
1 బిలియన్ సబ్‌స్క్రైబర్లతో శక్తివంతమైన సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్
ఏపీలో బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
1 బిలియన్ సబ్‌స్క్రైబర్లతో బీఎస్‌ఎన్‌ఎల్ శక్తివంతమైన సంస్థగా నిలిచిందని, 26,707 మారుమూల గ్రామాలను 4జీతో అనుసంధానించడం దేశ ప్రగతికి కీలకమైన ముందడుగని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర రాష్ట్ర హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సమాచార రాష్ట్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని శివనాథ్, అలాగే టెలికాం శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెలికాం రంగంలో స్వదేశీ సాంకేతికత, భారత ప్రగతి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
దేశానికి గతంలో దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వదేశీ 4జీ నెట్వర్క్ వంటి విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయని అన్నారు.
1995 నుంచి సాంకేతికత, సమాచార రంగంలో దేశం ముందుకు సాగాలన్న తన ఆలోచనను గుర్తు చేస్తూ, గతంలో ఇచ్చిన నివేదికలు, డీ–రెగ్యులేషన్ నిర్ణయాలతో టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు.
భారత్‌లో తయారైన 4జీ స్టాక్‌తో భారత్ ప్రపంచంలోని అతి తక్కువ దేశాల సరసన నిలిచిందని, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉత్పత్తి చేసిన సెల్‌ఫోన్‌లు, కోవిడ్ వ్యాక్సీన్, యూపీఐ వంటివి ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉన్నాయని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 735 పౌర సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నామని, 14.30 లక్షల డ్వాక్రా మహిళలు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తూ ఆర్థిక, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకుంటున్నారని తెలిపారు.
2030 నాటికి 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, 2026 జనవరి నాటికి క్వాంటం వ్యాలీని ప్రారంభిస్తామని, ఏఐ, క్వాంటం టెక్నాలజీలు రియాలిటీగా మారాయని పేర్కొన్నారు.
90% విదేశీ యాప్‌లకు చెల్లింపులు చేస్తున్న పరిస్థితిని మార్చాలని, పేటెంట్‌లలో భారతీయులు అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
ఈ చారిత్రాత్మక సందర్భంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు అదనపు నిధులు కేటాయించి, దానిని శక్తివంతంగా తీర్చిదిద్దిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 4జీ స్టాక్‌ను స్వదేశీ సాంకేతికతతో తయారు చేయడం దేశ ప్రగతిలో మరో మైలురాయిగా అభివర్ణించారు.
కేంద్ర సమాచార రాష్ట్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 33 కోట్ల స్మార్ట్‌ఫోన్లు తయారవుతున్నాయని, టెలిఫోన్ మాన్యుఫాక్చరింగ్ చేసే నాలుగు దేశాలలో భారతదేశం ఒకటని గర్వంగా చెప్పారు. స్కూళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని, విద్యుత్తు, మంచినీరు ఎంత అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తామని, బీఎస్‌ఎన్‌ఎల్‌ను మళ్లీ లాభాల బాటలో నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Next Story