అనంతపురంలో అభ్యర్థులు సిండికేట్‌ అయ్యారు!
x

అనంతపురంలో అభ్యర్థులు సిండికేట్‌ అయ్యారు!

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో అభ్యర్థులు సిండికేట్‌ అయ్యారు. ఎందుకయ్యారు. ఏమి జరిగింది. గెలుపెవరిది?


అందరిదీ ఒక దారైతే అనంతపురం వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులది మరో దారి అనంతపురం అర్బన్‌ అభ్యర్థులైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంత వెంకట్రామిరెడ్డిలు గెలుపు ఓటములను పక్కనబెట్టారు. ఎన్నికల్లో డబ్బు విచ్చల విడిగా ఖర్చు పెట్టడం వల్ల నష్టం తప్ప లాభం లేదని భావించారు. ఓట్ల కొనుగోలుకు అసలు డబ్బే ఖర్చుపెట్టవద్దనే నిర్ణయానికి మొదట వచ్చారు. అయితే పార్టీ కేంద్ర నాయకుల నుంచి పార్టీ పరంగా ఓటర్లకు డబ్బులు పంచేందుకు కొంత మొత్తం రావడం వల్ల వారు ఓటర్లకు డబ్బులు ఇవ్వక తప్పలేదు. ఇందుకు ఇద్దరు అభ్యర్థులు ఒక రాజీ ఫార్ములా అవలంభించారు.

మధ్య వర్తి ద్వారా..
రాజకీయంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏదో జరుగుతుందని చిలువలు పలువలు చేసే అవకాశం ఉండటం, పార్టీల కార్యకర్తల్లోనూ నాయకులు ఒకటేననే అపోహలు వస్తాయనే అనుమానంతో మధ్య వర్తి ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇరు వర్గాలకు చెందిన తమ అనుచరుల ద్వారా సంప్రదింపులు జరిపి మధ్యవర్తిని నియమించుకున్నారు. మధ్య వర్తి చెప్పిన ప్రకారం ఒక్కో ఓటరుకు వెయ్యి రూపాయలు ఓటు కొనుగోలుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇరు వర్గాల వారు ఎంత మందికి డబ్బులు పంచాలని నిర్ణయించారో అంతమందికి ఓటుకు వెయ్యి వంతున పంపిణీ చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాలే దు. డబ్బలు పంచుతున్నారనే ఫిర్యాదులు లేవు. ఇద్దరు అభ్యర్థులు ఓటుకు వెయ్యి మాత్రమే ఇస్తున్నందున వాళ్లు ఎక్కువిచ్చారు, మీరెందుకు ఇవ్వటం లేదనే ప్రశ్న వేసేందుకు అస్కారం లేకుండా పోయింది.
ఇండియా కూటమి నుంచి సీపీఐ..
ఇక్కడి నుంచి ఇండియా కూటమి తరుపున సీపీఐ అభ్యర్థిని కమ్యూనిస్టు పార్టీ రంగంలోకి దించింది. దీంతో కమ్యూనిస్టులు కూడా కొంత సంతృప్తితోనే ఉన్నారని చెప్పొచ్చు. అనంతపురం పట్టణం గతంలో కమ్యూనిస్టులకు కంచుకోట. తరిమెల నాగిరెడ్డి ఇక్కడ రెండు సార్లు, పుట్లూరులో ఒకసారి గెలిచారు. పార్లమెంట్‌లో తన వాణి వినిపించారు. ఇప్పటికీ కమ్యూనిస్టులంటే అక్కడి ఓటర్లకు సానుకూలత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు కొనుగోలుకు రెండు నుంచి మూడు వేల వరకు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కొన్ని ఓట్ల కొనుగోలుకు ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఓట్లను కొనుగోలు చేయడం చట్టబద్ధం చేసేశాయి. ఇది బయటకి కనిపించని విప్లవంగా మారింది.
ఇక్కడ గెలుపెవరిది?
అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్సార్‌సీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే. ఈయనకు ప్రజల్లో సానుకూల వాతావరణం ఉంది. వెంకట్రామిరెడ్డి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి వి ప్రభాకర్‌ చౌదరిపై గెలుపొందారు. 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ఈయనకే సీటు కేటాయించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన దగ్గుపాటి వెంకటేశ్వర చౌదరి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. 2014 ఎన్నికల్లో రాప్తాడు మండలంలో ఎంపీటీసీగా పోటీచేసి ఎంపిపి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 2019 నుంచి హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రభాకర్‌ చౌదరి సరిగా పార్టీకి పనిచేయలేదనే కారణంగా ఆయనకు కాకుండా ప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ కేటాయించింది. వెంకటేశ్వర ప్రసాద్‌ ఓటుకు మూడు వేలు ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని పార్టీ అధిష్టానానికి చెప్పారు. నియోజకవర్గంలో పరిస్థితులు చూసిన తరువాత ఎంత ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరుగా మారే అవకాశం ఉన్నందున రాజీ ఫార్ములా కుదుర్చుకుని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఇదో మంచి పరిణామంగానే ఓటర్లు చెబుతున్నారు. వెంకట్రామిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయంగా అనంత ప్రజల్లో వెంకట్రామిరెడ్డికి ఉత్తముడనే పేరు ఉంది.
ఏమైనా రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు అరుదుగా జరుగుతుంటాయి. ఎన్నికల్లో పోటీకి దిగిన వారు చావో రేవో తేల్చుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడ దానికి చరమగీతం పాడారు.
Read More
Next Story