మిగులుంది అనుకున్న సమయంలో చలపతిరావు మాయమైపోయాడు. అప్పటినుండి నిందితుడి కోసం సీబీఐ ఎంత వెతికినా దొరకలేదు.

కొంతకాలం తర్వాత చలపతిరావు భార్య కోర్టులో ఒక పిటీషన్ వేసింది. ఏమిటంటే తన భర్త మాయమైపోయి ఏడేళ్ళయింది కాబట్టి చనిపోయినట్లు ప్రకటించాలని పిటీషన్లో కోరింది. ఆమె పిటీషన్ను విచారించిన కోర్టు తగిన యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కొంతకాలం తర్వాత పోలీసుల రిపోర్టు ఆధారంగా కోర్టు చలపతిరావు చనిపోయినట్లుగా తీర్పిచ్చింది. దాని ప్రకారం నిందితుడి భార్య మున్సిపాలిటిలో చలపతిరావు డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నది. తీసుకున్న అప్పుకు చలపతిరావు ఆస్తులను జప్తు చేయటం కోసం బ్యాంకు ప్రయత్నించింది. అయితే దాన్ని నిందితుడి భార్య కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నది. అప్పు తీసుకున్న తన భర్త చనిపోయాడని, కాబట్టి తమ ఆస్తులను బ్యాంకు జప్తుచేసేందుకు లేదని నిందితుడి భార్య వాదించింది. కేసు ఇంకా నడుస్తునే ఉంది.

సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లో మాయమైపోయిన చలపతిరావు తన వేషం మొత్తాన్ని మార్చేశాడు. 2007లో వినీత్ కుమార్ పేరుతో ఆధార్ కార్డును తీసుకుని రెండో వివాహం చేసుకుని భోపాల్లో కాపురం పెట్టాడు. భోపాల్ లో కొంతకాలం లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేశాడు. హైదరాబాద్ బ్యాంకులో రు. 50 లక్షలు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన చలపతిరావు భోపాల్ లో లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేయటమే విచిత్రం. అక్కడి నుండి ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ కు 2016లో మకాం మార్చి టీచర్ గా కొంతకాలం పనిచేశాడు. సమాచారం తెలుసుకుని సీబీఐ రుద్రపూర్ కు వెళ్ళేసరికి అక్కడినుండి మాయమైపోయాడు.

టీచర్ గా పనిచేసినపుడు చలపతిరావు ఉపయోగించిన ఈ మెయిల్స్, ఆధార్ కార్డల ఆధారంగా సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పై ఆధారాలను ట్రాక్ చేసిన సీబీఐకి చలపతిరావుం ఔరంగాబాద్ లో ఒక ఆశ్రమం ఏర్పాటుచేసుకుని స్వామి విధితానంద తీర్ధ్ గా చెలామణి అవుతున్నాడని గుర్తించింది. చాలా జాగ్రత్తగా నిందితుడిని పట్టుకునేందుకు సీబీఐ ప్లాన్ చేసింది. ఒకరోజు హఠాత్తుగా ఆశ్రమంపై దాడిచేసింది. అయితే సీబీఐ వస్తున్న విషయాన్ని పసిగట్టిన నిందితుడు ముందురోజే పరారైపోయినట్లు తెలుసుకున్నారు. ఆశ్రమంలో ఉన్నపుడు భక్తులను రు. 70 లక్షలకు మోసం చేసిన విషయం బయటపడింది.

నిందితుడి గురించి వాకాబు చేసినపుడు రాజస్ధాన్ లోని భరత్ పూర్ లో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడినుండి కూడా మాయమైపోయాడు. అయితే ఈమధ్యనే అందిన సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు తమిళనాడులో తిరునల్వేలిలోని ఒక ఇంటిమీద దాడిచేశారు. ఆ ఇంట్లో నిందితుడు చలపతిరావుతో పాటు ఆయన రెండో భార్య కూడా ఉన్నారు. చలపతిరావు రెండో భార్య మొబైల్ నెంబర్ను సంపాదించిన సీబీఐకి ఆ ఫోన్ తిరునల్వేలిలో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. సిగ్నల్, టవర్ ఆధారంగా మొబైల్ ఫోన్ లొకేషన్ను గుర్తించిన సీబీఐ అధికారులు ఒక ఇంటిమీద దాడిచేసినపుడు చలపతిరావు, రెండో భార్య దొరికారు. వాళ్ళ దగ్గర దొరికిన డాక్యుమెట్ల ప్రకారం నిందితుడు శ్రీలంకకు బోటులో పారిపోయేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్లు బయటపడింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 20 ఏళ్ళల్లో చలపతిరావు ఎన్ని పేర్లు మార్చుకున్నా, ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎన్ని అడ్రస్సులు, ఎన్ని ఆధార్ కార్డులు మార్చినా, ఎన్ని ఫోన్ నెంబర్లు మార్చినా సీబీఐ మాత్రం వదలకుండా వెంటాడుతునే ఉంది. హైదరాబాద్ లో 2004లో మొదలైన వేట తమిళనాడులోని తిరునల్వేలిలో అరెస్టుతో ముగిసింది. విచిత్రం ఏమిటంటే చలపతిరావు చనిపోయినట్లు హైదరాబాద్ లోని సివిల్ కోర్టు ప్రకటించినా సీబీఐ ఆ విషయాన్ని నమ్మలేదు. చలపతిరావు తెలివితేటలపై బలంగా నమ్మకం ఉన్న సీబీఐ నిందితుడు ఎక్కడో బతికే ఉన్నాడని బలంగా నమ్మింది. ఆ నమ్మకంతోనే కేసును క్లోజ్ చేయకుండా రెండు దశబ్దాల పాటు ఎక్కడా నిరుత్సాహపడకుండా ఓపికగా వెతుకులాడుతునే ఉంది. చివరకు సీబీఐ నమ్మకమే నిజమై, నిరీక్షణ ఫలించి తిరునల్వేలిలో చలపతిరావును అరెస్టు చేయగలిగింది. సీబీఐకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Read More
Next Story