విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బలం ఉంది. కూటమి తమ అభ్యర్థిని రంగంలోకి దించి క్రాస్ ఓటింగ్ చేయించాలనే ఆలోచన చేసింది. ఈనెల 13 సాయంత్రంతో నామినేషన్‌ల ప్రక్రియ ముగుస్తుంది. కూటమి పోటీ చేయాలనుకుంటే ఇప్పటికే తమ అభ్యర్థిని నిర్ణయించి ఉండాలి. గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని పోటీకి దింపాలని విశాఖ టీడీపీ నాయకులు అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు తప్పకుండా పోటీ పెట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ బ్యానర్‌పై గెలిచిన వారు వాస్తవంగా 615 మంది ఉన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కొన్ని నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీల నుంచి ఉత్తరాంధ్రలో కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీలు సుమారు 85 మంది తెలుగుదేశం, జనసేనకు అనుకూలంగా మారారు. కొందరు ఆ పార్టీల్లో చేరగా కొందరు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టాలంటే వీరితో పాటు మరో వంద మందిపైన మద్దతు కావాల్సి ఉంటుంది. వందమందిపైన ప్రజా ప్రతినిధులను మనవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం.
అభ్యర్థిని పోటీలో ఉంచాలో లేదే మీరే తేల్చాలంటూ నలుగురు ఎమ్మెల్యేలతో ఒక కమిటీని చంద్రబాబు వేశారు. ఆ కమిటీ నివేదిక ఆగస్ట్ 12వ తేదీ సాయంత్రం వరకు ఇవ్వలేదు. 13వ తేదీతో నామినేషన్‌లు ముగుస్తున్నందున ఉదయం నివేదిక ఇచ్చి దానిపై స్టడీ చేసి అభ్యర్థిని నిర్ణయించి నామినేషన్ వేయించడం కష్టమని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. పైగా కూటమి నుంచి పోటీకి దించితే తప్పకుండా ఓట్లను కొగులోలు చేశారనే చెడ్డపేరు వస్తుందని, అది కూటమిపై ప్రభావం చూపుతుందని పార్టీ నాయకులకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
బొత్స సత్యనారాయణకు కూటమి నుంచి కూడా లోలోపల మద్దతు ఉన్నట్లు సమాచారం. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కూడా కూటమి పోటీని వ్యతిరేకిస్తున్నారు. అయితే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం పోటీ పెట్టాల్సిందేనని పట్టపడుతున్నట్లు సమాచారం. బొత్సకు కులం మద్దతు ఎక్కువగా ఉన్నట్లు స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తం ఓట్లు 841 ఉన్నాయి. 11 చోట్ల ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఓట్లలో కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి 615 ఓట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొందరు కార్పొరేటర్లు, జడ్‌పిటీసీ, ఎపీటీసీలు పార్టీ మారారు. అటువంటి వారు సుమారు 85 మంది వరకు ఉన్నారని టీడీపీ వారు చెబుతున్నారు. అలా అనుకున్నా వైఎస్సార్‌సీపీకి ఇంకా 530 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లు ఉన్నాయి. ఎవరు గెలవాలన్నా మినిమం 421ఓట్లు కావాలి. అంటే కూటమి తమ అభ్యర్థిని పోటీకి దించితే 121 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదని, కూటమి తరుపున అభ్యర్థిని పెట్టాలంటే 100 మందితో క్యాంపు నిర్వహించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ చంద్రబాబుతో నేరుగా చెప్పారు. ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది. చంద్రబాబు ముందు నుంచీ వద్దని చెబుతున్నా కొందరు నాయకులు వినలేదని ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. ఈనెల 13తో నామినేషన్‌లు పూర్తి కాగానే 14న స్క్రూట్నీ ఉంటుంది. 16న ఉపసంహరణలు ఉంటాయి. 30న పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సెప్టెంబరు 6తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
నేటి నుంచి రెండు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలో ఉంటారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు, కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి మాట్లాడారు. బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా మంగళవారం కూడా నామినేషన్‌కు గడువు ఉంది. దీంతో జగన్ మంగళ, బుధవారాలు విశాఖలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు పార్టీ కార్యకాలపాలపై కూడా ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా జగన్ సమావేశమవుతారు.