
రేవంత్ మూడు ప్రిస్టేజియస్ ప్రాజెక్టులకు బ్రేకులు
అత్యంత ప్రతిష్టాత్మకమని రేవంత్ అనుకున్న మూడు ప్రాజెక్టులకూ ఏదోరూపంలో బ్రేకులు పడిన విషయం తెలిసిందే
రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుకు సుప్రింకోర్టు రూపంలో బ్రేక్ పడింది. అత్యంత ప్రతిష్టాత్మకమని రేవంత్ అనుకున్న మూడు ప్రాజెక్టులకూ ఏదోరూపంలో బ్రేకులు పడిన విషయం తెలిసిందే. తాజాగా భౌగోళికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ) ప్రాంగణంలో ఉన్న 400 ఎకరాలను వేలంద్వారా అమ్మాలన్న రేవంత్ నిర్ణయంపై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఈ వివాదం ఇప్పుడిప్పుడే తెమిలేట్లు కనబడటంలేదు. కోర్టులో కేసు తెమిలేటప్పటికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి 400 ఎకరాల వేలం కూడా ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించటంలేదు. ఇంతకముందు మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు(Musi River Project)కు కూడా కోర్టులో కేసుల వల్లే బ్రేకులుపడింది. ఇపుడా ప్రాజెక్టు పరిస్ధితి ఏమిటో ఎవరు చెప్పలేకున్నారు. అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటి(Pharma City)కి సేకరించాలని అనుకున్న భూసేకరణ కూడా వివాదాస్పదం అవటంతో నిలిచిపోయింది. ఈమూడు ప్రాజెక్టులను రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇపుడు మూడింటి పరిస్ధితి అయోమయంగానే తయారైంది.
తాజా వివాదాన్నే తీసుకుంటే వివాదాస్పదమైన 400 ఎకరాలు అసలు యూనివర్సిటీ(HCU)వి కానేకావు. ఈ భూములన్నీ అచ్చంగా ప్రభుత్వానివే. అయితే భూములన్నీ యూనివర్సిటీవే అన్నట్లుగా ప్రచారం జరిగిపోయింది. 1976లో హచ్సీయూ ఏర్పాటుచేసినపుడు ప్రభుత్వం 2300 ఎకరాలను కేటాయించింది. భూమిని కేటాయించిన ప్రభుత్వం సదరు భూములను యూనివర్సిటీకి బదిలీచేయలేదు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా అప్పట్లో భూములను బదిలీచేయించుకునే విషయంలో అలసత్వం వహించినట్లు ఇపుడు అర్ధమవుతోంది. అంటే ప్రభుత్వానికి చెందిన 2300 ఎకరాల ప్రభుత్వభూముల్లోనే ఇపుడు యూనివర్సిటి నడుస్తున్నట్లు అనుకోవాలి. 2003లో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్ధకు 400 ఎకరాలను కేటాయించింది. యూనివర్సిటీ నుండి 400 ఎకరాలను తీసుకున్నందుకు బదులుగా గోపనపల్లిలోని రెండు సర్వేనెంబర్లలో 400 ఎకరాలను కేటాయించినట్లు రికార్డుల్లో ఉంది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కేటాయింపులను తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్(YSR) ప్రభుత్వం రద్దుచేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఐఎంజీ యజమాని బిల్లీరావు కోర్టులో చాలెంజ్ చేశారు. ముందు హైకోర్టులోను తర్వాత సుప్రింకోర్టులో కూడా ఓడిపోయారు. రెండుకోర్టుల్లోను 400 ఎకరాలు ప్రభుత్వానివే అని తీర్పులొచ్చాయి. సుప్రింకోర్టు తీర్పిచ్చింది 2024 అక్టోబర్ ప్రాంతంలోనే. సుప్రింకోర్టు తీర్పురాగానే ప్రభుత్వం వెంటనే ఆ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ)కి కేటాయించింది. ఆ భూములన్నింటినీ ఆధీనంలోకి తీసుకోమని ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే ఆ 400 ఎకరాలను వేలంద్వారా అమ్మేసి సంక్షేమపథకాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేయాలన్నది రేవంత్(Revanth) నిర్ణయం. ప్రభుత్వ ఆదేశాలతో టీజీఐఐసీ రంగంలోకి దిగింది. బుల్డోజర్లు, పొక్లైనర్లను తీసుకొచ్చి భూమిచదును మొదలుపెట్టగానే ముందు విద్యార్ధులు గోలమొదలుపెట్టారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందంటు నానా రచ్చమొదలుపెట్టారు.
