
400 మంది వైసీపీ నాయకులపై కేసులు..ఎక్కడంటే
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పేర్ని నాని, మరో 29 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు.
మచిలీపట్నం మెడికల్ కళాశాల వద్ద నిరసనలు చేపట్టారనే ఆరోపణలతో 400 మంది వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మరో 29 మంది వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనను కృష్ణా జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఘటన నేపథ్యం
వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. ఈ సమాచారం తెలిసిన పేర్ని నాని, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో స్టేషన్‌కు చేరుకుని, నేరుగా సీఐ గదిలోకి వెళ్లి హల్చల్ సృష్టించారు. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, పలువురు నాయకులు పోలీసులను అవమానించేలా మాట్లాడారని, అలా మాట్లాడకూడదని సీఐ ఏసుబాబు హెచ్చరించగా, పేర్ని నాని రెచ్చిపోయి, మావాళ్లనే తీసుకొస్తావా అంటూ వేలు చూపి బెదిరించారనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.
మెడికల్ కాలేజీ నిరసన మూల కారణం
ఈ కేసులకు మూలం ఇటీవల మెడికల్ కాలేజీ వద్ద పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేపట్టిన అనుమతి లేని నిరసన. కాలేజీలో పరీక్షలు జరుగుతున్న సమయంలో నిరసనకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినప్పటికీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి, లాఠీఛార్జ్‌కు గురయ్యారు. ఈ ఘటనలో 400 మందిపై కేసు నమోదు చేయగా, 41 మందికి 41ఏ నోటీసులు జారీ చేసి, విచారణకు రావాలని ఆదేశించారు. అయితే, ‘తాము చెప్పేవరకు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దు‘ అని సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అతన్ని శుక్రవారం అరెస్ట్ చేశారు, ఇదే పేర్ని నాని రాకకు కారణమైంది అనే వాదన పోలీçసుల్లో వినిపిస్తోంది.
పోలీసుల స్పందన
పోలీసు విధులకు ఆటంకం, బెదిరింపులు, అవమానకర వ్యాఖ్యలను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. చట్టం అందరికీ సమానం. ఈ రకమైన దౌర్జన్యాలను సహించబోము అని హెచ్చరించారు. దర్యాప్తు కొనసాగుతోంది. మరో వైపు దీనిని, ఈ కేసులను రాజకీయ కక్షసాధింపులుగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.
Next Story