దమ్మున్న నిర్ణయం గట్టెక్కిస్తుందా...!?
x

దమ్మున్న నిర్ణయం గట్టెక్కిస్తుందా...!?

ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం వైఎస్. జగన్ మోనార్క్. ఇది వెంకటగిరి కోటలో ఎలాంటి ఫలితం ఇస్తుంది?!


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్సీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళింది. 2014 ఎన్నికల నుంచి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడంతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలతో దమ్మున్న నాయకుడు అనే పేరును కూడా జగన్ సంపాదించుకున్నారు. అందులో మచ్చుకు కొన్ని.. 2019 ఎన్నికల కోసం వైఎస్. జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండకు చేరింది. హత్యకు గురైన నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని రాష్ట్రంలో మొదట ప్రకటించారు. 2024 ఎన్నికలు : అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి సర్పంచ్, అంతకుముందు వ్యవసాయ కూలీగా పనిచేసిన సాధారణ వ్యక్తి ఈర లక్కప్పను అభ్యర్థిగా ప్రకటించారు.

సింగనమల ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచే విద్యావంతుడైన, టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులు అభ్యర్థిగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ బలంగా ఉందని, ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో అందించిన సంక్షేమ పథకాలు మేలు చేస్తాయనేది సీఎం జగన్ నమ్మకం. ఇదే సూత్రం ఏ మేరకు వెంకటగిరిలో ప్రతిఫలిస్తుంది అనేది సందేహాత్మకంగా మారింది. వెంకటగిరిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇంటి పోరులో చిక్కుకున్నారు. టిడిపి కూడా ఒక్క వ్యక్తితో మాత్రమే సతమతం అయినా, ఆ పాటు తప్పడంతో ఉపశమనం పొందుతున్నారు.

"తాము నమ్మిన.. తమను నమ్మిన" వారికి .. "ఎంత కష్టమైనా.. నిష్ఠూరమైనా అండగా నిలవడం’’ అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. అంతకు రెట్టింపు స్థాయిలోనే ఆ గుణాలను కలిగిన సీఎం జగన్ "మోనార్క్" నిర్ణయాలు తీసుకుంటారని ఓ ఉప ఎన్నిక, రెండు సార్వత్రిక ఎన్నికల్లో చాటుకున్నారు.

వెంకటగిరిలో... ఏం జరుగుతోంది..?

వెంకటగిరి నియోజకవర్గ ఓటర్లు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని సీఎం రావడానికి అండగా నిలిచారు. ఆయన సతీమణి రాజ్యలక్ష్మి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వారి వారసుడిగా వైఎస్ఆర్సిపి నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్న రామల్లి రాంకుమార్ రెడ్డి వచ్చేసరికి వారి కుటుంబానికి ఉన్న బ్రాండ్ ఓటర్లు చల్లాచెదురు అయ్యారు. అంతకుముందు చూస్తే...

తన తండ్రి దివంగత సీఎం వైయస్సార్‌కు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ విరోధి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారు. దీనిని వైయస్సార్సీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధం బస్సు యాత్రలను పూర్తి చేసుకున్న తర్వాత సీఎం జగన్ మొదటిసారి వెంకటగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులో నిబ్బరం నింపడానికి సర్వ సన్నాహ సత్తా నిరూపించి వెళ్లారు. కొన్ని సంవత్సరాల కిందటి చరిత్రలోకి వెళితే...

రాజకీయంగా దశాబ్దాల పాటు యువజన సీఎం డాక్టర్ వైఎస్ఆర్‌కు మాజీ సీఎం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేవి పరిస్థితులు. కానీ నేదురు మల్లి జనార్దన్ రెడ్డి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాత్రం దివంగత వైయస్సార్ సీఎం వెంట ఉండేవారు. ఆయన జగన్ పాదయాత్రలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది గతం.. ఆ తర్వాత..

అరగని "ఆనం"

రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని వేదన ఆయనలో ఉండేదని చెబుతారు. ఈ విషయాన్ని గరళం మాదిరి గొంతులో దాచుకున్న ఆయన.. అసెంబ్లీలో, వెలుపల చేసిన కొన్ని వ్యాఖ్యలు సీఎం జగన్కి రుచించలేదని చెబుతారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా టార్గెట్ అయిన వారిలో ఆనం వివేకానందరెడ్డి కూడా ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటికే సీఎం వైఎస్ జగన్ చెంతకు చేరిన నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆనం రామనారాయణరెడ్డి భగ్గుమనడంతోపాటు జగన్తో దూరం మరింత పెరిగిపోయింది. ఇది కాస్త ఆనంను తప్పించి, ఆ స్థానంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రకటిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

మారిన సమీకరణలు...

ఈ వ్యవహారాల నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. "నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి మంచివాళ్లే" వైయస్సార్సీపి అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డిని ఆమోదించలేమంటూ అధికార పార్టీలోని గ్రూపులన్నీ బలంగా స్వరం వినిపించాయి. "వెంకటగిరి నియోజకవర్గాన్ని కాపాడుకుందాం" అనే స్థాయికి వెళ్లిన మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి నియోజకవర్గంలోని ప్రధానంగా రాపూరు మండలం లోని జడ్పిటిసి, ఎంపీటీసీ సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భారీగా ర్యాలీ నిర్వహించి సంచలనం సృష్టించారు. ఈయన వెంకటగిరితో పాటు నెల్లూరు రూరల్, ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు.

