బీఆర్ఎస్, బీజేపీలు కొత్తరకం ఓటర్లకు గాలమేస్తున్నాయా ?
x

బీఆర్ఎస్, బీజేపీలు కొత్తరకం ఓటర్లకు గాలమేస్తున్నాయా ?

ఈమధ్యనే ఏర్పాటుచేసిన హైడ్రా, ఇపుడు టేకప్ చేసిన మూసినది సుందరీకరణ ప్రాజెక్టు కారణంగా కొత్తరకం ఓటర్లు పుట్టుకొచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మామూలుగా ఓటర్లలో రెండు రకాలుంటారు. పార్టీలకు మద్దతుగా ఉండే లాయల్ ఓటర్లు మొదటిరకం. రెండోరకం న్యూట్రల్ ఓటర్లు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా అభిమానంతో ఓట్లేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటములను శాసించేది న్యూట్రల్ ఓటర్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. న్యూట్రల్ ఓటర్లంటే ఐదేళ్ళల్లో అధికారంలో ఉన్న పార్టీ పాలన ఎలాగుందనేది విశ్లేషించుకుని ఓట్లేస్తారు. ప్రతిపార్టీకి కమిటెడ్ ఓటర్లు, సానుభూతిపరులు సుమారుగా 20-25 శాతం ఉంటారు. వీళ్ళల్లో ఎన్నికల సమయంలో అటుఇటు మారే ఓటర్లు చాలా తక్కువమంది ఉంటారు. అందుకనే పార్టీల గెలుపోటముల్లో న్యూట్రల్ ఓటర్లదే కీలకపాత్ర. అయితే పార్టీ లాయల్ ఓటర్లు, అభిమానులు, సానుభూతిపరులు కూడా ఒక్కోసారి తమ పార్టీని కాదని ఇతర పార్టీలకు ఓట్లేసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే అది చాల అరుదనే చెప్పాలి.



ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కమిటెడ్ ఓటర్లు, సానుభూతిపరులు, మద్దతుదారుల్లో ఎక్కువమంది కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దానికి అనేక కారణాలున్నాయి. దాని ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇపుడు సమస్య ఏమిటంటే రేవంత్ రెడ్డి ఈమధ్యనే ఏర్పాటుచేసిన హైడ్రా, ఇపుడు టేకప్ చేసిన మూసినది సుందరీకరణ ప్రాజెక్టు కారణంగా కొత్తరకం ఓటర్లు పుట్టుకొచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొత్తరకం ఓటర్లంటే కాంగ్రెస్ వ్యతిరేకత ఓటర్లని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయం మూసీనదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలను, ఇళ్ళను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టగానే బయటపడుతోంది.



మూడురోజులుగా హైడ్రా+రెవిన్యు, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా మూసీనదికి రెండువైపులా ఉన్న ఇళ్ళను తొలగించేందుకు మార్కింగ్ చేస్తున్నారు. మూసీనదికి రెండువైపులా సుమారు 15 వేల నిర్మాణాలను తొలగించాలని ఇప్పటికే సర్వేలో అధికారులు ఫైనల్ చేశారు. ఈ 15 వేలనిర్మాణాలన్నీ ఆక్రమణలుకావు. ఇందులో పట్టాలుండి ఇళ్ళు కట్టుకన్నవారు కూడా ఉన్నారు. అలాగే స్ధలాలను ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళతో పాటు, గోడౌన్లు, కమర్షియల్ కాంప్లెక్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వీటన్నింటినీ తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందో వెంటనే బాధితుల నుండి గోల మొదలైపోయింది.



సంవత్సరాలనుండి తాముంటున్న నివాసాలను, తమ వ్యాపార సముదాయాలను, వాడుకుంటున్న గోడౌన్లను ప్రభుత్వం కూల్చేస్తుందంటే బాధితులు మండిపోతున్నారు. ఇపుడు బయటకువస్తున్న బాధితులు కొందరే బయటకురాని బాధితులు ఎంతమందున్నారో తెలీదు. ఇలాంటి బాధితులందరు రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లేస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాలను గ్రహించే ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నేతలు బాధితులకు మద్దతుగా రాజకీయాలు మొదలుపెట్టేశాయి. బీఆర్ఎస్ ఆఫీసు తెలంగాణా భవన్లో మాజీమంత్రి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. బాధితుల తరపున తాము పోరాటాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నిజానికి బాధితుల తరపున బీఆర్ఎస్ చేసే పోరాటాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మూసీ రివర్ సుందరీకరణ ప్రాజెక్టును అమలుచేయటంలో రేవంత్ ప్రభుత్వం చాల గట్టిగా నిలబడింది.



