బుడమేరు వరద గోడు వందేళ్ల నాటిది...
x

బుడమేరు వరద గోడు వందేళ్ల నాటిది...

వందేళ్లలో సమస్య ముదిరిందే పరిష్కారం కాలేదు. ఎందుకు?



ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లకుండా, బస్సులో, కలెక్టర్ కార్యాలయంలో ఉంటూ విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 75 సంవత్సరాలపుడు ప్రజలకోసం ఆయన కష్టపడుతున్న తీరుకు ప్రశంసలొస్తున్నాయి. ఈ సందర్భంగా మొన్న ఎన్టీఆర్ జిలా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటమాని, బుడమెరు పొడవునా వెలసిన అక్రమకట్టడాలను తొలగిస్తామని అన్నారు. ఇది సాధ్యమా. విజయవాడ పరిసరాలలో ఉన్న అక్రమకట్టడాలను తొలగిస్తే బుడమేరు వరద సమస్య పరిష్కారమవుతుందా అనేది అనుమానమే. ఆక్రమణలను తొలగించడం సాధ్యమా?

ఆగస్టు 30-31 అర్ధరాత్రి ప్రాంతంలో బుడుమేరు జన్మస్థలం ఖమ్మం జిల్లాకొండలలో 300 మి.మీ పైగా వర్షం కురియడంతో ఆ నీరంతా వచ్చి ఏటిలో వరదలు సృష్టించింది. బుడమేరు వరదలను కంట్రోలు చేసేందుకు ఏర్పాటుచేసిన వెలిగేరు రెగ్యులేటర్, బుడమేరు డైవర్షన్ కాలువలు ఏవీ పనిచేయలేదు. వూహించనంత వరదరావడం, బుడుమేరు ప్రవాహమార్గం కట్టడాలతో బూడిపోయి ఉండటంతో వరద నీరు విజయవాడలో నదికి అడ్డంగా వెలసి కాలనీలన్నింటిని ముంచెత్తింది. దాదాపు 30 శాతం నగరం మునిగిపోయింది.ముఖ్యమంత్రి లెక్కల ప్రకారమే అరులక్షల మంది వరదల బారిన పడ్డారు. ఇపుడు వరదనీరు తగ్గు ముఖం పట్టినా, దాని ప్రభావం చాలా కాలం ప్రజలను ఆర్థికంగా, మానసికంగ పీడించనుంది.

బుడమేరు ఖమ్మం జిల్లాలో పుట్టి ఎన్టీ ఆర్ జిల్లా గుండ ప్రవహించి,ఏలూరు జిల్లాల్లో ఉన్న కోల్లేరు సరస్సులో కలుస్తుంది. కొల్లేరు నుంచి ఆ నీటిని ఉప్పుటేరు అనే మరొక చిన్న వంక బంగాళాఖాతంలోకి తీసుకువెళ్లుంది.

విజయవాడలో ఉన్న అక్రమకట్టడాలను తొలగించినంత మాత్రాన బుడమేరు వరదలు ఆగిపోవడం కష్టం అంటున్నారు ఆర్థిక వేత్త, ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్ లర్ ఫ్రొఫెసర్ కె.ఎస్ చలం. ఎందుకంటే, బుడమేరు ను కిందా పైన గొంతపిసికేశారు. విజయవాడలోబుడమేరు వెంబడి వెలసిన అక్రమకట్టడాలొక్కటే వరదలకు సమస్యకాదు. ఈ కట్టడాలన్నీ తొలిగిస్తారు. అపుడు బుడమేరు వరదనీరు సాఫీగావెళ్లిపోతుందనుకుందాం. ఎక్కడికి పోతుంది. కొల్లేరుకు పోతుంది. కొల్లేరు సరస్సులో ఇంత నీరు పట్టే పరిస్థితి ఎక్కడ ఉంది? ఆసియాలోనే పెద్ద మంచినీళ్ల సరస్సు అని పేరున్న కొల్లేరు సరస్సును వందలాది చదరపు కిమీ కుదించి కుదించివేశారు. 1980 దశకంలో సుమారు 908 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నకొల్లేరు ఇపుడు 300 చ.కి.మీకు కుదించుకుపోయింది. అంతేనా, అక్కడి నుంచి నీళ్లను సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు మీదంతా అక్రమణలే జరిగాయి. దాని గొంతు నులిమేశారు. విజయవాడలో ఉన్న వేలాది కట్టడాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూల్చేసి,నీళ్ల ప్రవాహానికి అడ్డంకులు తొలగించినా, ఆ నీళ్లను ఇముడ్చుకునే శక్తి కొల్లేరుకు లేదు. అసలు బుడమేరు ముంపుకు విజయవాడలో లో కాదు, కొల్లేరులో ఉంది. విజయవాడ పట్టణ సమస్యలకు కొల్లేరు గ్రామీణ ప్రాంతాల్లో పరిష్కారం వెదకాలని ప్రొ. చలం అన్నారు.కొల్లేరు చుట్టూర వేలాది చేపల చెరువులను అనుమతించారు, ఈ వ్యాపారస్థులంతా చేపలు రొయ్యలు పెంచి దేశవిదేశాలకు ఎగుమతి చేసి వేలకోట్లు సంపాదించారు. వాళ్లేవరు వరదల్లో మునగలేదు. మునిగిందంతా రాజకీయ నాయకులు మాటలు విని ఇల్లు కట్టుకున్న పేద, మధ్య తరగతి ప్రజలే. రొయ్యల, చేపల చెరువుల వ్యాపారస్థులు ఎవరు? వాళ్లెక్కడి నుంచి వచ్చారు. వాళ్లని తొలగించి బుడమేరును నీటి ఇముడ్చుకునేంత స్థాయికి కొల్లేరును విశాలం చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు.

