బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు..జగన్, చంద్రబాబు విధ్వంసకులు
x

బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు..జగన్, చంద్రబాబు విధ్వంసకులు

జీవో 85ను రద్దు చేయాలని, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి అన్నారు.


ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు, తెలుగు సూరీడు కాగా, తెలుగు వారైన జగన్, చంద్రబాబు తెలుగు భాష విధ్వంసకులు కావడం దురదృష్టకరం, శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లి లో స్వర్గీయ సర్ సిపి బ్రౌన్ దొర 141 వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్ ఈస్టిండియా కంపెనీ తరఫున భారతదేశానికి వచ్చి, కడపలో ఇల్లు కొనుక్కొని ,తెలుగు భాష నేర్చుకొని ,తెలుగు నిఘంటువు రచించి ,తెలుగులో అనేక పుస్తకాలు రచించి, వేమన పద్యాలు సేకరించి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి ,పదవీ విరమణ అనంతరము ఇంగ్లాండ్ కు పోయి లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పని చేశాడన్నారు. అందుకే బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు, తెలుగు సూర్యుడు అయ్యాడని తులసి రెడ్డి కీర్తించారు.

కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ పాలనలో, ఇటు చంద్రబాబు పాలనలో తెలుగు భాష పరిస్థితి నానాటికి క్షీణిస్తూ ఉండడం శోచనీయమన్నారు. ప్రపంచంలో ప్రతి దేశము ,భారతదేశంలో ప్రతి రాష్ట్రము పాఠశాల విద్యను ,ప్రత్యేకించి ప్రాథమిక విద్యను తమ తమ మాతృభాషలోనే బోధిస్తూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు గతంలో జగన్ ప్రభుత్వం 2019 నవంబర్ 20వ తేదీన జీవో 85 ద్వారా పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దుచేసి ,ఆస్థానములో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రిక తప్పిదం.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జీవో 85 ను రద్దు చేయకుండా కొనసాగించడం గర్హనీయం. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350 A లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. జాతిపిత మహాత్ముడు, విశ్వకవి రవీంద్రుడు ,భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ , క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం ఇదే విషయాన్ని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోవడం విడ్డూరం.
చంద్రబాబు ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు పట్ల ఏమాత్రం గౌరవం వున్నా వెంటనే జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85ను రద్దు చేయాలని, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని ,లేదా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉన్నత విద్యలో, ఉద్యోగాల విషయంలో రెండు శాతం అదనపు మార్కులు కలపాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ విధంగా చేయలేకపోతే తమ పార్టీ పేరును మార్చుకొని ఇంగ్లీష్ దేశం లేదా ఆంగ్ల దేశం అని పెట్టుకోవలసిందిగా తులసి రెడ్డి తెలుగుదేశం పార్టీకి సూచించారు .
బ్రౌన్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం, తులసి రెడ్డి సతీమణి నర్రెడ్డి అలివేలమ్మ ,కాంగ్రెస్ నాయకులు బండారు వెంకటేశు, బద్రీనాథ్ ,రాఘవయ్య, చిన్నకోట్ల నాగరాజు, నామా వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story