బుడమేరు సరే.. కరకట్ట అక్రమ కట్టడాలను కూలుస్తారా?
కరకట్టపైన సీఎం చంద్రబాబు నివాసంతో పాటు పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. అవన్నీ అక్రమ కట్టడాలని జగన్ ప్రభుత్వం తేల్చింది. వాటిని కూడా కూలుస్తారా?
విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దానిని ఏవిధంగా చేయాలో చేసి భవిష్యత్‌లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు ఇక. ఇది మంచి పద్దతి కాదు. 2.3లక్షల కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చోని, వాళ్లకు జరిగిన నష్టం బాధపడుతూ, అవస్తపడాల్సిన పన్లేదు. కొంత మంది స్వార్థపరుల కోసం, ఇన్ని త్యాగాలు ప్రజలు, ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. జీవితకాలంలో కూడబెట్టుకున్న డబ్బంతా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అనాధలయ్యే పరిస్థితి వచ్చింది. కొంత మంది స్వార్థపరుల కోసం, కొంత మంది ల్యాండ్ గ్రాబర్స్ కోసరం, కొంత మంది పొలిటీషియన్స్ కోసం. ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంత మంది పొలిటీషియన్స్ సపోర్టుతో విచ్చల విడిగా చేసే పరిస్థితికొచ్చారని
బుడమేరు అక్రమాల తొలగింపుపై సీఎం చంద్రబాబు వరదల సమయంలో స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలను ఉపేక్షించే ప్రశ్నే లేదు. కొంత మంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోం. విజయవాడకు ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదు. పటిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. దీని కోసం ఆపరేషన్ బుడమేరు చేపడుతామన్నారు.
బుడమేరు ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, వాటి కూల్చివేత కాసేపు అలా ఉంచితే, ఆపరేషన్ బుడమేరు సరే..కృష్ణానది కరకట్టపైన ఉన్న ఆక్రమణలు, అక్రమ కట్టడాల మాటేంటి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బుడమేరు ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు కరకట్టపైన కట్టిన అక్రమ కట్టడాలు, ఆక్రమణలు, వాటి వల్ల కృష్ణ నదికి తలెత్తుతున్న ముప్పు, వరదల పోటు వంటి పలు అంశాలపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదనేది చర్చగా మారింది. ఒకే సమయంలో అటు బుడమేరు, ఇటు కృష్ణా నది వరదలు చోటు చేసుకున్నాయి. వెలగలేరు గేట్లు ఎత్తివేయడంతో విజయవాడ నగరంపై బుడమేరు విరుచుకొని పడటం, దీంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురికావడం, ఎన్నడు లేని విధంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి రావడం, దీంతో కృష్టా నది తీరం వెంబడి ఉన్న కాలనీలన్నీ ముంపునకు గురి కావడం, దీంతో పాటుగా ముఖ్యమంత్రి నివాసంతో సహా కరకట్టపైన ఉన్న కట్టడాలు వరద ముంపునకు గురి కావడం జరిగాయి. అయితే కరకట్టపైన అక్రమ కట్టడాల గురించి కాకుండా కేవలం ఆపరేషన్ బుడమేరు గురించి సీఎం మాట్లాడటం గమనార్హం.
అయితే గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కరకట్టపైన దాదాపు 24 కట్టడాలు ఉన్నాయని, కట్టపైన ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని, వాటిని కూల్చి వేసేందుకు రంగం కూడా సిద్ధం చేసింది. సీఆర్‌డిఏ ఆధ్వర్యంలో కూల్చి వేతలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చంద్రబాబు నివాసం, మంతెన సత్యనారాయణ ఆశ్రమంతో సహా అన్నింటికి నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నివాసంతో సహా కరకట్టపైన ఉండే కట్టడాలన్నింటికీ నోటీసులు అంటించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగానే మారింది. రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కావాలనే చంద్రబాబును టార్గెట్ చేశారని, అందువల్లే కరకట్టపై ఆయన ఉంటున్న నివాసాన్ని కూల్చేయాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే అన్ని ఇళ్లకు నోటీసులు ఇచ్చారనే టాక్ అప్పట్లో వినిపించింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతి చంద్రలకు చెందిన భవనాలకు సీఆర్‌డిఏ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో భవన యజమానులంతా హైకోర్టును ఆశ్రయించారు. భవనాల నిర్మాణం సమయంలోనే నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, ఆ తర్వాతనే నిర్మాణాలు చేపట్టామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కూల్చివేతలపై స్టే మంజూరు చేసింది. దీంతో కూల్చివేతల ప్రక్రియ అంతటితో ఆగింది. తాజాగా వరదల నేపథ్యంలో ఆపరేషన్ బుడమేరు చేపడుతామని, అందులో భాగంగా బుడమేరు అక్రమ కట్టడాల తొలగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేయడంతో, కరకట్టపైన ఉన్న కట్టడాల ప్రస్తావన వన మరో సారి తెరపైకి వచ్చింది.
Next Story