బుడమేరు వరద సమస్య వందేళ నుంచి రికార్డవుతూ వస్తుంది. 1917లో వరదలొచ్చినపుడు పెద్ద చర్చజరిగింది. గుడివాడతోసహా అనేక ప్రాంతాల్లో వరదల్లోపంటలునష్టపోయాయి. బ్రిటిష్ ప్రభుత్వం పెద్దగా సాయం చేయలేదు. ఈ ప్రాంతంలోని ధనవంతులు విరాళాలిస్తే వరద సహాయక చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి బుడమేరుకు వరద నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్, రాజకీయ రూపం తీసుకుంది. ఆప్రాంతంలో ఉన్నసోషలిస్టు నాయకులు, కాంగ్రెస్ నాయకులు బుడమేరు మీద ఒక రిజర్యాయర్ కట్టాలని, వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించేందుక చానెల్ తవ్వాలని కోరారు. అపుడు నీటి పారుదల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆయన రాయలసీమ వాడు అయినందున బుడమేరు వరద నివారణకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శ కూడా వచ్చింది. అసెంబ్లీలో జరిగిన ఒక చర్చలో ఆయన స్వయాన ఈ ఆరోపణను ఖండించారు. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమయిన నిధులను కేంద్రం అందించలేకపోవడంతో బుడమేరు డైవర్షన్ కెనాల్ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు 1964లో మరొక సారి పెద్ద వరద వచ్చింది. అపుడు ఉత్తర ప్రదేశ్ ఇంజనీర్-ఇన్- చీఫ్ గా ఉన్న ఎ సి మిత్రా నాయకత్వంలో ఒక కమిటీని కేంద్ర నీటి పారుదల శాఖ నియమించింది. ఈ కమిటీ కూడా చాలా రికమెండేషన్స్ చేసింది. ఈ ప్రాంతంలో పారే డ్రెయిన్స్ (బుడమేరు వంటి వాగులు దాదాపు అయిదారు ఉన్నాయి)లోతు వెడల్పులు పెంచాలని సూచించింది. దీనికయ్యేఖర్చును డ్రెయినేజీ సెస్సు విధించి సేకరించి బుడమేరు లోతు పెంచి వాగు ను విశాలం చేసే పనిచేపట్టాలనిసూచించింది. బుడమేరు డైవర్షన్ కెనాల్ నిర్మాణం కూడా ఇందులో భాగమే.

మిత్రా కమిటీ సిఫార్సులు ఇప్పటికీ అమలుకాలేదు. 1964-2024 మధ్య బుడమేరు వరద ముప్ప విషమించించిందే గాని మెరుగపడలేదు. సెప్టెంబర్ 1న వచ్చిన వరద ఒక రికార్డు. ఈ అరవై సంవత్సరాల కాలంలో బుడమేరు ప్రాంతమంతా దురాక్రమణలకుగురైంది. వాగు వెంబడి పెద్ద ఊరు తయారయింది. ఎంతగా తయారయిందో, ఎలా తయారయిందో 2011లో విజయవాడ మునిసిపల్ కమిషనర్ గా ఉన్న ఐఎఎస్ అధికారి రవివాబు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఆయన ఆ ఏడాది విజయవాడ వరద నివారణకు ఒక నివేదిక (City Disaster Management Plan, Vijayawada 2011) ను తయారు చేశారు. దీని ప్రకారం విజయవాడలో బుడమేరు వెంబడి 21 కిమీ పొడవున కాలనీలు వచ్చాయి. దీనికి రాజకీయ పార్టీలే కారణమని నిర్ద్వంద్వంగా చెప్పారు. ఓట్లకు కక్కుర్తి పడి అన్ని రాజకీయపార్టీలు కృష్ణా, బుడమేరు వెంబడి ఇల్లు కట్టుకునేందుకు పేదలను ప్రోత్సహించాయి. తాము అధికారంలోకి వస్తే, మీ ఇళ్లకు పట్టాలిస్తామని హమీ ఇచ్చారు. దీని వల్ల చివరకు బుడమేరు కట్టలు కూడా బలహీనపడ్డాయి, ఈ కట్టలకు వరదల దెబ్బ తట్టుకునే పరిస్థతి లేదని రవిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. “ This situation is further complicated by the false hope provided by the politicians in their campaigns during elections that they would support these illegal settlements. In order to gain vote, some of them even promise to protect these people by assuring that once they are elected they would legalize their settlements…” రాజకీయ పార్టీలు ఇచ్చిన ఈ హామీలతో వాళ్లంతా నదుల ఒడ్డున, వానలు, వరదలు లేని సమయంలో వరద ప్రమాదమున్న ప్రాంతా (flood vulnerable) లలో కూడా ఇళ్లు నిర్మించుకున్నారు. “The history provides people with false hope and at the same time encourages them in moving towards more risk prone areas. With little or no control over the encroachment on the flood banks, the quality and the structural integrity of the embankment to withstand the pressure from the flood waters is a matter of significant concern.

