ఇద్దరూ ప్రపంచ ప్రసిద్ధులు.. కొత్తగా రాజకీయాల్లోకి..
x

ఇద్దరూ ప్రపంచ ప్రసిద్ధులు.. కొత్తగా రాజకీయాల్లోకి..

ఇద్దరూ డాక్టర్లు. ఎవరి రంగంలో వారు నిష్ణాతులు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీలుగా పోటీలో ఉన్నారు. ఒకరు తెలుగుదేశం పార్టీ కాగా, ఇంకొకరు వైెఎస్సార్సీపీ.


ఆంధ్రప్రదేశ్‌ జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇద్దరు డాక్టర్లు పోటీ పడుతున్నారు. ఒకరు టీడీపీ నుంచి కాగా మరొకరు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉన్నారు. వీరిద్దరికీ కొన్ని సారూపత్యలు ఉన్నాయి. ఒకరు దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా ఎన్నికల రంగంలోకి దిగారు. మరొకరు ప్రపంచంలోనే క్యాన్సర్‌ వైద్య రంగంలో నిపుణుడైన వైద్యుడు. ఒకరికి రాజకీయ నేపథ్యం లేదు. మరొకరికి రాజకీయ నేపథ్యం ఉంది. వీరిద్దరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇప్పటి వరకు భారత దేశంలో పార్లమెంట్, రాజ్యసభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో ఈయనే ధనవంతుడు. పెమ్మసాని ఆస్తులు రూ. 5705 కోట్లుగా తన అఫిడవిట్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఎవరీ చంద్రశేఖర్, ఈయనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు.
పెమ్మసాని చంద్రశేఖర్‌ సామాన్య రైతు కుటుంబంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య గుంటూరు జిల్లాలో పూర్తి అయింది. పై చదువుల కోసం వైద్య రంగంలో స్థిరపడాలని మెడిసిన్‌ చదివేందుకు 1993–94లో ఎంట్రెన్స్‌ రాసి 27వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. పీజీ చదువుల కోసం 2000లో అమెరికాకు వెళ్లారు. అక్కడ పీజీ పూర్తి చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్‌ ఫ్యాకల్టీగా పని చేశారు. అమెరికాలో మెడికల్‌ లైసెన్స్‌ల కోసం ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు తాను తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో అందించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో యువరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ సంస్థను ప్రారంభించారు. అమెరికా ఫిజీషియన్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. అనతి కాలంలోనే కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు.
మచిలీపట్నం పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సింహాద్రి చంద్రశేఖర్‌ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన క్యాన్సర్‌ వైద్య నిపుణులు. ఈయన స్వగ్రామం కృష్ణాజిల్లా అవనిగడ్డ. డాక్టర్‌ కావాలనే మక్కువతో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. తర్వాత 1983లో ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ గుంటూరు మెడికల్‌ కాలేజీ నంచి పూర్తి చేశారు. తర్వాత ఎంసిహెచ్‌ సర్జికల్‌ ఆంకాలజీని క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అడియార్, చెన్నై, మద్రాసు యూనివర్శిటీ నుంచి 1988లో పూర్తి చేశారు. హైదరాబాద్‌లో క్యాన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎంతో మంది రోగులకు వైద్య సేవలందించారు. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖలకు క్యాన్సర్‌ కన్‌సల్టెంట్‌గా పని చేశారు. ప్రపంచలో చంద్రశేఖర్‌కు క్యాన్సర్‌ వైద్య రంగంలో మంచి గుర్తింపు ఉంది. ఈయన తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు. 1985 నుంచి 1999 మధ్య సింహాద్రి సత్యనారాయణ మూడు సార్లు ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి గెలిచారు. దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయనకు దేవుడు మంత్రి అనే పేరు కూడా ఉంది. చంద్రశేఖర్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 138,45,33,974 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.
వీరిద్దరికీ ఒక సారూప్యత ఉంది. ఇద్దరూ వైద్యులు. అయితే పెమ్మసాని టీచింగ్‌ రంగంలో నిపుణులు. సింహాద్రి ట్రీట్‌మెంట్‌ రంగంలో నిష్ణాతులు. అమెరికాలో తాను తయారు చేసిన టీచింగ్‌ మెటీరియల్‌ను విక్రయించి కోట్లు సంపాదించారు పెమ్మసాని. సింహాద్రి క్యాన్సర్‌ రోగులకు వైద్య సేవలు అందించడంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. దేశ, విదేశాల్లోని ఎంతో మంది రాజకీయ నాయకులకు, వ్యాపార వేత్తలకు వైద్య సేవలందించడంతో ఆయనకు ప్రపంచ గుర్తింపు లభించింది. ఇద్దరూ చంద్రశేఖర్లే. ఒకరు టీడీపీ నుంచి మరొకరు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉన్నారు. రాజకీయ రంగంలో ఇద్దరూ మొదటి సారే అడుగుపెట్టారు. వయసులో సింహాద్రి పెద్దవాడు కాగా పెమ్మసాని చిన్నవాడు.
వీరి ఇరువురి గెలుపు, ఓటములపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పెమ్మసానిపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పొన్నూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పోటీలో ఉన్నారు. సింహాద్రి చంద్రశేఖర్‌పై ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ వల్లభనేని బాలశౌరి రంగంలో ఉన్నారు. గుంటూరులో టీడీపీకే అనుకూల పవనాలు వీస్తుండగా, మచిలీపట్నంలో ఎన్డీఏ కూటమికి అనుకూలత ఉన్నట్లు ఓటర్లలో చర్చ సాగుతోంది.
Read More
Next Story