బాధితులను కన్వీన్స్ చేసి మూసీనది ప్రాంతం నుండి తరలించి ప్రత్యేకంగా ఇందిరమ్మ డబుల్ బెడ్ రూము ఇళ్ళను కేటాయించాలని ఇప్పటికే రేవంత్ ఆదేశించారు. మూసీ బాధితుల కోసం ప్రభుత్వం 16 వేల డబుల్ బెడ్ రూములను సిద్ధంచేయబోతోంది. ఈలోగా ఎక్కడ వీలైతే అక్కడ బాధితులకు డబుల్ బెడ్ రూములను కేటాయిస్తోంది. ఇప్పటికి సుమారు 20 కుటుంబాలు తమ ఇళ్ళను ఖాళీచేసి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూముల్లోకి మారిపోయారు. అయితే చాలామంది తమ ఇళ్ళను ఖాళీచేయటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. బాధితులు తమ ఇళ్ళను ఖాళీచేయకపోతే ప్రభుత్వం బలవంతంగా అయినా వాళ్ళని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించటం ఖాయం. అప్పుడు ప్రభుత్వానికి బాధితులకు మధ్య పెద్ద గొడవలు అవుతాయి. ఈ విషయాన్ని గ్రహించాయి కాబట్టే బీఆర్ఎస్, బీజేపీ నేతలు బాధితులతో భేటీలై పోరాటాలని చెబుతున్నది.

నియోజకవర్గాలు ఎన్నున్నాయి ?



ఇపుడు జరుగుతున్న వ్యవహరాలన్నీ మూసీ బాధితులు కావచ్చు లేదా హైడ్రా బాధితులు కూడా కావచ్చు రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ కు నెగిటివ్ అవుతారనటంలో ఎలాంటి సందేహంలేదు. మూసీ పరీవాహక ప్రాంతం అంటే 55 కిలోమీటర్ల పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలు మలక్ పేట, కార్వాన్, అంబర్ పేట, నాంపల్లి, గోషామహల్, చాంద్రాయణగుట్ట, యాకత్ పురా, బహదూర్ పురా ఉన్నాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో మలక్ పేట, కార్వాన్, నాంపల్లి, చాంద్రాయణగుట్ట, యాకుత్ పుర, బహదుర్ పుర నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం ఎంఎల్ఏలున్నారు. మిగిలిన గోషామహల్, అంబర్ పేటలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంఎల్ఏలున్నారు. మూసీనది రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నది. పై జిల్లల పరిధిలోకి వచ్చే పార్లమెంటు స్ధానాల్లో కూడా ప్రతిపక్షాల నేతలే ఎంపీలుగా ఉన్నారు. అంటే పార్లమెంటులో కాని అసెంబ్లీల్లోని ఎక్కడా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు.

ఎన్ని ఓట్లుంటాయి ?



మూడు పార్లమెంటునియోజకవర్గాలు, ఎనిమిది అసెంబ్లీనియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల ఓట్లుంటాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2.50 లక్షల ఓటర్లుంటారు. కాబట్టి ఎనిమిది అసెంబ్లీనియోజకవర్గాల్లో 20 లక్షల ఓటర్లకు తక్కువ కాకుండా ఉంటారు. ఈ 20 లక్షలఓటర్లలో అత్యధికులు మూసీనది ప్రాంతంలోని తమ నివాసాలను ఖాళీ చేయక తప్పదు. కాబట్టి 20 లక్షల మందిలో అత్యధికులు బాధితులే అనటంలో సందేహంలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బాధితుల్లో అత్యధికులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఓట్లేస్తానరటంలో అనుమానాలు అవసరంలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తనంతట తానుగా లక్షలాది మంది ఓటర్ల(ప్రజల)ను వ్యతిరేకంగా తయారుచేసుకుంటోంది.

చాలా సమస్యలున్నాయి




నిజానికి మూసీనదిలోకి సమీపంలోని పరిశ్రమలు, పరిశ్రమల యూనిట్లలోని వ్యర్ధాలు, కాలుఫ్యాలన్నీ కలిసిపోతున్నాయి. నదికి రెండువైపులా సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వీటిల్లో అత్యధికం ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నారు. వాటినే నగరంలోని అనేక ప్రాంతాలకు పంపిణీచేసి అమ్మేస్తున్నారు. ఎక్కడ పండిస్తున్నారో తెలీకుండానే జనాలు కొనేసి వాడేస్తున్నారు. దీని ఫలితంగానే జనాల్లో అనేక రకాల అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, మొకాళ్ళు, కంటి, చర్మ, క్యాన్సర్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ కమిటి సభ్యుడు డాక్టర్ సంజీవ్ సింగ్ తెలిపారు. అనారోగ్యాలకు కారణమవుతోందని తెలిసినా మూసీనది ప్రాంతంలో పంటలసాగును ప్రభుత్వం ఎందుకు నిషేధించటంలేదో అర్ధంకావటంలేదన్నారు. మూసీ నీటిని, ఇక్కడ పండించే ఆకుకూరలు, కాయగూరలను మేడ్చల్-మల్కాజ్ గిరి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ జిల్లలతో పాటు మలక్ పేట, ఉప్పల్, కొత్తపేట, సరూర్ నగర్ మార్కెట్ల పరిధిలోని జనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

వ్యతిరేకమవుతారని తెలీదా ?