1970లో అప్పటి అధికారంలోకి వచ్చిన పార్టీ హామీల ప్రకారం కృష్ణా కరకట్టలను మార్చింది. ప్రజలందరిని కరకట్టలపరిధిలోకి తెచ్చింది. 2011 నుంచి ఇప్పటిదాకా ఈ సమస్య పెరగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. నదీతీరం వెంబడి వస్తున్న ఆక్రమణలను 2011 నుంచి వచ్చిన ప్రభుత్వాలేవీ అడ్డుకోలేదు. నిజానికి 2014 నుంచి 2024 దాకా కొత్తగా వచ్చిన దురాక్రమణలు, నిర్మాణాలు ఏమిటో అందరికి తెలుసు. మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్రంలో సెక్రటెరీ గా పనిచేసిన డాక్టర ఇఎస్ ఎస్ శర్మ కూడా ఇదే విషయం చెప్పారు. విచ్చలవిడిగా బుడమేరు ఒడ్డునంతా నిర్మాణాలు జరగడమే ఈ వరదలకు ప్రధాన కారణమని ఇఎఎస్ శర్మ చెప్పారు.

మిత్రా కమిటీ సిఫార్సుల ప్రకారమే బుడమేరు మీద ఒక రెగ్యులేటర్ వెలగలేరు వద్ద ఏర్పాటు చేశారు. ఒక డైవర్షన్ కెనాల్ ను తవ్వడం మొదలుపెట్టారు. ఈ రెగ్యులేటర్ సరిగ్గా మెయింటెనెన్స్ కు నోచుకోలేదని, నీటిని ఎపుడు కిందికి వదలాలి,నీటిని ఏమేరకు నిల్వచేయాలనేదాని పైభాగాన, కింది భాగాన ఉన్నరైతులకు విబేధాలు ఉండంటం రెగ్యులేటర్ మెయింటెయిన్ చేయడం మానేశారని పత్రికల్లో వార్తలొచ్చాయి.

ఇక బుడమేరు డెవర్షన్ కాలువను విజయవాడ థర్మల్ స్టేషన్ (విటిపిఎస్ ) నుంచి తీసుకెళ్లాలి. దీనికి విటిపిఎస్ నుంచి వ్యతిరేక రావడంతో ఆ పని ఆగిపోయిందని, మాజీ నీటిపారుదల శాఖ ఇంజనీరు కంభంపాటి పాపారావు చెప్పారు. పైభాగన విజయవాడలో బుడమేరకు ఇన్ని కష్టాలు వచ్చాయి. రాజకీయాలు, పార్టీలు, బుడమేరు గొంతు నొక్కేయడంతో బుడమేరు తనదారి తాను చూసుకుందని ప్రొఫెసర్ చలం చెప్పారు.

