
బోండా ఉమా వ్యాఖ్యలు–పవన్ కల్యాణ్ సమీక్షలు
పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాల్ని పొందాలని భావించేవారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకి పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉప ముఖ్యమంత్రి వపన్ కల్యాణ్‌పైన, ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపైన, రాష్ట్రంలో నెలకొన్న కాలుష్యాలపైన ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నేటికీ కలకలం రేపుతూనే ఉన్నాయి. అదే రోజు పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్, అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్, సోమవారం కూడా మరో సారి రివ్యూ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలిపై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు చేసిన ఆరోపణల క్రమం, మండలి సిబ్బంది, బాధ్యతలపై చర్చించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అనేది చట్టబద్ధమైన సంస్థ అనీ, ఈ మండలి విధుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ పాక్షికంగా ఉంటుందని అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు.
భావి తరాలకు సాధ్యమైనంత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి చట్టబద్ధమైన సంస్థ.. దీనిని బలోపేతం చేయాలన్నారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే... కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్ళాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది... విధులు సమగ్ర నివేదిక సిద్ధం చేయండి అని అధికారులను ఆయన ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియాలని సూచించారు. మనకు మన పెద్దలు అందించినంత స్వచ్ఛమైన గాలి, నీరు భావి తరాలకు ఇవ్వగలమా? సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను అందించే లక్ష్యంతో పని చేయాలి. గోదావరి పరీవాహక ప్రాంతంలో సైతం నీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోంది.. అక్కడి నీరు కలుషితం కావడానికి ఆక్వా రంగం, పేపర్ మిల్లులు కారణంగా ఉన్నాయి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ లాంటి శాఖలపై ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించి, నియంత్రణ ఉంటుందని... పీసీబీ నిర్ణయాలు, విధుల నిర్వహణపై పర్యవేక్షణలో కొన్ని పరిమితులు ఉంటాయని, పీసీబీ కార్యనిర్వహక మండలికి చట్టబద్ధంగా అధికారాలు ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ – రాష్ట్రానికి పెట్టుబడులకు ప్రోత్సహిస్తూనే కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ పేరిట పారిశ్రామికవేత్తలను పారిపోయే పరిస్థితి తీసుకురాకూడదు. గత ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలే చోటు చేసుకున్నాయి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థలలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ప్రాంతంలో ఉన్న ఫార్మా సంస్థలు ఉన్నాయి. వాటిలో కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నిబంధనల అమలులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన తొలి రోజుల్లోనే పీసీబీపై సమీక్షించి దిశా నిర్దేశం చేశామన్నారు.
ఈ ప్రశ్నలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి
ఈ సందర్భంగా– అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని ప్రశ్నలు ఉంచారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది ఎందరు, వారి విధులు ఏమిటి? అందులో రెగ్యులర్ ఉద్యోగులెందరు? సిబ్బంది కొరత ఎంత? కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏ మేరకు ఉన్నారు? వారికి అప్పగిస్తున్న విధులేమిటి? అంశాలతోపాటు విధుల నిర్వహణకు మండలికి ఉన్న మౌలిక సదుపాయాలూ, వారికి ఇచ్చే ఆర్ధిక వనరులు, ఆడిట్ ఏ విధంగా చేస్తున్నారు, ఆడిట్ లో గుర్తించిన అంశాలేమిటి, కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటి వరకూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంశంపై ఏ మేరకు దృష్టి సారించింది, వాటి ఫలితాలు ఏమిటి, అనుసరిస్తున్న సాంకేతికత ఏమిటి, కాలుష్య నియంత్రణ మండలి వెబ్ సైట్ పని తీరు ఎలా ఉంది, ప్రాంతాలవారీగా జల, వాయు, శబ్ద కాలుష్యాల వివరాలు అప్ డేట్ చేస్తున్నారా, ప్రజలకు ఏ మేరకు సమాచారం అందుబాటులో ఉంటోంది, లాంటి పలు ప్రశ్నలను ముఖ్య కార్యదర్శి ముందు ఉంచారు. ఈ ప్రశ్నలపై సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. పీసీబీతో తొలి సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావించానని, అసెంబ్లీలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అక్కడే వివరాలు అందించామని ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రస్తావించారు. అధికారులు సమగ్ర నివేదిక అందించాక... అవగాహన కలిగేలా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేద్దామన్నారు.
రాష్ట్రంలో కాలుష్య, పర్యావరణ కార్యక్రమాల్లో యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా క్షేత్ర స్థాయి వరకూ అవగాహన పెరుగుతుందన్నారు. పరిశ్రమల నిర్వాహకులను, అకడమిక్ రంగంతో అనుసంధానిస్తే కాలుష్య నియంత్రణలో ఆర్ అండ్ డి అభివృద్ధి చెందుతుందన్నారు. పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాల్ని పొందాలని భావించేవారి విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని అధికారులకి ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.
Next Story