
యారాడ బీచ్‌లో లైఫ్ గార్డు వద్దని వారిస్తున్నా స్నానాలు చేస్తున్న విదేశీయులు (ప్రమాదానికి ముందు)
రష్యా నుంచి వచ్చి.. విశాఖలో అలలకు చిక్కి..!
నేవీ హెలికాప్టర్ల మరమ్మతులు, నిర్వహణ కోసం వచ్చిన విదేశీయుల్లో ఒకరు విశాఖ యారాడ బీచ్‌లో అలలకు బలయ్యారు.
ఎక్కడో విదేశాల నుంచి విధి నిర్వహణకు విశాఖపట్నం వచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా సాగరతీరానికి వెళ్లారు. అక్కడ ప్రకృతి రమణీయతను, పాల నురుగను తలపించే సముద్ర కెరటాలను, వాటి అలజడిని ఆస్వాదిస్తూ ఇసుక తిన్నెలపై గడిపారు. అలా ఆనంద పరవశంలో మునిగి తేలుతున్న వారికి కడలి కెరటాలు తమ వైపు రా రమ్మన్నట్టు ఆకర్షించాయి. అంతే.. ఇంకేమీ ఆలోచించకుండా వారంతా ఒడ్డు నుంచి సముద్రంలోకి అడుగు పెట్టారు. వారు అలా అడుగు పెట్టారో లేదో.. వెంటనే సముద్రం తనలోకి లాగేసుకుంది. వారిలో ఒకరిని పొట్టనబెట్టుకుంది. తీరని విషాదాన్ని నింపింది.
ఆర్కే బీచ్‌లో మునిగిన యువకుడిని రక్షించిన పోలీసులు, లైఫ్ గార్డులు
అసలేం జరిగిందంటే?
భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్లకు మరమ్మతులు చేయడానికి, వాటి నిర్వహణ కోసం ఇటలీ. రష్యా తదితర దేశాలకు చెందిన విదేశీ నిపుణులు విశాఖకు వస్తుంటారు. వీరు నేవీ సిబ్బందికి సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉంటారు. కొన్నాళ్ల తర్వాత తమ దేశాలకు వెళ్లిపోతుంటారు. వారికి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రానికి సమీపంలో ఉన్న డాల్ఫిన్ నోస్ వద్ద వసతి సదుపాయం కల్పిస్తారు. ఇలా కొన్నాళ్ల క్రితం విశాఖ వచ్చిన వారిలో 16 మంది ఇటలీ, రష్యా నిపుణులు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డాల్ఫిన్ నోస్‌కు ఆవల ఉన్న యారాడ బీచ్‌కు వెళ్లారు. కాసేపు ఒడ్డున గడిపిన వీరికి సముద్రంలోకి దిగి స్నానం చేయాలని అనిపించింది. దీంతో సముద్రంలోకి దిగడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన మెరైన్ పోలీసులు, జీవీఎంసీ ఈతగాళ్లు, లైఫ్ గార్డులు.. సముద్రం లోతుగా ఉంటుందని, ఈతకు అనువైనది కాదని, లోపలకు వెళ్లవద్దని ఎంతగానో వారించారు. అయినప్పటికీ వినకుండా లోపలికి వెళ్లి స్నానం చేస్తున్నారు. ఇంతలో ఉధృతంగా వచ్చిన కెరటాలు వీరిలో కొందరిని లోపలకి లాక్కుని పోయాయి. కొట్టుకుపోతున్న వారు కొందరు అతి కష్టమ్మీద ఒడ్డుకు రాగలిగారు. వీరిలో ఇద్దరు సముద్రం లోపలకు వెళ్లిపోయారు. వారిని లైఫ్ గార్డులు రక్షించడానికి ప్రయత్నించారు. వీరికి సీపీఆర్ చేశారు. అయితే వీరిలో రష్యాకు చెందిన అక్లాండ్ కోవ్ (60) అనే వ్యక్తి అప్పటికే చనిపోయారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని కేజీహెచ్‌లో శవ పరీక్షకు పంపారు.
రక్షించిన విదేశీయునికి సీపీఆర్ చేస్తున్న సహచరులు
విషాదంలో సహచరులు..
అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన సహచరుడు అక్లాండ్ కోవ్ ఆకస్మికంగా మృత్యువాత పడడడంతో తోటి మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రోజూ తమతో కలివిడిగా తిరిగే సన్నిహితుడు తమ నుంచి దూరమయ్యాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతుడిని రష్యాకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తూ..
అటు ఆర్కే బీచ్‌లోనూ..
మరోవైపు విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ వద్ద కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం 4.20 గంటల సమయంలో గాజువాక మిందికి చెందిన ఐదుగురు యువకులు ఆర్కే బీచ్ సందర్శనకు వచ్చారు. వీరు సముద్రంలోకి దిగి స్నానం చేస్తుండగా కిలారి సిద్ధు (18), ఆకిరి చరణ్ తేజ (18)లు ఇద్దరు కెరటాలకు చిక్కుకుని లోపలకు వెళ్లిపోయారు. అక్కడే విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్‌గార్డులు వారిని రక్షించారు. వీరికి చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు.
Next Story