పై భాగాన పరిస్థితి ఇలా ఉంటే, ఇవే రాజకీయాలు, రాజకీయ పార్టీలు దిగువభాగాన కొల్లేరు లేక్ కొంప ముంచాయి. కొల్లేరుకు అయిదు వాగులు నీళ్లు తీసుకొస్తాయి. అందులో బుడమేరు ఒకటి. ఉదృతమయినది కూడా .మిగతా వాగుల కంటే ఎక్కువ వరద తెచ్చేది బుడమేరుయే. అందుకే బుడమేరును కంట్రోలో చేయాలన్నది వందేళ్ల డిమాండ్. బుడమేరు నీళ్లు ఉధృతంగావచ్చిచేరినపుడు కొల్లేరు ప్రాంతంలో చాలా గ్రామాలు మునిగిపోయేవి. అయితే, బుడమేరు దురాక్రమణకు గురికావడంతో కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది, ఇది చేపల రొయ్యలచెరువుల దురాక్రమణకు దారి తీసింది. రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, ఉపాధి కల్పన జరుగుతుందనే పేరుతో కొల్లేరు సైజు కుదించి విపరీతంగా చేపలచెరువులకు అనుమతులిచ్చారు. ఈ చేపల చెరువుల యజమానులంతా బాగా పెద్ద వాళ్లు కాబట్టి ప్రభుత్వాలన్నీ వాళ్లకి అనుకూలంగానే లేక్ ను కాంటూర్స్ తగ్గించి నాశనం చేసేందుకు నిర్ణయించుకున్నాయని ఉత్తరాఖండ్ లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త సుకుమార్ వ్యాఖ్యానించారు.

కొల్లేరు మామూలూ సరస్సుకాదు. అదొక అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పక్షుల అభయారణ్యం. దీనిని కాపాడాల్సిన అవసరాన్ని రామ్ సర్ (Iran, 1971 Ramsar Wetland Convention) లో సమావేశమయిన అంతర్జాతీయం సమాజం గుర్తించింది. అందుకే దీనిని రామ్ సర్ లేక్ అంటారు. ఈ లేక్ పతనావస్థను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ ఆర్ సుకుమార్ ని పంపింది. 2015లో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి అధ్యయనం చేసి ఒక నవేదిక ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వాల అనుమానాస్పద విధానాల వల్ల కొల్లేరు సరస్సు నాశనమయిందని, దాని పరిరక్షణ చాలా కష్టం అని అన్నారు. (The)lake conservation issue is extremely complex with a long history of questionable administrative and management decisions taken by successive state governments in erstwhile Andhra Pradesh.) వైల్డ్ లైప్ ఇన్ స్టిట్యూట్ వర్కింగ్ గ్రూప్ ముందు తన అధ్యయనం మీద వాంగ్మూలం ఇస్తూ విశృంఖలంగా అక్రమ ఆక్వాఫామ్స్ వచ్చాయని, చేపలచెరువుల వ్యాపారస్థులు రకరకాలుగా ఇక్కడి వ్యవసాయ భూములను, డి పట్టాలను ఆక్రమించు పరిస్థితిని విషమింపచేశాయని చెప్పారు. (“It has been noticed that uncontrolled illegal aquafarms have come up and socio-economic impact on livelihood of local farmers due to influx of entrepreneurs for both ziroyati and D-patta lands has complicated the situation.)

కొల్లేరు సరస్సు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. దీనితోకొల్లేరు నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే 60 కి.మీ పొడవైన ఉప్పుటేరు దాదాపు చచ్చి పోయింది. ఇది మొత్తం దురాక్రమణకు గురైంది. ఇవన్నీ కూడ అన్ని ప్రభుత్వాలు (కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్) చూస్తున్నపుడే జరిగాయి.అన్ని రాజకీయ పార్టీల కళ్లెదుటే జరిగింది. జరుగుతున్నదంతా అందరికి తెలుసు. ఉప్పుటేరు దురాక్రమణలు లేపేయాలి. అపుడు కొల్లేరు నీరు సముద్రంలోకి సాఫీ గా వెళ్లుతుంది. ఈ మార్గం లేకపోవడంతో బుడమేరు వరదలొచ్చినపుడ్లా ఆ నీరంతా కొల్లేరులోకి వచ్చి ఇక్కడి గ్రామాలను ముంచుతుందని ప్రజల ఆందోళన చెందడం చూస్తున్నదే. బుడమేరు వరద అన్నపుడు విజయవాడ కాలనీలతో పాటు కొల్లేరు పరిసర గ్రామాలకు నిద్ర కరువు. బుడమేరు బాగుండాలి. కొల్లేరు విశాలం కావాలి. అక్కడి నుంచి సముద్రం వైపు వెళ్లే ఉప్పుటేరు సాఫీగా ఉండాలి. దీనికి కొల్లేరు ను ఆక్రమించిన వేలాది ఎకరాల అక్వాఫామ్స్ ని ఎత్తేయాలి. ఆదే సమయంలో వేలకు వేల అక్రమ కట్టడాలను విజయవాడలోకూల్చేయాలి. ఉప్పుటేరు లో ఉన్న ఆక్రమణలను కూల్చేసి సాఫీగా నీరు పోయే చానెల్ గా మార్చాలి. అపుడే బుడమేరు వరదనీరు సాఫీగా కొల్లేరు వెళ్లుతుంది. అక్కడి నుంచి ఆ నీరు ఉప్పుటేరు నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది సాధ్యమా?

వీటిని తొలగించి విజవాడ వరదలను ఆపుతానని ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.


Read More
Next Story