
విజయవాడను వదలని బుడమేరు భయం!
బుడమేరు పొంగి ఏడాదైంది. ఇరువైపుల రిటర్నింగ్ వాల్ నిర్మాణం మాటలకే పరిమితమైంది. ఎప్పటికి పూర్తవుతుందో తెలియాదు.
బుడమేరు పేరు చెప్పగానే విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియా వాసులు ఉలిక్కి పడుతున్నారు. సరిగా ఏడాది క్రితం సంభవించిన వరదలకు సింగ్ నగర్ ప్రాంతం అతలాకుతలం అయింది. వారం రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా వేల కుటుంబాలు నీటిలో ఉన్నాయి. కనీసం ఆహారం కూడా సకాలంలో అందుకోలేకపోయారు. అద్దె ఇళ్లలో ఉండే వారికి వచ్చిన సాయాన్ని ఓనర్లు తీసుకున్నారు. ఇంకా కొందరికి నేటికీ సాయం అందలేదు.
కాలువ అంతా ఆక్రమణే...
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నుంచి మొదలై, విజయవాడ అజిత్ సింగ్ నగర్ మీదుగా ఎనికేపాడు, గన్నవరం మార్గంలో కొల్లేరు సరస్సుకు చేరుకునే బుడమేరు కాలువ మొత్తం 92 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ నీటి మార్గం గత ఏడాది సెప్టెంబర్ 1 ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పొంగి విజయవాడను ముంచెత్తింది. ఆక్రమణలు, అసంపూర్తి మరమ్మతులు, పూడిక తీయకపోవడం వంటి కారణాలతో సంభవించిన ఈ వరద నీరు సుమారు 63,174 ఇళ్లను ముంచి, 25,486 కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. వారం రోజుల పాటు వరద నీరు ఇళ్లలోనే ఉండిపోయి, దుర్గంధం, జ్వరాలు వంటి సమస్యలు తలెత్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పడవలపై ప్రయాణించి రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. కానీ ఏడాది గడిచినా ఈ దుఃఖం మరచిపోలేదు. బుడమేరు మరమ్మతులు ఎంతవరకు జరిగాయి? ఎంత ఖర్చు అయింది? ఇంకా ఎంత పని మిగిలి ఉంది? ఈ ప్రశ్నలు ఇప్పటికీ స్థానికులను వెంటాడుతున్నాయి.
సింగ్ నగర్ రైల్వే వంతెన వద్ద ప్రవహిస్తున్న బుడమేరు కాలువ
మానవ తప్పిదంతోనే వరద ముప్పు
2024 సెప్టెంబర్ 1న బుడమేరు కాలువ వరద తాకిడికి తట్టుకోలేక కోతకు గురైంది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఆక్రమణల కారణంగా కాలువ వెడల్పు 50 మీటర్ల నుంచి 20 మీటర్లకు కుదించుకుపోయింది. ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నట్లు కాలువను 150 మీటర్ల వెడల్పు చేయకపోతే నీరు సరిగ్గా బయటకు పోదు. వరదల అనంతరం నిర్వహించిన సర్వేలో విజయవాడలోనే సుమారు 400 ఇళ్లు తొమ్మిది కిలో మీటర్ల పరిధిలో బుడమేరు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని శాంతి నగర్ వద్ద 350 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ ఇంకా 200 మీటర్ల పని మిగిలి ఉంది. కాలువలో పూడిక విపరీతంగా పేరుకుపోయి వరద నీరు కిందకు సాగకుండా అడ్డుపడుతోంది. కొల్లేరు సరస్సు ఆక్రమణలు కూడా నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఫలితంగా విజయవాడలో అరుదైన ప్రళయం సంభవించింది.
వరద నీటి ప్రవాహం కేవలం ప్రకృతి ప్రకోపం కాదు, మానవ తప్పిదాల ఫలితం. గత ప్రభుత్వాలు ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఆక్రమణలు తొలగించడం, కాలువ ఆధునీకరణలో నిర్లక్ష్యం చూపాయని విమర్శలు ఉన్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఒడ్డులు తవ్వేసి, ఆక్రమణలు పెరగడం వల్ల నిర్దోషులు బాధపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
కాలువ వద్ద ప్రొక్లయిన్ తో కాలువ మట్టి తొలగిస్తున్న అధికారులు
అసంపూర్తి పనులు
గత ఏడాది వరదల తర్వాత బుడమేరు ఆధునీకరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మునుపటి టీడీపీ ప్రభుత్వం (2014-19)లో రూ.464 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారు. కానీ వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఈ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం బుడమేరు బలోపేతం, వెడల్పు పెంచడానికి రూ.1,500 కోట్ల ఎస్టిమేషన్ వేసింది. మొత్తం కాలువ వ్యవస్థ బలోపేతానికి రూ.6,880 కోట్లు కేంద్రాన్ని అభ్యర్థించారు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
37,500 క్యూసెక్స్ నీటి విడుదలకు అనుగుణంగా బుడమేరు మరమ్మతులు
ప్రస్తుతం, వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం, డైవర్షన్ చానల్ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్స్ నుంచి 37,500 క్యూసెక్స్‌కు పెంచడం, మొత్తం వరద ప్రవాహ సామర్థ్యాన్ని 40,000 క్యూసెక్స్‌కు తీసుకురావడం వంటి ప్రణాళికలు ఉన్నాయి. ఏప్రిల్ 2025లో టెండర్లు పిలవాలని ప్రణాళిక రూపొందించారు. కాలువకు గండిపడి ఏడాది గడిచింది. గండిపడిన ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ నిర్మించారు. ప్రస్తుతం కృష్ణ లంక ప్రాంతానికి ఎలాగైతే రిటర్నింగ్ వాల్ నిర్మించారో అదే విధంగా సింగ్ నగర్ ప్రాంతమంతా బుడమేరు రెండు వైపుల వాల్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
సమాంతర కాలువ కావాలి:సీపీఎం
సీపీఎం నేత సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ బుడమేరకు మరో సమాంతర కాలువ నిర్మాణం చేపట్టి వరదల బారి నుంచి ప్రజలను రక్షించాలని కోరారు. "ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచనలు చేస్తున్నా పనులు ముందుకు సాగటం లేదు’’ అని విమర్శించారు. బాధితులు ప్యార్లర్ కాలువ, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ బలోపేతం, డైవర్షన్ చానల్ సామర్థ్యం పెంచడం వంటివి డిమాండ్ చేస్తున్నారు. కనీసం రూ.10,000 కోట్ల నిధులు ఉంటేనే కాని ఆధునీకరణ పనులు పూర్తయ్యే అవకాశం లేదు.