ఆక్రమణలు తొలగించాలంటే బాధితులందరు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమవుతారని రేవంత్ రెడ్డితో పాటు నేతలందరికీ బాగా తెలుసు. అయినా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో వేలాది ఇళ్ళు, నిర్మాణాలతో పాటు జలవనరులను ఆక్రమణలను ఎందుకు తొలగిస్తున్నట్లు ? ఎందుకంటే ఇళ్ళను ఖాళీ చేయాలన్నా, తమ ఇళ్ళను కూల్చేస్తున్నారన్నా యజమానులు ఇపుడు బాధపడతారు. అయితే ఆక్రమణలను ఖాళీచేయటం ద్వారా జలవనరులు, నిర్మాణాలను తొలగించటం ద్వారా మూసీనది సుందరంగా తయారవుతుంది. ఇది దీర్ఘాకాల ప్రాజెక్టే అయినా ముందుతరాలు కచ్చితంగా రేవంత్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకుంటాయనటంలో సందేహంలేదు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే రేవంత్ అనుకున్నది అనుకున్నట్లుగా జలవనరులు తమ సహజ స్వభావాన్ని సంతరించుకుని, మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు అద్బుతంగా తయారైనపుడు మాత్రమే.

అసలు మూసీ ప్రాజెక్టు ఏమిటి ?



మూసీనదికి రెండువైపులా నిర్మాణాలను తొలగిస్తే సుమారు 25 వేల ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుంది. ఇందులో సుమారు 120 కోట్ల చదరపు అడుగుల స్ధలాన్ని రియల్ ఎస్టేట్ డెవలప్మెంటుకు కేటాయించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇందులోనే కొత్తగా కమర్షియల్ కాంప్లెక్సులు, మల్టీపెక్సులు, 55 కిలోమీటర్లలో బోటింగ్, రిసార్టులు, అమ్యూజ్మెంట్ పార్కులు రాబోతున్నాయి. లండన్లోని థేమ్స్, దక్షిణకొరియా, సియోల్ లోని చంగ్ యే చున్ నదిని సుందీరకరించినట్లుగా మూసీనదిని తయారు చేయాలన్నది రేవంత్ పట్టుదల. ఈ ప్రాజెక్టు ఖరీదు సుమారు రు. 5 వేల కోట్లు. అయితే ప్రాజెక్టు అనుకున్నది అనుకున్నట్లు రెడీ అయితే ప్రభుత్వానికి భవిష్యత్తులో బంగారుగుడ్లు పెట్టే బాతులాగ తయారవుతుంది అనటంలో సందేహంలేదు.

హైడ్రాపై వ్యతిరేకత



జలవనరులైన చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 260 ఆక్రమణలను తొలగించింది. ఇప్పటికైతే హైడ్రా బాధితులు వందల్లోనే ఉన్నా భవిష్యత్తులో వేలకు చేరే అవకాశాలున్నాయి. ఈ బాధితుల్లో అత్యధికులు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్ చెరు, చేవెళ్ళ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోకి వస్తారు. రాబోయే ఎన్నికల్లో బాధితులంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఓట్లేస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హైడ్రా యాక్షన్ కు మద్దతుగా నిలుస్తున్న జనాలు కూడా ఉన్నారు. ఆక్రమణలు, కబ్జాలను వ్యతిరేకించే జనాలందరు రేవంత్ ప్రయత్నాన్ని, హైడ్రా యాక్షన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

రాజకీయ కోణం



ఇక్కడ రాజకీయ కోణం కూడా ఉంది. అదేమిటంటే పైన చెప్పిన పార్లమెంటు నియోజకవర్గాల్లో అయినా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయినా కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు. ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాని, పార్లమెంటులో కాని కాంగ్రెస్ ఎప్పటికీ గెలిచే అవకాశంలేదు. ఎంఐఎం ఎంఎల్ఏలుండే నియోజకవర్గాలే కాదు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలుపు అనుమానమే. ఒక్క అంబర్ పేట నియోజకవర్గంలో ఎప్పటికైనా గెలుస్తుందేమో తెలీదు. కాబట్టి రాజకీయ కోణంలో కూడా ఆలోచించి ఎలాగూ పార్టీ గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాల్లోనే మూసీనది ఉంది కాబట్టి మూసీ రివర్ ఫ్రంట్ డెవపల్మెంట్ ప్రాజెక్టును టేకప్ చేసినట్లున్నారు. రేవంత్ ఆలోచన ప్రకారం ప్రాజెక్టు పనులు మొదలై నది అత్యంత సుందరంగా సిద్ధమైతే అనూహ్యంగా జనాలు కాంగ్రెస్ కు ఓట్లేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి భవిష్యత్తులో ఏమి జరగుతుదన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

Read More
Next Story