ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
x

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.


కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మిడియట్‌ విద్యా విధానంపై దృష్టి సారించింది. అందులో భాగంగా పరీక్షల విధానం మార్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ఇంటర్‌ పరీక్షల విధానినికి స్వస్తి పలికింది. ఇంటర్‌ పరీక్షల విధానంలో సంస్కరణల పేరుతో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. సీబీఎస్‌ఈ విద్యా విధానంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తడికి గురవుతున్నారని, విద్యార్థుల్లో ఆ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇక నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌కు మాత్రమే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

ఇంటర్‌ విద్యకు సంబంధించి ఏళ్ల తరబడి మార్పులు కానీ, సంస్కరణలు కానీ జరగ లేదు. మరో వైపు జాతీయ కరికులం చట్టం ప్రకారం ఇంటర్‌లో సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా ఇంటర్‌ విద్యలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సంస్కరణలో భాగంగా ఇంటర్‌ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతీయ కరికులం చట్టం ప్రకారమే ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సైన్స్, ఆర్ట్స్, భాషా వంటి సబ్జెక్టుల్లో ఈ సంస్కరణలు అమలు చేయనున్నట్లు కృతికా శుక్లా తెలిపారు. అయితే ఇంటర్‌ విద్యా విధానంలో తీసుకొస్తున్న ఈ మార్పులు, సంస్కరణలకు సంబంధించి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా రంగ నిపుణుల నుంచి కూడా సలహాలను తీసుకుంటామని, ఆ మేరకు వారి సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇంటర్‌ విద్యా విధానంలో మార్పులు, సంస్కరణలపై జనవరి 26 లోగా సూచనలు, సలహాలు పంపాలని ఆమె తెలిపారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో నూతన సంస్కరణల వివరాలను ఉంచినట్లు కృతికా శుక్లా తెలిపారు. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో కూడా సంస్కరణలు తీసుకొస్తున్నామని, అందులో భాగంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను తొలగిస్తున్నట్లు చెప్పారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెట్టారు. వచే విద్యా సంవత్సరం అంటే 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో కూడా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెడుతామని, దీని వల్ల జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం కానీ, ఆ పరీక్షలను సులువుగా రాసేందుకు కానీ సులభతరం అవుతుందని కృతికా శుక్లా తెలిపారు. ఆయా కాలేజీలు అంతర్గతంగా ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహిస్తారని, ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలను మాత్రం ఇంటర్‌ బోర్డే అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో ఇంటర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టనున్నాం. అందుకు అవసరమైన సిలబస్‌ మార్పులు, కొత్త సబ్జెక్స్‌ కాంబినేషన్‌లో ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారాయణ విద్యా సంస్థల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నారాయణ కార్పొరేట్‌ విద్యా సంస్థల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మిడియట్‌ విద్యార్థు జీవితాలను పణంగా పెడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించడం పక్కన పెట్టి ఫీజులను దోపిడీ చేసేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.
Read More
Next Story