రైల్వే వంతెన కింద బుడమేరు కాలువ
ఆపరేషన్ బుడమేరు ఏమైంది?
ప్రస్తుత ప్రభుత్వం ఆక్రమణలు తొలగించడానికి 'ఆపరేషన్ బుడమేరు' ప్రారంభించింది. 13.25 కి.మీ. పొడవున ఆక్రమణలు గుర్తించారు. కానీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆక్రమణలు తొలగించే ముందు పునరావాసం అందించాలని సూచించారు. పూడిక తీయడం, వాల్ నిర్మాణం వంటి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కాలువ వెడల్పు పెంచడం, పూడిక తీయడం, కొల్లేరు ఆక్రమణలు తొలగించడం వంటివి జరగాల్సి ఉంది. ఇవి పూర్తి కాకపోతే మళ్లీ వరదలు తప్పవు.
శాశ్వత పరిష్కారం అవసరం
బుడమేరు సమస్య రాజకీయాలకు అతీతమైనది కాదు. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాలు ఆక్రమణలు తొలగించడంలో విఫలమయ్యాయి. సీపీఐ నేతలు హైదరాబాద్‌లో హైడ్రా లాంటి ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ, కొల్లేరు ఆక్రమణలు (ప్రాన్ ఫామ్స్ వంటివి) తొలగించడం కష్టమైన నిర్ణయం. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు ఆక్రమణకారులకు మద్దతు ఇచ్చాయి. పోలవరం ఇంటర్‌లింకింగ్, ఫ్లడ్ ప్లెయిన్స్ ఆక్రమణలు వంటివి సమస్యను తీవ్రతరం చేశాయి.
విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన తోనుగుంట్ల శివప్రసాద్ మాట్లాడుతూ గత సంవత్సరం వరదలు గుర్తుకు వస్తే వళ్లు జలదరిస్తోందన్నారు. ప్రభుత్వం రూ. 25 వేలు సాయం అందించినా ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆ డబ్బులు సరిపోలేదన్నారు. కొంతైనా సాయం అందించినందుకు సీఎం చంద్రబాబుకు నమస్కారాలు చెప్పారు.
అజిత్ సింగ్ నగర్ కు చెందిన బి ఉష మాట్లాడుతూ బుడమేరు కాలువ మా ఇండ్లకు సమీపంలో ఉన్నందున గత వరదల్లో ఇల్లు పూర్తిగా మునిగిందని తెలిపారు. నేను టైలరింగ్ చేస్తున్నానని చెబుతూ మిషన్ పై బట్టలు స్టిచ్చింగ్ చేస్తూనే మాట్లాడారు. ఇళ్లు మునిగిపోయినందుకు రూ. 25 వేలు ప్రభుత్వం ఇచ్చింది. టైలరింగ్ షాపు పూర్తిగా మునిగినా పైసా ఇవ్వలేదన్నారు. కొన్ని మిషన్ లు పనికి రాకుండా పోగా కొన్ని బాగున్నాయని, షాపులో ఉన్న బట్టలు, ఇతర టైలరింగ్ సామాన్లు పనికి రాకుండా పోయినట్లు చెప్పారు. మునిసిపాలిటీ వారు మీకేమి భయం లేదు. వరద నీరు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే చెబుతామంటున్నారని చెప్పారు.
సింగ్ నగర్ కు చెందిన తోటకూర మంగ మాట్లాడుతూ మా ఇల్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మాకు ప్రభుత్వం పైసా డబ్బులు ఇవ్వలేదు. మాతో పాటు ఇంకా కొంత మందికి ఇవ్వలేదు. కొందరికి ఇచ్చి కొందరికి ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదని అన్నారు. కృష్ణా పొంగుతుందంటే భయమేస్తోందన్నారు. ఏడాది క్రితం వచ్చిన వరదలను తలుచుకుంటూ... ఆ పరిస్థితి జీవితంలో ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.