దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరులో భారత బౌలర్లు చెలరేగి పోయారు. భారత జట్టు కివీస్ జట్టును కట్టడి చేసింది. న్యూజీలాండ్ జట్టు భారీ సంఖ్యలో పరుగులు సాధించకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో న్యూజీలాండ్ జట్టు ఏడు వికెట్లను కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు మాత్రమే సాధించ గలిగింది. టీమ్ ఇండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు సాధించగా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున సాధించి కివీస్ జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. కివీస్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ 63 పరుగులు, మైకేల్ బ్రేస్వెల్ 53(నాటౌట్), రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలప్స్ 34, విల్ యంగ్ 15, కేన్ విలియమ్స్‌న్ 11, టామ్ లాథమ్ 14 పరుగులు సాధించగా న్యూజిలాండ్ కెప్టెన్ మైకేల్ శాంట్నర్ పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. 8 పరుగులు మాత్రమే సాధించాడు.
కివీస్ బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ చెప్పుకోద్ద స్థాయిలో భారీ స్కోర్లు సాధించలేక పోవడంతో టీమ్ ఇండియా జట్టు ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ప్రారంభంలో కివీస్ జట్టు పరుగుల ప్రవాహ ప్రారంభం కావడంతో భారత్ లక్ష్యం భారీగానే ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు క్రమంగా లైన్‌లోకి వచ్చారు. బంతి మీద పట్టు పెంచుకుంటూ న్యూజీలాండ్ జట్టు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. వికెట్లను పడగొడుతూ కివీస్ జట్టును ఒత్తిడిలోకి నెట్టడంలో సక్సెస్ అయ్యారు. టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ బాగుండటంతో 252 లక్ష్యం పెద్ద టార్గెట్ కాదని భావిస్తున్నారు. సులువగానే ఛేదించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే అంతకు ముందు టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు జట్టుకు పరుగులు సాధిస్తూ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. రచిన్ రవీంద్ర దూకుడుగా ఆడుతుంటే, యంగ్ అతనికి సహకారం అందించాడు. ఈ క్రమంలో తొలి 42 బంతులకే 50 పరుగులు సాధించి స్కోరు బోర్టు వేగం పెంచారు. ఈ సమయంలో వరణ్ చక్రవర్తి విసిరిన ఓ బంతికి విల్ యంగ్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌తో వెనుదిరిగాడు. దూకుడుగా పరుగులు సాధిస్తున్న రచిన్‌ను కులదీప్ యాదవ్ ఔట్ చేశాడు. కేన్ విలియమ్సన్‌ను కూడా ఔట్ చేసిన కులదీప్ టీమ్ ఇండియాకు ఊరటను కలిగించాడు. ఈ నేపథ్యంలో కివీస్ జట్టు ప్రెషర్ కండిషన్‌లోకి వెళ్లింది. దీంతో పరుగుల వేగం మందగించింది. బౌలర్లు పట్టు సాధించారు. అయితే ఓ దశలో 108 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిన కివీస్ జట్టును డారిల మిచెల్, ఫిలప్స్‌లు ఆదుకున్నారు. సింగిల్స్ మీద దృష్టి పెట్టిన ఈ ఇద్దరు ఆటగాళ్లు రన్‌రేటును కాపాడుకుంటూ వచ్చారు. ఫిలిప్స్‌ను వరణ్ ఔట్ చేయడంతో ఆ సింగిల్స్‌కు కూడా బ్రేక్ పడింది. ఆఖరులో బ్యాటింగ్‌కు దిగిన మైకేల్ బ్రాస్‌వెల్ తన బ్యాట్‌కు పని చెప్పడంతో కివీస్ జట్టు చివరి 30 బంతుల్లో 50 పరుగులు సాధించింది. మైకేల్ బ్రాస్‌వెల్ మెరుపులతో కివీస్ జట్టు ఆ మాత్రమైన పరుగులు సాధించింది.