ఆకలికి తట్టుకోలేని విద్యార్ధులు చివరకు..(వీడియో)
x

ఆకలికి తట్టుకోలేని విద్యార్ధులు చివరకు..(వీడియో)

అన్నంలో కారం కలుపుకుని తింటున్నారంటే పిల్లల ఆకలిబాధకు ఎంతగా అల్లాడిపోతున్నారో అర్ధమవుతోంది.


ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలు కావటంలేదా ? బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ఆరోపణలు ఆశ్చర్యంగా ఉంది. హరీష్ ఏమన్నారంటే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడంలేదట. ఆకలికి తట్టుకోలేని విద్యార్దులు చేసేదిలేక అన్నంలో కారం వేసుకుని నూనెతో కలుపుకుని తింటున్నారంటు ప్రభుత్వంపై హరీష్ మండిపడ్డారు. అన్నంలో కారం కలుపుకుని తింటున్నారంటే పిల్లల ఆకలిబాధకు ఎంతగా అల్లాడిపోతున్నారో అర్ధమవుతోంది. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం స్కూళ్ళకు మంజూరుచేస్తున్న నిధులన్నీ ఏమవుతున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పిల్లలు అన్నంలో నూనె వేసుకుని కారం కలుపుకుని తింటున్న ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు. విద్యార్ధుల భోజనాల విషయంలో కూడా ప్రభుత్వం ఇంత బాధ్యతా రహితంగా వ్యవహరించటం బాధాకరమని ట్విట్టర్లో హరీష్ ఆవేధన వెలిబుచ్చారు. విద్యార్ధులకు ఉదయం పౌష్టికాహారాన్ని అందించే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం’ అటకెక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించటంలో కూడా ఫెయిలైందని మండిపడ్డారు.

మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించిన కుక్ కమ్ హెల్పర్ల జీతాల బిల్లులు పెండింగులో ఉన్న కారణంగానే విద్యార్ధులకు కడుపునిండా సరైన భోజనం కూడా దొరకటంలేదని ఆరోపించారు. భట్టి వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని, కార్మికుల జీతాలను చెల్లించి పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అన్నంలో పురుగులా ?

అలాగే రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ కొస్లీలోని నాచారం కస్తూర్బా గాంధీ స్కూల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటు విద్యార్ధినులు నానా గోల చేశారు. విషయాన్ని అధికారులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదట. అందుకనే విద్యార్ధినులంతా రోడ్డుపైన భైఠాయించారు. కలెక్టర్ వచ్చి తమకు తగిన హామీ ఇచ్చేవరకు లేచేదిలేదంటు రోడ్డుపైనే కూర్చున్నారు. మరి చివరకు కలెక్టర్ ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story