
బాంబు బెదిరింపులు–విజయవాడలో తనిఖీలు
ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డులో వ్యాపారస్తులు, ప్రజలు హడలి పోతున్నారు.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో విజయవాడ నగరం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అనుమానితుల కోసం గాలింపులు చేపడుతున్న నేపథ్యంలో బాంబుల బెదిరింపులు తెరపైకి వచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డులో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని ఆగంతకులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్లు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళం మిస్ కాకుండా జల్లెడ పడుతున్నారు. దీంతో ప్రాంతంలో ఒకింత ఆందోళనకర పరిస్థతులు నెలకొన్నాయి.
హైదరాబాద్‌లో కోటి ఎలాగో విజయవాడలో బీసెంట్ రోడ్డు అలాగా. ఇటు పక్క బందరు రోడు రాఘవయ్య పార్కు నుంచి అటువైపు ఏలూరు రోడ్డు వరకు సుమారు కిలోమీటరు దూరం విస్తరించి ఉంటుంది. ఇరువైల షాపులతో పెద్ద వ్యాపార కేంద్రంగా మారింది. వేలాది మంది వినియోగదారులతో ఈ ప్రాంతం నిత్యం కిక్కిరెసి ఉంటుంది. సాయంత్రం అయితే నడిచేందుకు కూడా సందుండదు. ఉదయం 9 గంటల నుంచే ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు మొదలైపోతాయి.
ఇలాంటి బీసెంట్ రోడ్డుకు బాంబు బెదిరింపు కాల్స్ పోలీసులకు వచ్చాయి. బీసెంట్ రోడ్డులు బాంబులు పెట్టినట్లు శనివారం ఉదయం గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేశాడు. మరి కాసేపట్లో ఆ బాంబు పేలే అవకాశం ఉందని ఆ ఆగంతకుడు చెప్పడంతో ఒక్క సారిగా విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు జల్లెడ పట్టారు. బందరు రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు బీసెంట్ రోడ్డులోని ప్రతి అంగుళం జల్లెడ పడుతున్నారు. ఏ ప్రదేశం మిస్ కాకుండా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసెంట్ రోడ్డులోని షాపులన్నింటినీ క్లోజ్ చేయించారు. ఈ ప్రాంతంలోకి స్థానికులు, ప్రజలు, వ్యాపారస్తులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు పూర్తి అయ్యేంత వరకు ఎవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలో అలజడి వాతావరణం నెలకొంది. బాంబులు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ ఎవరు చేశారనే దానిపైన కూడా పోలీసులు రంగంలోకి దిగారు.
Next Story