బీఆర్ఎస్ అస్త్రాలు రెడీ చేసుకుంటున్నదా ?
x

బీఆర్ఎస్ అస్త్రాలు రెడీ చేసుకుంటున్నదా ?

ఆదివారం లేదా సోమవారం కారుపార్టీ ఎంఎల్ఏలతో అధినేత కేసీయార్ సమావేశమవ్వాలని డిసైడ్ అయ్యారు.


మరో మూడురోజుల్లో మొదలవ్వబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రాలను రెడీచేసుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జరిగిన వ్యవహారాలను, వైఫల్యాలను ఎండగట్టడమే టార్గెట్ గా అంశాలను ప్రస్తావించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం లేదా సోమవారం కారుపార్టీ ఎంఎల్ఏలతో అధినేత కేసీయార్ సమావేశమవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన వందలాది హామీలు, ప్రత్యేకించి సిక్స్ గ్యారెంటీస్ ను అసెంబ్లీ ప్రస్తావించటం ద్వారా అధికారపార్టీని ఇరుకునపెట్టాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం.

సిక్స్ గ్యారెంటీస్ లో ముఖ్యంగా రైతు రుణమాపీని లక్ష రూపాయల రుణాలు తీసుకున్న అందరికీ వర్తింపచేయటంలో ప్రభుత్వం విఫలమైందని కేటీయార్, హరీష్ తో పాటు సీనియర్ నేతలు గోల చేస్తున్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో ప్రభుత్వం రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో తట్టుకోలేక పథకం అమలులో లోపాలను వెతికి మరీ నానా గోలచేస్తున్నారు. అలాగే ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలమైందని, డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్ 2,3 పరీక్షల తేదీల నిర్ణయంపై విద్యార్దుల ఆందోళనలను సభలో ప్రస్తావించాలని కూడా అధినేత నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్జంటుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ, విద్యార్ధి సంఘాల నేతలతో మాట్లాడి పరిస్ధితులను చక్కదిద్దింది. విద్యార్దులు డిమాండ్ చేస్తున్నట్లు గ్రూప్-2,3 పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేసింది.

గ్రూప్ 2,3 ఉద్యోగాల సంఖ్యను పెంచే విషయంలో కూడా విద్యార్ధి, నిరుద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. దాంతో విద్యార్దులు, నిరుద్యోగులు తమ ఆందోళనను విరమించుకున్నారు. కాబట్టి అసెంబ్లీలో ఈ పాయింట్లు లేవనెత్తినా కారుపార్టీకి మైలేజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకోవటమే. కారుపార్టీ తరపున గెలచిన 38 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికి 10 మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అలాగే 29 మంది శాసనమండలి సభ్యుల్లో 6మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ వేదికగా పెద్దఎత్తున నిరసన, ఆందోళనలు వ్యక్తంచేయాలని కేసీయార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంలో కూడా పార్టీకి ఎంతవరకు మైలేజి వస్తుందన్నది సందేహమే. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీయార్ అనుసరించిన వైఖరినే ఇపుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తితే కాంగ్రెస్ సభ్యులు కేసీయార్ ప్రోత్సహించిన ఫిరాయింపులను గుర్తుచేస్తు ఎదురుదాడిచేయటం ఖాయం. అప్పుడు సమాధానం చెప్పటానికి కారుపార్టీ నేతల దగ్గర ఏమీ ఉండదు. కాకపోతే ఏదో అడ్డదిడ్డంగా కేసీయార్ చర్యను సమర్ధించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించటమైతే ఖాయం. అదే పద్దతిలో కాంగ్రెస్ సభ్యులు కూడా తమ చర్యను సమర్ధించుకుంటారనటంలో సందేహంలేదు. కాబట్టి సభలో ప్రజా సమస్యలు గాలికిపోయి ఫిరాయింపుల్లాంటి అంశాలతో సభలో గొడవల కారణంగా విలువైన ప్రజాసమయం, ప్రజాధనం వృధాఅయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కేసీయార్ పాత్రేమిటి ?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీయార్ హాజరవుతారా లేదా అన్న విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది. సమావేశాలకు తమ అధినేత హాజరవుతారా లేదా అని కారుపార్టీలోని నేతలే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు మూడోది. మొదటిరెండు సమావేశాలకు కేసీయార్ హాజరుకాలేదు. తాను సమావేశాలకు హాజరైతే కాంగ్రెస్ సభ్యులు ఎలా వ్యవహరిస్తారనే విషయాన్నే కేసీయార్ ఆలోచిస్తున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. మరి సభకు హాజరయ్యే విషయమై కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story