విద్యార్ధులు రచ్చ మొదలుపెట్టగానే యూనివర్సిటి ఉద్యోగులు జతకలిశారు. ఇదేసమయంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, వాలంటీర్లు, ఎన్జీవోలు కోర్టులో కేసులు వేశారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోల మొదలైపోయిందో వెంటనే బీఆర్ఎస్, బీజేపీలు కూడా రంగంలోకి దూకేసి వివాదాన్ని బాగా పెద్దదిచేసేశాయి. దాని ఫలితమే సుప్రింకోర్టు(Supreme Court) సూమోటోగా కేసు టేకప్ చేసి విచారణ మొదలుపెట్టడం. 400 ఎకరాల్లో వేలాది చెట్లు, వన్యప్రాణులు, పక్షులున్న కారణంగా అంత అర్జంటుగా చెట్లు నరకాల్సిన అవసరం ఏమొచ్చిందంటు జస్టిస్ బీఆర్ గవాయ్, ఏజీ మాసి తీవ్రంగా ఆక్షేపించారు. పర్యావరణ, అటవీశాఖల అనుమతులు తీసుకోకుండా 100 ఎకరాల్లో చెట్లు నరికేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్ ను నిలదీసింది. 400 ఎకరాల వివాదంపై సీరియస్ అయిన సుప్రింకోర్టు జరుగుతున్న పనులను ఎక్కడివి అక్కడే నిలిపేయాలని ఆదేశించింది.
తమ ఆదేశాలకు భిన్నంగా పనులు జరిగితే అందుకు బాధ్యులను చేస్తామని చీఫ్ సెక్రటరీకి జస్టిస్ గవాయ్ స్పష్టంగా హెచ్చరించటంలోనే తెలిసిపోతోంది సుప్రింకోర్టు ఎంత సీరియస్ గా ఉందో. ఈనెల 16వ తేదీలోగా క్షేత్రస్ధాయి పరిస్ధితిపై రిపోర్టు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ను కోర్టు ఆదేశించింది. సుప్రింకోర్టులో జరిగిన విచారణ, జడ్జీల తీరుచూస్తుంటే ఈ వివాదం ఇప్పుడిప్పుడే తేలేట్లు కనబడటంలేదు. అంటే 400 ఎకరాల వేలంపాటకు బ్రేకులు పడిందని అర్ధమైపోతోంది.
ఈ విషయాన్ని పక్కనపెట్టి కాస్త చరిత్రలోకి వెళితే రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లోని మూడు గ్రామాల్లో ఫార్మాసిటి కోసం 1100 ఎకరాలను సేకరించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అనుకున్నదే ఆలస్యం నోటిఫికేషన్ జారీచేసేసింది ప్రభుత్వం. భూసేకరణలో భాగంగా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్రామసభ పెట్టినపుడు పెద్ద గొడవైంది. సభ జరుగుతుండగానే కొందరు గ్రామస్తులు, రైతులు సడెన్ గా కలెక్టర్ పై దాడిచేసి కొట్టారు. ఆ గొడవ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. కలెక్టర్ మీద దాడిచేసి కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రంగంలోకి దిగిన పోలీసులు దొరికిన వాళ్ళమీద కేసులుపెట్టి విచారణకు తీసుకోవటం తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించటం అంతా పెద్ద గొడవైపోయింది. అప్పుడు కూడా హైకోర్టు సీరియస్ అవ్వటంతో భూసేకరణకు బ్రేకులు పడ్డాయి.
అదే సమయంలో మూసీనది సుందరీకరణ ప్రాజెక్టును రేవంత్ చేపట్టారు. నదికి రెండువైపులా సుమారు 57 కిలోమీటర్ల పొడవున ఉన్న ఇళ్ళను, ఆక్రమణలను తొలగించాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. సుమారు 250 ఇళ్ళను కూల్చేయటంలో పెద్ద గొడవైంది. బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపైకి రావటంతో వెంటనే బీఆర్ఎస్, బీజేపీలు రంగంలోకి దూకేశాయి. వివాదం బాగా పెద్దదైపోయి కొందరు బాధితులు హైకోర్టులో కేసులు వేశారు. రెండువైపులా వాదనలు విన్న కోర్టు అత్యవసరంగా ఇళ్ళను కూల్చటంపై స్టే ఇచ్చింది. బాధితులతో మాట్లాడిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. కొందరు నివాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని కేటాయించింది. తమ ఇళ్ళను వదిలేసి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళలోకి మారిన వాళ్ళసంఖ్య చాలాతక్కవ. తాజా పరిస్ధితి ఏమిటంటే మూసీనది సుందరీకరణ వ్యవహారానికి బ్రేకులైతే పడిపోయాయి.
