బీఆర్ఎస్ నిజంగా సిగ్గుపడాలి
x

బీఆర్ఎస్ నిజంగా సిగ్గుపడాలి

పార్టీ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నా మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు.


నల్గొండ పార్టీ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ నేతలు స్పందించిన తీరు చాలా విచిత్రంగా ఉంది. కారుపార్టీ నేతలు చెప్పిన మాటలు విన్నతర్వాత పార్టీ నేతలు నిజంగా సిగ్గుపడాల్సిందే. నల్గొండ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్ళలేదన్నారు. ఏ పార్టీ ఆఫీసుకు అనుమతులు లేవని చెప్పారు. నల్గొండ పార్టీ ఆపీసుకు స్ధలాన్ని నిబంధనల ప్రకారమే లీజుకు తీసుకుని నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. 5800 గజాల పార్టీ ఆఫీసు నిర్మించుకునేందుకు అనుమతులు కావాలని మున్సిపల్ ఆపీసుకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.

ఇక్కడే పార్టీ నేతలు సిగ్గుపడాలని చెప్పేది. ఎందుకంటే పార్టీ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నా మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. పైగా అప్పటి కమీషనర్ ఆఫీసు నిర్మించుకోమని చెబితేనే తాను ఆఫీసును నిర్మించినట్లు కంచర్ల చెప్పటమే విచిత్రంగా ఉంది. కమీషనర్ నోటి మాటగా చెప్పటం ఏమిటో పార్టీ నేతలు నిర్మాణం చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. 2019లో ఆఫీసు నిర్మాణం మొదలై 2020లో పూర్తి చేసినట్లు కంచర్ల చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసు నిర్మాణానికి అధికార పార్టీ నేతలు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వలేదట. అధికారపార్టీ ఆఫీసు నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే కుదరదుపొమ్మని చెప్పే అధికారులున్నారా ? అన్న సందేహం పెరిగిపోతోంది. ఒకవేళ అధికారులు అనుమతి నిరాకరించారంటే అందుకు ఏవో కారణాలు ఉంటాయి కదా. పైగా కోట్ల రూపాయలు పెట్టి నిర్మించే భవనానికి రాతమూలకంగా అనుమతి నిరాకరించి నోటిమాటగా ఆఫీసు కట్టుకోమని చెప్పారట...ఎవరైనా నమ్ముతారా ? ఇపుడు భవనాన్ని కూల్చేస్తే ఏమొస్తుంది ? ఆఫీసు భవనాన్ని ప్రజావసరాల కోసమో లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసమో ఉపయోగిస్తామంటే అప్పగించటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఒకవైపు ప్రభుత్వానికి పార్టీ ఆఫీసు భవనాన్ని అప్పగించటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతునే మరోవైపు కోర్టు తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకే కాదు ఏ పార్టీ ఆఫీసులకు కూడా అనుమతులు లేవని కంచర్ల చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉండీ పార్టీ ఆఫీసు భవనం నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోలేకపోయిలేనందుకు సిగ్గుపడాల్సిన నేతలు ఎదురుదాడి చేయటమే విచిత్రంగా ఉంది. ఏ పార్టీ ఆఫీసుకు కూడా అనుమతులు లేవని చెప్పటం దేనికి నిదర్శనం. మిగిలిన పార్టీ ఆఫీసుల నిర్మాణాల గురించి బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ? నిజంగానే మిగిలిన పార్టీల ఆపీసుల భవనాలకు కూడా అనుమతులు లేకపోవటం నిజమే అయితే ఆ విషయాన్ని కోర్టులో కేసు వేసి ఆధారాలు చూపించాలి. అప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది కీలకమవుతుంది. అంతేకాని అనుమతులు లేకుండా కట్టిన భవనాన్ని కూల్చేయాలని కోర్టు చెప్పిన తర్వాత శాపనార్ధాలు పెడితే ఏమొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవనం కూల్చేయటం మహాపాపమని చెప్పటమే కొసమెరుపు.

Read More
Next Story