అన్న హత్యకు ప్రతీకారం..వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది
x

అన్న హత్యకు ప్రతీకారం..వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది.


కక్షలు, కార్పణ్యాలు పాతకక్షలకు దారితీసి మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఒక దారుణ హత్య చోటుచేసుకుంది. తన అన్న మరణానికి కారణమైన వదినను మరిది రోకలి బండతో కొట్టి హతమార్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన గంగావతి (30)కి, అహోబిలం అనే వ్యక్తితో వివాహమైంది. అయితే, మూడు నెలల క్రితం గంగావతి తన ప్రియుడితో కలిసి భర్త అహోబిలాన్ని హత్య చేయించింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇటీవలే సబ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన గంగావతి, తిరిగి గ్రామంలోనే నివాసం ఉంటోంది.

అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో తమ అన్నను అన్యాయంగా చంపించిందన్న కోపంతో ఆమె మరిది పెద్దయ్య ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరైన అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి సమయం చూసి గంగావతి ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ఆమెపై రోకలి బండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గంగావతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న ఆస్పరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Read More
Next Story