ఈమూడు బ్రేకులే కాకుండా హైడ్రా విషయంలో కూడా ప్రభుత్వం దాదాపు ఇదే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఇళ్ళకూల్చివేతలో హైడ్రా(Hydra)పై హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది. నోటీసిచ్చిన 24 గంటల్లోనే ఇళ్ళను కూల్చేయటంపై హైడ్రాకు హైకోర్టు చాలాసార్లు అక్షింతలు వేసింది. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్ళను కూల్చేస్తున్న హైడ్రా పెద్దవాళ్ళ ఇళ్ళజోలికి ఎందుకు వెళ్ళటంలేదని సూటిగా ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు హైడ్రానుండి ఇప్పటివరకు సమాధానమే రాలేదు. అయితే హైకోర్టు సీరియస్ అవటంతో కూల్చివేతల విషయంలో హైడ్రా జోరు పూర్తిగా తగ్గిపోయింది.
తప్పులన్నీ ప్రభుత్వానివేనా ?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌలికమైన విషయాన్ని మరచిపోయింది. అదేమిటంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ముందు దానికి సంబంధించిన పార్టీలతో మాట్లాడాలి. ఉదాహరణకు ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలంటే వందల ఎకరాల భూములు కావాలి. భూములు కావాలంటే ఏ ప్రభుత్వానికి అయినా ముందు కనబడేది రైతుల పొలాలే. రైతుల నుండి భూములు తీసుకోవాలని అనుకున్నపుడు ప్రభుత్వం ముందుగా చేయాల్సింది ఏమిటంటే రైతులతో మాట్లాడాలి. ఒకటికి రెండుసార్లు రైతులతో మాట్లాడి వాళ్ళని కన్వీన్స్ చేసే ప్రయత్నంచేయాలి. ఏదో ఒక దశలో రైతులను కన్వీన్స్ చేసిన తర్వాతే ప్రభుత్వం భూసేకరణ మొదలుపెట్టాలి. అప్పుడు భూసేకరణ వ్యవహారం సజావుగా జరుగుతుంది.
మూసీనది ప్రాజెక్టు టేకప్ చేయాలని అనుకున్నపుడు ముందుగా నివాసితులతో మాట్లాడుండాలి. ప్రభుత్వ ఆలోచనలు, ఉద్దేశ్యాలను నివాసితులకు వివరించి ఇళ్ళు ఖాళీచేయాల్సిన అవసరం ఏమిటో వివరించుండాలి. ఇళ్ళు ఖాళీచేయటం వల్ల బాధితులకు ప్రభుత్వం తరపున అందించే లబ్దిని వివరించాలి. ఇక్కడ కూడా నివాసితులను కన్వీన్స్ చేసిన తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవికావు. ఇపుడు హచ్సీయూ పరిధిలోని భూముల విషయంలో కూడా రేవంత్ ప్రభుత్వానికి తొదరపాటే కనబడుతోంది. దశాబ్దాలుగా 400 ఎకరాలు యూనివర్సిటీవే అనే భావనలో విద్యార్ధులు, యాజమాన్యం, ఉద్యొగులున్నారు. 400 ఎకరాలు యూనివర్సిటీవి కావని ప్రభుత్వానివే అని తెలిసిన ప్రభుత్వం ముందుగా ఆ విషయాన్ని యూనివర్సిటీ వర్గాలకు వివరించుండాలి.
ఆ భూముల్లో ఎలాంటి అభివృద్ధిని చేయబోతున్నామో తెలియచేయాలి. 400 ఎకరాల్లోని వేలాది చెట్లతో పాటు పక్షి, జంతుజాలాన్ని ఏమిచేయబోతున్నామో చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా 400 ఎకరాల్లోని చెట్లను కొట్టేస్తే పర్యావరణం సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వందల ఎకరాల్లోని చెట్లను నరికేస్తే పర్యావరణ వేత్తలు, వృక్ష, జంతు శాస్త్రజ్ఞులు చూస్తూ ఊరికే ఉండరన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచించినట్లు లేదు. విద్యార్ధుల స్పందన ఎలాగుంటుందన్న విషయాన్ని అంచనా వేయటంలో ప్రభుత్వం ఫెయిలైంది. దాని ఫలితమే రోజులతరబడి గొడవ, సుప్రింకోర్టు ఆగ్రహంతో అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేకులు.
ప్రతిపక్షాల పాత్ర
ప్రతిపక్షాలెప్పుడూ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఎక్కడ అవకాశం దొరకుతుందా అని ఎదురు చూస్తుంటాయనటంలో సందేహంలేదు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు ఇపుడు అదేపని చేస్తున్నాయి. అయితే ఆందోళనలు చేయటానికి ప్రతిపక్షాలుకు అవకాశాలు ఇవ్వటం ప్రభుత్వం తప్పు. రేవంత్ కాస్త జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేస్తే చాలా గొడవలను ప్రభుత్వం మొగ్గదశలోనే తుంచేసుండచ్చు. గొడవలు తారాస్ధాయికి చేరి సుప్రింకోర్టు దగ్గర అక్షింతలు వేయించుకున్న తర్వాత వివాద పరిష్కారానికి ఇపుడు రేవంత్ తీరిగ్గా మంత్రులతో కమిటీ వేయటమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.