అయినా, సీఎం జగన్ ఇసుమంత కూడా బెదరలేదు. ధనుంజయరెడ్డితో స్వరం కలిపి వ్యతిరేకంగా నినదించిన నాయకుడు కలిమిడి రాంప్రసాదరెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతినిధిగా వెళ్లిన వ్యక్తి అక్కడ నష్ట నివారణ చర్యలకు పూనుకోవడంతోపాటు సాగించిన మంత్రాంగం ఫలించింది. దీంతో ఆ నాయకుడు మళ్ళీ యథావిథిగా వైఎస్సార్సీపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

వారు చెబుతున్న కారణం ఒకటే..

నియోజకవర్గంలో " తమకు ప్రాధాన్యత గౌరవం కూడా ఇవ్వడం లేదనేది" ప్రధాన ఆరోపణ అంతేకాకుండా, వెంకటగిరి సెగ్మెంట్లో 6, 7 గ్రూపులు ఉన్నాయని, గడిచిన ఐదు ఎండలో వీరందరూ కలిసి నిర్వహించిన కార్యక్రమం ఒక్కటి లేదంటారు. కట్ చేసిన దాఖలాలు కూడా లేవని గుర్తు చేస్తున్నారు. తానే నియంత అన్నట్లు వ్యవహరిస్తున్న కారణంగానే వైఎస్ఆర్సిపి అభ్యర్థి వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆగని వలసలు..

వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి నిరసన సెగలు ఆగడం లేదు. ప్రతిపక్ష టీడీపీ కూటమిలోకి వలసలు కూడా తగ్గడం లేదు. ప్రధానంగా భూమి రెడ్డి కలిమిచర్ల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం కూడా ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే నియోజకవర్గంలోని చాలా మండలాల్లో జడ్పిటిసి లతోపాటు ఎంపీటీసీ సభ్యులు, మాజీలు, సర్పంచులు కూడా టిడిపి వైపు వెళ్లిపోయారు.

తాజాగా వెంకటగిరి రూరల్ మండలం ఎంపీపీ తంబిరెడ్డి తనూజ రెడ్డి, ఆమె భర్త శివారెడ్డి కూడా రెండు రోజుల క్రితం టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో చేరిపోయారు. వెంకటగిరి వైస్ ఎంపీపీ భూపతి సుధాకర్, ఎంపీటీసీ గోగుల మల్లికార్జున్, సీనియర్ నాయకులు గొట్లకుంట రామచంద్రారెడ్డి, పులి సుబ్రహ్మణ్యం రెడ్డి, గున్నేరి జనార్థన్ రెడ్డి, కాపిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటగిరి సొసైటీ మాజీ అధ్యక్షుడు తోట మురళీకృష్ణ ,వెంకటగిరి మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి ఆ కోవలోనే ఉన్నారు.

అయినా .. బెదరడం లేదు

వెంకటగిరి వైఎస్ఆర్సిపి నుంచి ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులు చాలావరకు గోడ దూకేశారు. అయినా అధికారపార్టీలో ఏ మాత్రం బెదురు లేనట్టు కనిపిస్తోంది. వెంకటగిరిలోని రాజకీయ పరిస్థితులను తెలుసుకున్న తర్వాత.. ఒకనాటి తన తండ్రి రాజకీయ శత్రువు కుమారుడు కావచ్చు. తాను చేరదీసిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కోసం సీఎం వైఎస్. జగన్ రావడం, ధైర్యం ఇచ్చి వెళ్లడం పార్టీ వర్గాల్లో ఊపిరి పోసినట్లు కనిపిస్తోంది. ఇలా ఉండగా..

‘పోటు’ తప్పింది

అధికార వైఎస్ఆర్సిపిలో అసమ్మతి తీర్చు ఎలా రగిలిందో.. అదే స్థాయిలో టిడిపికి కూడా అనుభవం ఎదురైంది. కానీ, అధికార వైఎస్ఆర్సిపిలో పరిణామాలు తమకు అనుకూలిస్తాయని టిడిపి నాయకులు బలంగా నమ్మారు. ఇక్కడి నుంచి మొదట మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ ప్రియ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నియోజకవర్గం ప్రచారం కూడా పోటీ చేశారు. అదే సమయంలో.. టిడిపి సీనియర్ నాయకుడు డాక్టర్ మస్తాన్ యాదవ్ " బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ" హార్డింగ్ ఏర్పాటు చేయడం సంచలనం రేకెత్తించింది.

ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రీతిలో డాక్టర్ మస్తాన్ యాదవ్ పావులు కదిపినా, ఫలితం కనిపించలేదు. బీఫారాల పంపిణీకి ముందే మస్తాన్ యాదవ్ టిడిపికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంతో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆయన మద్దతు దారులైన నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి నుంచి అభ్యర్థిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఒప్పించి కూతురికి కాకుండా తనకే టికెట్ తెచ్చుకొని పోటీలో ఉన్నారు.

ఇంటి పోరుతో సతమతమవుతున్న వైఎస్సార్సీపీకి స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోసిన ఊపిరి ఎంత మేరకు ప్రతిఫలిస్తుందనేది వేసి చూడాలి. అధికార వైయస్సార్సీపి నుంచి టిడిపి వైపు వెళ్లిన నాయకులు విజయాన్ని అందిస్తారా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలనున్నది.

Read More
Next Story