బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందట ?
x

బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందట ?

తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలువుతున్నాయో తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధుల బృందం రెండురోజులు మధుసూధనాచారి నాయకత్వంలో చెన్నైలో పర్యటించింది.


విద్య, ఉద్యోగా రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందట. ఈ విషయాన్ని శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ నేత మధుసూధనాచారి తెలిపారు. అదికూడా ఎక్కడంటే తమిళనాడులోని చెన్నైలో. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలువుతున్నాయో తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధుల బృందం రెండురోజులు మధుసూధనాచారి నాయకత్వంలో చెన్నైలో పర్యటించింది. తమిళనాడులో బీసీల రిజర్వేషన్ అమలవుతున్న విధానాన్ని ఉన్నతాధికారులతో సమావేశమైనపుడు బీఆర్ఎస్ బృందం తెలుసుకున్నది.

తమ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలవుతున్న విధానాన్ని బీఆర్ఎస్ బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. శాస్త్రీయంగా ఇంటింటి సర్వే నిర్వహించి బీసీల జనాభా ఎంతో తెలుసుకుని జనాభా నిష్పత్తిప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు చెప్పిన వివరాలకు బీఆర్ఎస్ బృందం సానుకూలంగా స్పందించింది. తర్వాత మధుసూధనాచారి మీడియాతో మాట్లాడుతు తెలంగాణాలో కూడా బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లు అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ల అమలుకు తాము తెలంగాణాలో పోరాటాలు చేస్తామని చెప్పారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు బీసీలకు రిజర్వేషన్ సౌకర్యంగురించి బీఆర్ఎస్ పట్టించుకోలేదు. పైగా స్ధానిక సంస్ధల్లో బీసీల రిజర్వేషన్ 30 శాతం నుండి 24 శాతానికి తగ్గించిందే కేసీఆర్. రాజకీయరంగంలో రిజర్వేషన్ల అంశాన్ని పక్కనపెట్టేసినా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ను అమలుచేయవద్దని ఎవరైనా కేసీఆర్ ను అడ్డుకున్నారా ? అధికారంలో ఉన్నపుడు అమలుచేయాల్సిన రిజర్వేషన్ను అమలుచేయకుండా ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్ అమలుకోసం పోరాటాలు చేస్తామని మధుసూధనాచారి చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇక్కడే బీఆర్ఎస్ వైఖరిపైన జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారుపార్టీ నేతలు మొదటినుండి ఇదే పద్దతిలో వ్యవహరిస్తున్నారు.

అధికారంలో ఉన్నపుడు మొదటి టర్మ్ లో మంత్రివర్గంలో కేసీఆర్ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే మహిళలకు అసెంబ్లీ టికెట్లు, పార్లమెంటుకు పోటీచేయించటంలో ఇవ్వాల్సినంత సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదు. అధికారంలో ఉన్న పదేళ్ళల్లో అసెంబ్లీ జ్యోతీ బా పూలే విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు. అయితే అధికారంపోయి ప్రతిపక్షంలోకి రాగానే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, అసెంబ్లీ కాంపౌండులో జ్యోతి బా పూలే విగ్రహం ఏర్పాటుపై కేసీఆర్ కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత నానా గోలచేశారు.



చట్టంతో సంబంధంలేకుండా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అంటు ఢిల్లీ స్ధాయిలో చాలా హడావుడి చేశారు. రాజకీయపార్టీల్లోని మహిళా ఎంపీలందరినీ ఆహ్వానించి ఆందోళన కూడా చేశారు. చట్టంతో సంబంధంలేకుండా అన్నపుడు తెలంగాణా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మహిళలకు టికెట్లు ఇవ్వమని తన తండ్రి కేసీఆర్ ను కవిత ఎందుకు అడగలేదు ? టికెట్ల కోసం ఎందుకు ఆందోళనలు చేయలేదు ? అధికారంలో ఉన్న పదేళ్ళు కవిత అసలు మహిళా రిజర్వేషన్ ఊసే ఎత్తలేదు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీ బా పూలే విగ్రహాన్ని పెట్టాలంటే ఎవరైనా కవితను అడ్డుకున్నారా ? పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టే విషయాన్ని కవిత ఎందుకు ఆలోచించలేదు ? అధికారం పోయిన వెంటనే జ్యోతి బా పూలే విగ్రహం ఎందుకు గుర్తుకొచ్చింది కవితకు ?



బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు కూడా ఇదే పద్దతి. తాము అధికారంలో ఉన్నపుడు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని ఎందుకు ఆలోచించలేదు ? తాము రిజర్వేషన్లు అమలుచేస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా ? తాను చేయాలని అనుకున్నవాటిని కేసీఆర్ ఎలా అమలుచేశారో అందరు చూసిందే కదా. మరపుడు బీసీల రిజర్వేషన్ అంశాన్ని మాత్రం ఎందుకు వదిలేసినట్లు ? అధికారంలో ఉన్నపుడు చేయగలిగిన రిజర్వేషన్ అమలును ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పోరాటాల ద్వారా సాధిస్తామని చెప్పటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి బీసీల రిజర్వేషన్ల కోసం కారుపార్టీ నేతలు ఏమి పోరాటాలు చేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story