హైదరాబాద్ యు.టి డేంజర్ జోన్ లో ఉందా?
x

హైదరాబాద్ యు.టి డేంజర్ జోన్ లో ఉందా?

ఇంతకాలానికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే అంశంపై మళ్ళీ చర్చ మొదలైంది. దీనికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ అనే చెప్పాలి.


తొందరలోనే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవబోతోందా ? చాలాకాలంగా ఆ విషయం ప్రచారంలో ఉంది. నిజానికి రాష్ట్ర విభజన జరిగిన 2014లోనే హైదరాబాద్ ను యూపీఏ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ ప్రచారం ఉత్త ప్రచారంగా మాత్రమే ఉండిపోయింది. మధ్య మధ్యలో ప్రచారమైతే జరుగుతునే ఉంది. కారణం ఏమిటంటే దేశానికి హైదరాబాద్ ను ఎన్డీయే ప్రభుత్వం రెండో రాజధానిగా మార్చబోతోంది కాబట్టి కేంద్రపాలితప్రాంతంగా మర్చే విషయాన్ని పరిశీలిస్తోందని ప్రచారంలో ఉంది. అయితే ఇంతకాలానికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే అంశంపై మళ్ళీ చర్చ మొదలైంది. దీనికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ అనే చెప్పాలి.

సిరిసిల్లలోని పార్టీనేతల సమావేశంలో కేటీయార్ మాట్లాడుతు పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే కేంద్రప్రభుత్వం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేస్తుందన్నారు. ఈ విషయాన్ని నరేంద్రమోడి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే తెలంగాణాలో బీఆర్ఎస్ అత్యధిక పార్లమెంటు సీట్లలో గెలవాల్సుంటుందన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలితప్రాంతం కాకుండా అడ్డుకునే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెప్పారు. అలాగే 2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిందే అని కేటీయార్ గట్టిగా చెప్పారు. పార్టీ తరపున కనీసం 12 మంది ఎంపీలు గెలిస్తే తెలంగాణాకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవచ్చన్నారు.

కేటీయార్ తాజా ఆరోపణలతో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవబోతోందా అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. నిజంగానే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వం పరిశీలించకపోతే కేటీయార్ ఆరోపణలు ఎందుకు చేస్తారనే చర్చ కూడా జనాల్లో నడుస్తోంది. ఇదే సమయంలో జనాల్లో తెలంగాణా సెంటిమెంటును రెచ్చగొట్టి ఎక్కువ సీట్లలో గెలుచుకునేందుకే కేటీయార్ కేంద్రపాలితప్రాంతమనే ఆరోపణలను చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణా సెంటిమెంటుతో జనాలను రెచ్చగొట్టటం సాధ్యంకాదని కేసీయార్ తో పాటు పార్టీ నేతలకు అర్ధమైపోయింది. సెంటిమెంటు వర్కవుట్ కాలేదని తేలటంతోనే పార్లమెంటు ఎన్నికలకు ముందు హైదరాబాద్ కేంద్రపాలితప్రాంతం అనే సెంటిమెంటును కేటీయార్ ప్రయోగించారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

నిజంగానే ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అనుకుంటే కారుపార్టీ తరపున 12 మంది ఎంపీలు గెలిచినా అడ్డుకోలేరు. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి ఫుల్లు మెజారిటి ఉన్నపుడు బీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ఏపీలో గెలిచే ఎంపీలు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నానికి మద్దతుగా నిలిచే అవకాశం లేకపోలేదు. ఇక 12 మంది ఎంపీలు గెలిస్తే కేసీయార్ పాలన ఏడాదిలో వచ్చేస్తుందని చెప్పటమే విచిత్రంగా ఉంది. జనాలు కేసీయార్ పరిపాలనను వద్దనుకునే కదా కాంగ్రెస్ కు అధికారం అప్పగించింది. అలాంటిది 12 మంది ఎంపీలను గెలిపిస్తే ఏడాదిలో మళ్ళీ కేసీయార్ పాలన వస్తుందని కేటీయార్ చెప్పటంలో అర్ధమేలేదు. పైగా కేటీయార్ చెప్పిన మాటలు రివర్సు కొట్టే అవకాశం కూడా ఉంది. 12 మంది ఎంపీలను గెలిపిస్తే నిజంగానే కేసీయార్ మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అనే భయంతో జనాలు కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేస్తే బీఆర్ఎస్ కు మొదటికే మోసం వస్తుంది.

పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంచేస్తున్న కేసీయార్ తన శక్తివంచన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే ఆరోపణలను కేసీయార్, కేటీయార్, హరీష్ రావు పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అయ్యింది కాబట్టి జనాలు వీళ్ళ ఆరోపణలకు పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. తమ ఆరోపణలను జనాలు పట్టించుకోక, తెలంగాణా సెంటిమెంటు వీగిపోతే ఇక బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటనే టెన్షన్ మొదలైనట్లుంది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవనే టెన్షన్ కేసీయార్లో పెరిగిపోతోంది. అందుకనే సడెన్ గా కేటీయార్ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమనే ఆరోపణలు మొదలుపెట్టారు. మరి తాజా ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story