బొత్స మాట మార్చారెందుకు?
x

బొత్స మాట మార్చారెందుకు?

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా తమపై ఆధారాపడాలంటూ వైసీపీ మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రలో తమ గెలుపుపై మాట కూడా మార్చారు.


ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ఆంధ్రలో చెలరేగుతున్న హింసాత్మక ఘటనలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయ లబ్ది కోసం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో గొడవలు సృష్టించొద్దని ప్రతిపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు. అంతేకాకుండా హింసను ఎవరూ కూడా ప్రోత్సహించొద్దని, అందరూ హింసకు వ్యతిరేకంగా గళమెత్తాలని అన్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో జరిగిన ఒక గొడవలను అనవసరంగా రాజకీయ రాద్దాంతంగా మారుస్తున్నారని, ఇలాంటి పనులను మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు.

తొందరపాటు వల్లే ఈ హింస

అధికారులను నియమించేటప్పుడు వారి పూర్వాపరాలు పరిశీలించకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొందంటూ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాలను పరోక్షంగా తప్పుబట్టారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కొందరు కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదంటూ నీతి వ్యాఖ్యాలు పలికారు.

గెలవలేమని అర్థమయ్యే!

కొన్ని రోజుల క్రితమే ఆంధ్రలో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని, 175కి 175 స్థానాల్లో గెలుస్తామంటూ ఢంకా మోగించిన బొత్స ఇప్పుడు మాట మార్చేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ విజయదుందుభీ మోగించి జూన్ 9న విశాఖ కేంద్రంగా జగన్ రెండొసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి దగ్గరదగ్గరగా 175 స్థానాలు వస్తాయంటూ మాట మార్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు రావడంతో పరిస్థితులు అర్థమయ్యాయని, అందుకే అంకె మారిందంటూ ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

అవన్నీ అధికారిక భవనాలే

ఈ సందర్బంగా రిషికొండ చుట్టూ కట్టిన భవనాల ప్రస్తావనను తీసుకొచ్చారు. అవి అనధికార భవనాలంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ అవి పూర్తిగా అధికారిక భవనాలే అని చెప్పారు. ‘‘రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆ భవనాలను ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. వాటిని తప్పకుండా అధికారికంగా వినియోగిస్తారు’’అని చెప్పారు.

‘కేంద్రమైనా మాపై ఆధారపడాల్సిందే’

రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న నమ్మకం టీడీపీకి లేదని, అందుకే వాళ్లు నిర్వహించాలనుకున్న మహానాడు సభలను రద్దు చేసుకున్నారని బొత్స ఎద్దేవా చేశారు.‘‘2024 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా వైసీపీపై ఆధారపడాల్సిందే. ఉత్తరాంధ్రలో 34 సీట్లకు 34 సీట్లు మాకే వస్తాయి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 ఎంపీ స్థానాల్లో ఎంత లేదనుకున్నా 23 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది’’అని ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story